బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 12:48:23

హేమంత్, అవంతి చివ‌రి ఫోటో ఇదే.. అస‌లేం జ‌రిగింది?

హేమంత్, అవంతి చివ‌రి ఫోటో ఇదే.. అస‌లేం జ‌రిగింది?

హైద‌రాబాద్ : చ‌ందాన‌గ‌ర్‌కు చెందిన హేమంత్ హ‌త్య రాష్ర్ట వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. హేమంత్ హ‌త్య కంటే ముందు అసలేం జ‌రిగింది? అవంతిని వ‌దిలేసి హేమంత్‌ను ఒక్క‌డేనా ఎందుకు అప‌హ‌రించారు? హేమంత్‌ను ఎవ‌రు హ‌త్య చేశారు? హ‌త్య కంటే ముందు హేమంత్‌, అవంతి చివ‌ర‌గా ఎక్క‌డ క‌లుసుకున్నారు? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. వీట‌న్నింటికి అవంతి స‌మాధానం చెప్పింది.

నేను, హేమంత్ ఈ ఏడాది జూన్ 10న ప్రేమ వివాహం చేసుకున్నాం. గ‌చ్చిబౌలిలో నివాస‌ముంటున్నాం. గురువారం సాయంత్రం మా ఇంటికి మా మేన‌మామ‌లు, వ‌దిన‌లు, బావ‌లు వ‌చ్చారు. ఇంటికెళ్దామ‌ని చెప్పి ఆప్యాయంగా మాట్లాడారు. మేమిద్దరం మా కార్లో వ‌స్తాం.. మీరు మీ కారులో వెళ్లండి అని మేన‌మామ‌ల‌కు చెప్పాను. వారు విన‌లేదు. బ‌ల‌వంతంగా వారి కారులో హేమంత్‌ను నన్ను ఎక్కించుకున్నారు. మెయిన్ రోడ్డుపైకి వెళ్లిన త‌ర్వాత మా ఇంటికి వెళ్ల‌కుండా ఔట‌ర్ రింగ్ రోడ్డుపైకి తీసుకెళ్లారు. ఆ స‌మ‌యంలో హేమంత్ నేను కారులో నుంచి దూకేశాం. 

కాసేప‌టికే మేన‌మామ యుగంధ‌ర్ రెడ్డి కారులో ఇద్ద‌రు గుండాలు వ‌చ్చి హేమంత్‌ను బ‌ల‌వంతంగా లాక్కెళ్లారు. ఆ త‌ర్వాత ఎక్క‌డికి తీసుకెళ్లారో తెలియ‌దు. నేను 100కు డ‌య‌ల్ చేయ‌డంతో పోలీసు పెట్రోలింగ్ వాహ‌నం వ‌చ్చింది. ఆ త‌ర్వాత మిగ‌తా బంధువులు న‌న్ను ప‌ట్టించుకోకుండా అక్క‌డ్నుంచి వెళ్లిపోయారు. నేను మా అత్త‌య్య‌, మామ‌తో క‌లిసి గ‌చ్చిబౌలి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాం అని అవంతి తెలిపింది. 

మొత్తంగా హేమంత్‌ను యుగంధ‌ర్ రెడ్డి, ఇద్ద‌రు గుండాలు హ‌త్య చేసి సంగారెడ్డి జిల్లా కిష్ట‌య్య‌గూడెం వ‌ద్ద మృత‌దేహాన్ని ప‌డేసి వెళ్లిపోయారు. హేమంత్ మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 


logo