శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 13:28:44

కరోనాపై అవగాహన కల్పించాలి : మంత్రి హరీశ్ రావు

కరోనాపై అవగాహన కల్పించాలి : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : కరోనా అంటే భయపడే రోగం కాదు. కరోనా గురించి గ్రామ ప్రజలందరికీ ధైర్యం చెప్పాలి. మీకు మేమున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మల్యాల గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు. జిల్లాలోని నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో సోమవారం ఘన వ్యర్థాల నిర్వహణ రిసోర్స్ పార్కు, కంపోస్టు తయారీ కేంద్రాన్ని జెడ్పీచైర్ పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ మేరకు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రూ.40 వేలు నిధులు సమీకరించగా.. అదనంగా స్వయంగా మంత్రే మరో రూ.60వేలు జోడించి కరోనా నేపథ్యంలో గ్రామస్తుల ఆరోగ్య శ్రేయస్సు కోసం మెడికల్ హెల్త్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా గురించి గ్రామ ప్రజలందరికీ ధైర్యం చెప్పాలని ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలకు మంత్రి సూచించారు. 

పీహెచ్ సీ పరిధిలో ప్రతి రోజూ 50 కరోనా పరీక్షలు జరపాలని, గ్రామంలో ప్రజలంతా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో అందరినీ ఆదుకోవాలని గ్రామ ప్రజలంతా చందాలు వేసుకుని 40 వేల రూపాయలు ఇచ్చారని, తానూ మిగతా 60 వేలు కలిపి లక్ష రూపాయలతో ఆరోగ్య కిట్స్ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మల్యాలను స్వచ్ఛ గ్రామంగా మార్చి జాతీయ అవార్డు సాధించాలన్నారు.  గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చాలని ప్రజలను మంత్రి కోరారు.


logo