సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 13, 2020 , 01:49:31

సొంత భవనం ఉంటేనే అటానమస్‌!

సొంత భవనం ఉంటేనే అటానమస్‌!

  • కాలేజీలకు మోయలేని భారంగా నిబంధన
  • జాతీయ నూతన విద్యావిధానంలో ప్రతిపాదన
  • ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాల అభ్యంతరాలు
  • గతేడాది అద్దె భవనాలకు ఏఐసీటీఈ ఆమోదం 

డిగ్రీ, పీజీ కాలేజీల్లో 10% మాత్రమే సొంత భవనాలుండగా, మిగతా 90% అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. జాతీయ నూతన విద్యావిధానం ప్రకారం దేశంలోని ఎన్ని కాలేజీలు సొంత భవనాలకు మారుతాయి? స్వతంత్ర హోదా దక్కడానికి ఎంత సమయం పడుతుంది? అందుకోసం ఎంత ఖర్చు అవుతుంది? 


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జాతీయ విద్యావిధానంలోని ప్రతిపాదనలు ప్రైవేటు కళాశాలలపై మోయలేని భారం కానున్నాయి. కాలేజీకి ప్రత్యేకించి సొంత భవనం ఉంటేనే అటానమస్‌ హోదా ఇస్తామనే ప్రతిపాదనపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. జాతీయ నూతన విద్యావిధానం ప్రతిపాదనల ప్రకారం దేశంలోని అన్ని కాలేజీలు స్వతంత్ర (అటానమస్‌) హోదా తెచ్చుకోవాలి. ఈ మేరకు మౌలిక వసతులు, నాణ్యతా ప్రమాణాలు పెంపొందించుకోవాలి. అందులో ముఖ్యంగా అన్ని కళాశాలలు సొంత భవనాలు కలిగి ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా వంటి కాలేజీల్లో 60% మాత్రమే సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. డిగ్రీ, పీజీ కాలేజీల్లో 10% మాత్రమే 

 సొంత భవనం ఉంటేనే అటానమస్‌!

సొంత భవనాలుండగా, మిగతా 90% అద్దె భవనాలల్లోనే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) ప్రకారం దేశంలోని ఎన్ని కాలేజీలు సొంత భవనాలకు మారుతాయి? స్వతంత్ర హోదా దక్కడానికి ఎంత సమయం పడుతుంది? అందుకోసం ఎంత ఖర్చు అవుతుంది? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇంజినీరింగ్‌ కాలేజీలు, యూనివర్సిటీలకు గుర్తింపు ఇచ్చే నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రెడిటేషన్‌ (ఎన్‌బీఏ), నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) గుర్తింపు దక్కాలన్నప్పటికీ సొంత భవనాల్లోనే కాలేజీలు కొనసాగాలన్న నిబంధనలు ఉన్నాయి. అయితే, అద్దె భవనాల్లో కొనసాగుతున్న కాలేజీలకు అనుమతులు ఇచ్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గత ఏడాది ఆమోదం తెలిపింది. ఈ అంశంపై తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీసీ ప్రకాశ్‌ మాట్లాడుతూ దాదాపు 15 ఏండ్ల వరకు కాలేజీలన్నీ అటానమస్‌ హోదా తెచ్చుకోవాల్సి ఉందన్నారు. ఈ లోగా అన్ని కాలేజీలు కూడా సొంత భవనాలు ఏర్పాటుచేసుకోవడానికి సమయం ఉంటుందని పేర్కొన్నారు. అటానమస్‌కు హోదాకు సొంత భవనాలు ఉండాలన్న నిబంధనలు పాటించడం కష్టమే అని, కొన్ని సడలింపులు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.


logo