మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:16:31

కరోనాపై సమగ్ర ప్రచారం

కరోనాపై సమగ్ర ప్రచారం

  • వ్యాధిపై ప్రజలకు పత్రికల ద్వారా అవగాహన
  • అప్రమత్తంగా లేకపోతే ఆరోగ్య విపత్తు: హైకోర్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనాపై ప్రజలకు అవగాహన పెరిగేలా సమగ్ర సమాచారం ఇవ్వాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా కేసులపై వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో సమగ్ర సమాచారం ఇవ్వడంలేదని హైదరాబాద్‌ నారాయణగూడకు చెందిన అమృత ఆర్యేంద్ర పిల్‌ దాఖలుచేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ప్రస్తుత పరిస్థితిపై ప్రజలకు సమగ్ర సమాచారం, అప్రమత్తత లేకపోతే అది ఆరోగ్య విపత్తు (మెడికల్‌ డిజాస్టర్‌)కు దారితీస్తుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు వాదనలు వినిపిస్తూ  రోజువారీగా సమాచారం ఇవ్వడానికి అభ్యంతరం లేదని, ఇంటర్నెట్‌లో కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టులో అప్పీలుచేశాం: ఏజీ

మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయాలంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీలుచేశామని, అది విచారణకు రావాల్సి ఉన్నదని మరో కేసుకు సంబంధించి అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ధర్మాసనానికి తెలిపారు. సుప్రీం ఆదేశాలు వచ్చేదాకా తమ ఆదేశాలను అమలుచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. 


logo