బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 04, 2020 , 01:51:25

వ్యాక్సిన్‌పై ముందడుగు!

వ్యాక్సిన్‌పై ముందడుగు!

-త్వరలో జంతువులపై పరీక్షించనున్న ఆస్ట్రేలియా 

-పరిశోధనలో నిమగ్నమైన భారత్‌ బయోటెక్‌ 

-ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా క్లినికల్‌ ట్రయల్స్‌ 

-కరోనాకు మందుపై ఒక్కటైన శాస్త్రవేత్తలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భూమండలాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ కనుగొనడంలోనే ప్రపంచ శాస్తవేత్తలంతా నిమగ్నమయ్యారు. పక్కనున్నవారికి కూడా తెలియకుండాసాగే ప్రక్రియ ‘పరిశోధన’. కానీ కరోనాను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు అంతర్జాతీయంగా పరిశోధన ఫలితాలను పంచుకొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నట్టు అంచనా. ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ దాదాపు ఒకే అంశంపై పరిశోధన సాగించడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారికావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైరస్‌ను అడ్డుకోవచ్చని భావిస్తున్న రెండురకాల టీకాలను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు.  హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ కొరోఫ్లూ పేరుతో వ్యాక్సిన్‌ తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నది. అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ పాశ్చర్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఆస్ట్రియన్‌ డ్రగ్‌ కంపెనీ థెమిస్‌ బయోసైన్స్‌ కూడా వ్యాక్సిన్‌ తయారీప్రయత్నంలో ముందున్నాయి.

దేశంలో ఈ ఏడాది చివరికి ట్రయల్స్‌ 

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ సంస్థ కొరోఫ్లూ పేరుతో వ్యాక్సిన్‌ను తయారీకి ప్రయత్నిస్తున్నది. అమెరికాకు చెందిన విస్కాన్సిన్‌ వర్సిటీ, ఫ్లూజెన్‌ కంపెనీతో కలిసి రూ పొందించిన వ్యాక్సిన్‌ను ఇప్పటికే పశువులపై ప్ర యోగించారు. ఫలితాలు రావడానికి  ఆరునెలల సమయం పడుతుందని ఫ్లూజెన్‌ సహ వ్యవస్థాపకుడు గాబ్రియెల్‌ న్యూమానన్‌ తెలపారు. ఈ ఏడాది చివరినాటికి మనుషులపై క్లినికల్‌ ట్రయ ల్స్‌ చేయనున్నారు. కొరోఫ్లూ వ్యాక్సిన్‌ను కూడా ఎం2ఎస్‌ఆర్‌ లాగానే ముక్కులో(ఇంట్రానాసల్‌)వేసేలా తయారుచేస్తున్నామని చెప్పారు. ప్రయోగాలు విజయవంతమైతే ప్రపంచానికి అవసరమైన 300 మిలియన్ల వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌లోనే తయారుచేస్తామని భారత్‌ బయోటెక్‌ బిజినెస్‌ హెడ్‌ డాక్టర్‌ రాచెస్‌ ఎల్లా చెప్పారు. తమ సంస్థ 16 రకాల వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నదని, 2009లో స్వైన్‌ఫ్లూ (హెచ్‌1ఎన్‌1ఫ్లూ) నివారణకు వ్యాక్సిన్‌ను కనుగొన్నామని తెలిపారు.

అందరి లక్ష్యం ఒక్కటే  

అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ పాశ్చర్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఆస్ట్రియన్‌ డ్రగ్‌ కంపెనీ థెమిస్‌ బయోసైన్స్‌ కూడా సంయుక్తంగా చేస్తున్న పరిశోధనలకు నార్వేకు చెందిన ఓ సంస్థ నిధులు అందిస్తున్నది. వీరంతావ్యాక్సిన్‌ తయారీకోసం భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో సంప్రదింపులు జరుపుతున్నారు. పరిశోధనల వేగం చూస్తుంటే మరో ఆర్నెళ్లలో కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ రావచ్చని సీరం సంస్థ చైర్మన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. ఫ్రెంచ్‌ పబ్లిక్‌ రిసెర్చ్‌ హెల్త్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు, చైనాశాస్త్రవేత్తలు కూడా క్లినికల్‌ ట్రయల్స్‌ను ఇతరదేశాల్లో నిర్వహించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని కోరారు. హార్వర్డ్‌ డాక్టర్లు కరోనా రోగుల్లో నైట్రిక్‌ ఆక్సైడ్‌ ప్రభావంపై పరిశోధన చేస్తున్నారు. 1990 దశకంలో ఎయిడ్స్‌పై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్యులు ఏకమై పరిశోధనలు చేశారని, మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ అదే ధోరణి కనిపిస్తున్నదని ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్త హిల్‌ చెప్పారు. 

ఆస్ట్రేలియాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి 

కరోనాను అరికట్టే వ్యాక్సిన్‌ను కనుగొనడంలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పురోగతి సాధించినట్టు తెలుస్తున్నది. వైరస్‌ను అడ్డుకోవచ్చని భావిస్తున్న రెండురకాల టీకాలను వారు పరీక్షిస్తున్నారు. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్‌ యూ నివర్సిటీ నిపుణులు, అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఇనోవియాతో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కలిసి రూపొందించిన వ్యాక్సిన్‌ను జంతువులపై ప్రయోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చింది. ఈ వ్యాక్సిన్‌ సత్ఫలితాన్నిస్తే మానవాళికి వరంగా పరిణమించగలదని ఆస్ట్రేలియా నేషనల్‌ సైన్స్‌ ఏజెన్సీ పేర్కొన్నది. 


logo