శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 19:20:03

లైంగికదాడి ఘటనపై అధికారుల విచారణ..

లైంగికదాడి ఘటనపై అధికారుల విచారణ..

హైదరాబాద్ ‌:  నాగర్‌ కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం తాగిన నలుగురు బాలురు బెదిరించి అక్కాచెల్లెళ్లపై లైంగిక దాడికి పాల్పడినట్లు వార్తలు రావడంతో స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ విచారణకు ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లా మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు సోమవారం ఘటన జరిగినట్లు భావిస్తున్న గ్రామానికి వెళ్లి విచారణ నిర్వహించారు. డిసెంబర్‌ 31న ఘటన జరగలేదని నిర్ధారించారు. ఇటీవల ఓ బాలికపై ఇద్దరు మైనర్లు లైంగిక దాడికి యత్నించిన దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించినట్లు తేల్చారు.

బాధిత బాలికకు తండ్రి లేకపోవడంతో తల్లి సంరక్షణలో ఉన్నట్లు తెలిపారు. జిల్లా మహిళాభివృద్ది సంక్షేమశాఖ అధికారి ప్రజ్వల ఆదేశాల మేరకు పోలీసులు ఇద్దరు బాలురను అరెస్టు చేశారు.  వీరిలో ఓ బాలుడికి నేర ప్రవృత్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  బాధిత బాలికను పరీక్షల నిమిత్తం నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్ర దవాఖానకు పంపారు. వైద్య పరీక్షల అనంతరం బాధితురాలిని బాలికల సంరక్షణ కమిటీ ముందు హాజరుపరుస్తామని, ఆమె సంరక్షణను కమిటీయే చూస్తుందని మహిళా శిశుసంక్షేమశాఖ అధికారి ప్రజ్వల తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, పోక్సో చట్టం కింద పరిహారం అందేలా చూస్తామని ఆమె పేర్కొన్నారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.