శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 01:46:35

కాబోయే తల్లికి కవచంలా

కాబోయే తల్లికి కవచంలా

  • గిరిజన గర్భిణుల కోసం బర్త్‌ వెయిటింగ్‌ రూమ్స్‌
  • ఉట్నూర్‌ సర్కారు దవాఖానలో అందుబాటులోకి
  • 3 నెలలుగా సేవలు.. వానకాలం కష్టాలకు తెర
  • సత్ఫలితాలనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలు

అది ఆదిలాబాద్‌ జిల్లా.. అక్కడ చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాలే.. అన్నీ గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు.. కొండకోనల్లో నివాసాలు.. పైగా మధ్యమధ్యలో వాగులు, వంకలు అడ్డుపడ్తాయి. వానకాలం వచ్చిదంటే అటు వాహనాలు పోలేవు, రాలేవు.. ఇలాంటి సమయంలో ఎవరన్నా గర్భిణులు ఉండి, పురిటినొప్పులు వస్తే.. ఆ నరకం వర్ణణాతీతం. వాగులను దాటుకొంటూ వాళ్లను ఎడ్లబండ్లు, మంచాలపై మోసుకొచ్చిన సంఘటనలూ ఉన్నాయి. ఈ దుస్థితిని గమనించిన సర్కారు.. గర్భిణుల కోసం ‘జనన నిరీక్షణ’ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రసవ సమయంలో కావాల్సిన బలవర్ధకమైన ఆహారాన్ని అందించి తల్లీబిడ్డ ప్రాణాలను కాపాడుతున్నది.

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ: వానకాలం వస్తే వాళ్లకు వెతలుతప్పవు.. రవాణా ఉండదు.. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే సకాలంలో వైద్యం అందక మరణించిన వారెందరో ఉన్నారు.. ఎంతో మంది గర్భిణులు ప్రాణాలు విడిచినవారూ ఉన్నారు.. ఇదీ! ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల పరిస్థితి. ఇలాంటి గ్రామాలు జిల్లాలో 70 వరకు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ఉండే గర్భిణులకు సుఖ ప్రసవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చివరి నిమిషంలో గర్భిణులను దవాఖానకు తరలించేటప్పుడు ఇబ్బందులు ఎదురై ప్రాణాలు పోయిన సంఘటనలు కోకొల్లలు. అందుకే కాన్పు తేదీకి పది రోజుల ముందుగానే వారిని తరలించి, వైద్య సహాయం అందించే గొప్ప కార్యక్రమానికి పూనుకొన్నది. అందుకు ఉట్నూరు ప్రభుత్వ దవాఖానలో జనన నిరీక్షణ గదులను(బర్త్‌ వెయిటింగ్‌ రూం)ఏర్పాటు చేసింది. అక్కడికి గర్భిణులను తరలించి వైద్యుల పర్యవేక్షణలో సుఖప్రసవం జరిగేలా చూస్తారు. అనంతరం తల్లీబిడ్డలకు అవసరమైన వైద్య సేవలు అందించి, ఉన్నన్ని రోజులు బలవర్ధకమైన ఆహారాన్ని అందించి, అంబులెన్స్‌లో ఇంటికి పంపిస్తారు. ఇలా.. ఈ వానకాలంలో ఇప్పటి వరకు 14 మంది గర్భిణులు ఈ సేవలను వినియోగించుకున్నారు.

సౌకర్యాలు భేష్‌


జనన నిరీక్షణ గదుల్లో దోమ తెరలతో కూడిన బెడ్స్‌ ఉంటాయి. ప్రసవం సమయంలో ఇబ్బందులు లేకుం డా రక్తాన్ని అందుబాటులో ఉంచుతారు. హిమోగ్లోబిన్‌ శాతం పెరిగేందుకు డ్రై ఫ్రూట్స్‌, పండ్లు ఇస్తారు. వీటితోపాటు పది రోజులకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులను అందిస్తారు. గర్భిణులతో పాటు వారితో వచ్చిన వారికి కూడా భోజనం అందిస్తారు. కాలక్షేపం కోసం ముందు గదిలో టీవీని ఏర్పాటు చేశారు.

సుఖ ప్రసవాలే లక్ష్యం

రవాణా సౌకర్యాలు సరిగా లేని గ్రామాల్లో గర్భిణులు ఇబ్బందులుపడకుండా, సుఖ ప్రసవాలు జరిగేలా బర్త్‌ వెయిటింగ్‌ రూంలను ప్రారంభించాం. 70 ప్రభావిత గ్రామాలను ముందుగానే గుర్తించి, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గర్భిణులను డెలివరీకి పది  రోజుల ముందుగానే ఈ కేంద్రానికి తీసుకువస్తాం. వైద్యులు వారిని  నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. గర్భిణులకు హిమోగ్లోబిన్‌, ఇతర ఆరోగ్య సమస్యలు    ఉంటే ఈ కేంద్రంలో వైద్యం అందిస్తున్నాం.

- కుడ్మిత మనోహర్‌, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి, ఆదిలాబాద్‌ 

వానకాలంలో ఇక్కట్లకు చెక్‌..

వానకాలంలో రవాణాపరమైన సమస్యల కారణంగా గర్భిణులకు పురిటినొప్పులు వస్తే కుటుంబసభ్యులు ఎడ్లబండ్లు, మంచాలపై మోసుకుంటూ రోడ్డుదాకా తీసుకువచ్చేవారు. ఏటా వానకాలంలో కురిసే వానలతో వాహనాల రాకపోకలు నిలిచిపోయేవి. గ్రామాలకు 104, 108 వాహనాలు వెళ్లడానికి వీలుండేదికాదు. ఈ సమస్యను గుర్తించిన ఉట్నూరు ఐటీడీఏ, వైద్యశాఖ అధికారులు పకడ్బందీ ప్రణాళికలు తయారుచేశారు. ఉట్నూర్‌ ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేక భవనాన్ని నిర్మించి, గర్భిణులకు అన్ని సౌకర్యాలతో కూడిన జనన నిరీక్షణ గదులను  ఏర్పాటు చేశారు.

పది రోజుల ముందుగానే.. 

గర్భిణులకు నెలలు నిండుతాయని తెలియగానే, పది రోజుల ముందే జనన నిరీక్షణ గదులను తీసుకువస్తారు. వారి బంధువులు ఉండేందుకు కూడా సౌకర్యాలు కల్పిస్తారు. 24 గంటల పాటు ఇద్దరు హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఓ సహాయకుడు అందుబాటులో ఉండి గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తారు. ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చి, వైద్యం అందిస్తారు. మూడు నెలల కాలంలో ఇక్కడ 14 ప్రసవాలు జరిగాయి.