శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 17:15:47

గిరిజన ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

గిరిజన ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్ : వరుసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గిరిజన, ఐటీడీఏ ప్రాంతాల్లోని అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగుతున్నాయని నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయా ప్రాంతాల కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు సూచనలు చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, గిరిజన ప్రాంతాల కలెక్టర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ప్రజలందరికీ కంట్రోల్ రూమ్ నెంబర్ చేరేలా ప్రచారం చేయాలని సూచించారు. వరదల్లో, వాగుల్లో ప్రజలు ప్రమాదంలో పడకుండా తగిన హెచ్చరికలు చేయాలని, ఏదైనా అత్యవసరం ఏర్పడితే తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని వెంటనే సమాచారం అందించాలన్నారు.