బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 02:18:15

బడులు నడిచేనా?

బడులు నడిచేనా?

  • పాఠశాలలు తెరువడంపై అధికారుల యోచన
  • కనీసం 120 పనిదినాలైనా ఉండాలి
  • 80 శాతం రాష్ట్రాల్లో తెరుచుకోని బడులు
  • ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు
  • వైరస్‌ తీవ్రతను బట్టి తుది నిర్ణయం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కొవిడ్‌-19 వైరస్‌ పూర్తిగా ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది? వ్యాక్సిన్‌ ఎప్పటివరకు అందుబాటులోకి వస్తుంది? అప్పటిదాకా తరగతులు ప్రారంభించే అవకాశం లేదా? డిజిటల్‌ క్లాసులనే కొనసాగించాలా? రెగ్యులర్‌ క్లాసులు లేకపోతే తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహించాలి? తదితర పలురకాల ప్రశ్నలతో విద్యాశాఖ అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పాఠశాలలను డిసెంబర్‌లో ప్రారంభించాలా? లేదా జనవరిలోనా? అనే దానిపై అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు వార్షికపరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుందని, అందుకోసం కనీసం 120 రోజులైనా తరగతులు నడుపాలని అధికారులు పేర్కొంటున్నారు. కనీసం నాలుగు నెలలైనా రెగ్యులర్‌ క్లాసులు నిర్వహించకుండా వార్షికపరీక్షలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. స్కూళ్లలో విద్యార్థులు, ఉపాధ్యాయులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవడం, శానిటైజింగ్‌ చేయడం, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి తరగతులకు హాజరుకావడం, రోజు విడిచిరోజు హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంపై అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధంచేసి, ప్రభుత్వానికి పంపించనున్నారు. 

యాక్టివిటీ విధానంలో సిలబస్‌

ప్రస్తుత పరిస్థితుల్లో 100 శాతం సిలబస్‌ను పూర్తిచేసే అవకాశాల్లేవు. దీంతో కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 70 శాతం వరకు థియరీ పాఠాలు, మిగిలిన యాక్టివిటీ బేస్డ్‌ విధానంలో విద్యాబోధన చేయనున్నారు. ఒకవేళ సాధారణ పరిస్థితులు రాకపోతే యాక్టివిటీ బేస్డ్‌ విధానంలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని, వీటిని ప్రత్యామ్నాయ విద్యాక్యాలండర్‌ విధానంగా భావిస్తున్నామని అధికారులు అభిప్రాయపడ్డారు. దూరదర్శన్‌, టీశాట్‌ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చిన డిజిటల్‌ పాఠాలను ప్రతిరోజూ 85 శాతానికిపైగా విద్యార్థులు వీక్షిస్తున్నారని పేర్కొంటున్నారు.

కొన్ని రాష్ర్టాల్లో తెరిచినా మళ్లీ మూత

దేశంలో 80 శాతం రాష్టాల్లో పాఠశాలలు ప్రారంభం కాలేదు. మిగిలిన రాష్ర్టాల్లో స్వల్పంగా తెరుచుకున్నాయి. ఇందులో పంజాబ్‌, ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాలు ఉన్నాయి. కర్ణాటకలో పాఠశాలలను ప్రారంభించినా వైరస్‌ విజృంభిస్తున్న పరిస్థితుల్లో మళ్లీ మూసివేశారు. ఢిల్లీలోనూ స్కూళ్లు తెరుచుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో రెగ్యులర్‌ క్లాసులు నిర్వహించాలా? లేదా? అన్న అంశంపై అధికారవర్గాలు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. రెగ్యులర్‌గా పాఠశాలలు ప్రారంభమైతే హాస్టళ్లు, రవాణా సదుపాయాలు సమస్యలకు పరిష్కారం చూపించాల్సి రావడంతో ఆ దిశగానూ ఆలోచనలు చేస్తున్నారు. ఒకవేళ స్కూళ్లు ప్రారంభించినా తల్లిదండ్రుల నుంచి ఎంతవరకు ఆదరణ ఉంటుంది? పిల్లలను రెగ్యులర్‌ క్లాసులకు పంపిస్తారా? ఎంతవరకు విద్యార్థుల అటెండెన్స్‌ ఉంటుంది? సగంమంది విద్యార్థులు స్కూళ్లకు రాకపోతే.. వారికోసం పరీక్షలు ఎలా నిర్వహిస్తారు? వంటి అనేక సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు కూడా విడుదల కావాల్సి ఉంటుంది. ఇప్పటివరకుఉన్న సమాచారం ప్రకారం నూటికి 60 శాతానికి పైగా తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు సుముఖంగా లేరు.