సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 20:25:43

వాస్తవాలను వక్రీకరించడం మానుకోవాలి : బాజిరెడ్డి గోవర్ధన్‌

వాస్తవాలను వక్రీకరించడం మానుకోవాలి : బాజిరెడ్డి గోవర్ధన్‌

నిజామాబాద్‌ రూరల్‌ : ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేయడం తగదని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ హితవు పలికారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ... కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా వైరస్‌ బారిన పడిన బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుందని తెలిపారు.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ మరణాలు దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇంత చేస్తున్నా బీజేపీ నాయకులు కళ్లుండి కబోతుల్లాగా వ్యవహరిస్తూ అసత్యాలను ప్రచారం చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. మహమ్మారిని అందరం సమష్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన బాధ్యతను విస్మరించి దుష్ప్రచారం చేస్తూ రాజకీయం చేయడం తగదన్నారు. logo