సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 20, 2021 , 20:08:15

'అడవుల రక్షణ, పునరుజ్జీవనం ప్రాతిపదికగా అవార్డుల ప్రదానం'

'అడవుల రక్షణ, పునరుజ్జీవనం ప్రాతిపదికగా అవార్డుల ప్రదానం'

హైద‌రాబాద్ : అడ‌వుల ర‌క్ష‌ణ‌, పున‌రుజ్జీవ‌నం, ప‌చ్చ‌ద‌నం పెంపు ప్రాతిప‌దిక‌గా సిబ్బందికి గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా అవార్డులు ప్ర‌దానోత్స‌వం చేయ‌నున్న‌ట్లు పీసీసీఎఫ్ ఆర్. శోభ తెలిపారు. అన్ని జిల్లాల అటవీ అధికారులతో ఆమె బుధ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. అడవుల రక్షణ, పునరుజ్జీవనం, పచ్చదనం పెంపుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తున్న సిబ్బందిని ప్రోత్సహించాలని అటవీశాఖ నిర్ణయించిన‌ట్లు తెలిపారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాల వారీగా ఆరు కేటగిరీల్లో అటవీశాఖ సిబ్బందిని నగదు ప్రోత్సాహంతో కూడిన ప్రశంసా పత్రాన్ని అందించనున్న‌ట్లు చెప్పారు.

జిల్లా స్థాయిలో జరిగే వేడుకల్లో ఈ అవార్డుల ప్రదానం జరుగుతుందన్నారు. జంగల్ బచావో – జంగల్ బడావో నినాదంతో తెలంగాణకు హరితహారం ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు ఈ ఎంపికకు ప్రాతిపదిక కానున్నాయి. మంచి నర్సరీల నిర్వహణ, పెద్ద మొక్కల పెంపు, నాటిన మొక్కల సంరక్షణ, అటవీ రక్షణ పద్దతులు, చక్కటి పునరుజ్జీవన చర్యలు, అడవుల్లో నీటి సంరక్షణ, గడ్డి మైదానాల వృద్ధి, హరితహారంలో వివిధ వర్గాల భాగస్వామ్యం వంటి అంశాల‌ను పరిగణలోకి తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. అడవుల్లో క్షేత్ర స్థాయిలో పనిచేసే బీట్ అధికారి, సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లను ప్రోత్సాహకాల కోసం పరిగణిస్తారన్నారు.

వచ్చే హరితహారం సీజన్ కోసం పెద్ద మొక్కల పెంపకం అన్ని నర్సరీల్లో చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం కనీసం ఒకటిన్నర మీటరు ఎత్తైన మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.దోబ్రియల్ తెలిపారు. కంపా నిధుల కింద చేపట్టిన అటవీ అభివృద్ది పనుల్లో అలసత్వం ఉపేక్షించేది లేద‌న్నారు. చేపట్టిన పనులను థర్డ్ పార్టీ ద్వారా సమీక్షించటం, ఆమేరకు నిధుల విడుదల ప్రణాళికలు సిద్దం చేయాలని తెలిపారు. ఏ దశలోనైనా పొరపాట్లు జరిగితే తదుపరి చర్యలకు సంబంధిత అధికారులు సిద్దంగా ఉండాలని పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్ హెచ్చరించారు. ఈ స‌మావేశంలో పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు సిద్దానంద్ కుక్రేటీ, ఎం.సీ. పర్గెయిన్, ఇతర అధికారులు, అన్ని అటవీ సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులు, రేంజ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

VIDEOS

logo