గురువారం 28 మే 2020
Telangana - May 19, 2020 , 13:07:38

ఆటో డ్రైవర్ల ముఖాల్లో విరబూసిన సంతోషం

ఆటో డ్రైవర్ల ముఖాల్లో విరబూసిన సంతోషం

హైదరాబాద్‌ : నగరంలోని ఆటో డ్రైవర్ల ముఖాల్లో సంతోషం విరబూసింది. 55 రోజుల లాక్‌డౌన్‌ అనంతరం పొట్టకూటి కోసం తమ ఆటోలతో రోడ్లపైకి వచ్చిన డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆటో డ్రైవర్లు తెలిపారు. 

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా నగరంలో ఆటోలు, క్యాబ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మంగళవారం వేకువజామునే ఆటో డ్రైవర్లు.. తమ ఆటోలతో రోడ్లపైకి వచ్చారు. ఆటో స్టాండింగ్‌లో ఆటోలను నిలిపి ప్రయాణికుల కోసం వేచి చూశారు. రద్దీ ప్రాంతాలైన సికింద్రాబాద్‌, మోహిదీపట్నం, హైటెక్‌సిటీ, ఉప్పల్‌, చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్‌, అలియాబాద్‌, లాల్‌దర్వాజ ప్రాంతాల్లో ఆటోలు అధికంగా కనిపించాయి. ఒక ఆటలో ఇద్దరికి మాత్రమే అనుమతిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 

ఈ సందర్భంగా అలియాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ మసూద్‌ మాట్లాడుతూ.. తాను చాలా సంతోషంగా ఉన్నాను. ఎట్టకేలకు తన ఆటో రోడ్డుపైకి వచ్చింది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఆటోలకు అనుమతివ్వడం సంతోషాన్ని ఇచ్చింది. నిన్న రాత్రి ఆటోలకు అనుమతిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించగానే ఊపిరి పీల్చుకున్నాను. తక్షణమే తన ఆటోను నీటితో శుభ్రం చేసుకున్నాను. వేకువజాము నుంచి ఉదయం 9 గంటల వరకే రూ. 200 సంపాదించాను అని మసూద్‌ తెలిపాడు. 


logo