బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 22:26:03

క్యాన్సర్ రావొద్దంటే ఇవి మానండి

క్యాన్సర్ రావొద్దంటే ఇవి మానండి

ఆధునిక జీవనశైలి కొన్ని రకాల క్యాన్సర్లను కూడా ప్రేరేపిస్తుందనడం వాస్తవం. అందుకే మన అలవాట్లు, ఆహార విధానాలు మార్చుకుంటే క్యాన్సర్ రాకుండా కొంతవరకు నివారించవచ్చు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే అయిదు రకాల పదార్థాలకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు నిపుణులు.

  • అందమైన కవర్లలో ప్యాక్ చేసి ఆకర్షణీయంగా కనిపించే రెడీమేడ్ ఆహార పదార్థాలు తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఇలాంటి ప్రాసెస్ చేసిన పదార్థాల్లో క్రుత్రిమ రంగులు, రసాయనాలతో తయారుచేసిన ఫ్లేవర్లు, ఉప్పు, చక్కెర లాంటివి ఎన్నో కలుపుతారు. కేవలం ఉప్పు ఉన్న పదార్థాలే జీర్ణ కోశ క్యాన్సర్ అవకాశాన్ని 10 శాతం పెంచుతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఉప్పు ఎక్కువగా ఉన్నవే కాకుండా, నిలవ చేసిన పదార్థాలు, క్రుత్రిమ రంగులు, అడిటివ్స్ వల్ల జీర్ణకోశ క్యాన్సర్ అవకాశాలు పెరుగుతాయి.
  •  రెడ్ మీట్ ఎక్కువగా తినేవారిలో పెద్దపేగు, జీర్ణకోశ క్యాన్సర్ల అవకాశం ఎక్కువ. ప్రాసెస్ చేసి రెడీ టు ఈట్ గా తయారుచేసిన మాంసాహారంలో సోడియం నైట్రైట్, సోడియం నైట్రేట్ లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ అవకాశాన్ని పెంచే కారకాలుగా మారుతాయని ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో తేలింది. రోడ్డు మీద కాల్చి అమ్మే మాంసాహార పదార్థాలు కూడా తినకూడదు.
  •  చక్కెర వల్ల క్యాన్సర్ కణాలు వేగంగా పెరుగుతాయని అంటుంటారు. కాని దీనికి స్పష్టమైన రుజువులేమీ లేవు. అయితే చక్కెర పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కేలరీలు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది. దీంతో హార్మోన్లలో తేడాలు వస్తాయి. ఫలితంగా రొమ్ము, పెద్దపేగు, గర్భసంచి క్యాన్సర్ల అవకాశాలుంటాయి.
  •  చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టం లేనివాళ్లు ఉండరు. ఇలాంటి స్నాక్స్ లో అక్రిలమైడ్ అనే క్యాన్సర్ కారకం ఉంటుంది. ఆహారపదార్థాలను ఎక్కువ ఉష్ణోగ్రతల్లో వేడి చేసినప్పుడు అంటే వేపుడు, బేకింగ్ లాంటివి చేసినప్పుడు ఇది తయారవుతుంది. దీర్ఘకాలం పాటు అక్రిలమైడ్ కి ప్రభావితం కావడం వల్ల ఎలుకల్లో కణుతులు ఏర్పడినట్లు అధ్యయనాల్లో స్పష్టమైంది. ఇటువంటి ఆహార పదార్థాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు గుండెజబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ల అవకాశం పెంచడంతో పాటు క్యాన్సర్ కారకాలుగా కూడా పనిచేస్తాయి.
  •  ఆల్కహాల్ తీసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కానీ అతిగా ఆల్కహాల్ తీసుకుంటున్నారంటే క్యాన్సర్ ని ఆహ్వానించినట్టే. ఆల్కహాల్  తీసుకోవడానికి, క్యాన్సర్ కి సంబంధం ఉందని అనేక రకాల రుజువులున్నాయి. నోరు, గొంతు, కాలేయం, పెద్దపేగు క్యాన్సర్లే కాకుండా రొమ్ము క్యాన్సర్ కి కూడా ఇది దోహదం చేస్తుంది. 


logo