e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home Top Slides భూ వేలం పారదర్శకం

భూ వేలం పారదర్శకం

భూ వేలం పారదర్శకం
  • ప్రభుత్వంపై ఆరోపణలు ఊహాజనితం
  • అవకతవకలకు ఆస్కారమే లేదు
  • కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ-ఆక్షన్‌
  • నెలరోజుల పాటు విస్తృత ప్రచారం
  • నిరాధార ఆరోపణలు చేసేవారిపై పరువు నష్టం దావా
  • ప్రభుత్వం స్పష్టీకరణ

హైదరాబాద్‌, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తరఫున హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ ఇటీవల హైదరాబాద్‌ నగర శివార్లలో నిర్వహించిన భూముల వేలంలో విధానపరమైన అవకతవకలు జరిగినట్టు కొన్ని వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది. వేలంపాటలో నైపుణ్యమున్న భారత ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఈ-ఆక్షన్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పద్ధతిద్వారా వేలం నిర్వహించినట్టు తెలిపింది. నివాస, వాణిజ్య, సంస్థాగత, ప్రజావసరాలకోసం ప్రభుత్వ భూములను వేలంవేయడం గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ జరిగిందని, దేశంలోని వివిధ రాష్ర్టాల్లో కూడా జరుగుతున్నదని తెలిపింది. ప్రభుత్వ రికార్డుల ఆధారంగా సమగ్ర వివరణతో మంగళవారం ఒక ప్రకటన విడుదలచేసింది.

అనేక రాష్ర్టాల్లో ఉన్నదే!

ఢిల్లీలోని ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (డీడీఏ), మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ లాంటి వివిధ రాష్ర్టాల్లో భూముల వేలం ప్రక్రియ నిరంతరం జరుగుతున్నదని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెవెన్యూ సముపార్జనే దీని ముఖ్య ఉద్దేశంగా అనిపిస్తున్నప్పటికీ, పట్టణాల్లో ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, రోజురోజుకూ పెరుగుతున్న నివాస, వాణిజ్య సంబంధ అవసరాలను తీర్చడం అసలు లక్ష్యమని ఆ ప్రకటన తెలిపింది. కోకాపేట, ఖానామెట్‌ భూములు నగరంలో అదనపు నివాస, కార్యాలయ అవసరాలను తీర్చడానికి ఎంతగానో దోహదపడతాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొనే భూముల వేలం నిర్వహించినట్టు పేర్కొన్నది. ఈ ప్రాంతాల్లో ఇదివరకే భూముల వేలం జరిగిందని, తాజాగా నిర్వహించిన వేలం దాని కొనసాగింపు ప్రక్రియ మాత్రమేనని వెల్లడించింది.

స్విస్‌ చాలెంజ్‌కు వీలు లేదు

- Advertisement -

వ్యక్తిగత పాటదారులు ప్లాటుకు సంబంధించిన స్థానం, ప్లాటు వైశాల్యం, ప్రధాన మార్గానికి గల అప్రోచ్‌, వాస్తు, ఇతర భౌతిక ప్రాధాన్యాల ఆధారంగానే బిడ్డింగ్‌లో పాల్గొన్నారని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. సహజంగా ఈ అంశాల ఆధారంగానే ప్లాటుకు తుది విలువ నిర్ణయిస్తారని, ప్రతి ప్లాటుకు దాని ధర మార్కెట్‌ డిస్కవరీ అనే సూత్రం ద్వారా నిర్ణయించబడుతుందన్నారు. అందుకే ఒక్కో ప్లాటుకు వేరువేరు ధరలు పలకడంలో ఆశ్చర్యం లేదని తెలిపారు. స్విస్‌ చాలెంజ్‌ విధానం ఈ తరహా వేలం ప్రక్రియకు సరిపోదని, మార్కెట్‌ నిర్ణీత విలువ లేనంతవరకు స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలో వేలంపాట నిర్వహించడానికి వీలులేదని వివరంచారు. ఎందుకంటే కనీస ధర అతి తక్కువ ఉన్నప్పుడు సరైన ధర పొందే అవకాశం ఉండదని, అలాగే కనీస ధర అతి ఎక్కువ నిర్ణయిస్తే ఎక్కువమంది వేలంలో పాల్గొనే అవకాశం ఉండదని తెలిపారు. అంతేకాకుండా స్విస్‌ చాలెంజ్‌ విధానం.. పోటీని కొందరికే పరిమితం చేస్తుందని, ఇలాంటి బహిరంగ వేలంపాట నిర్వహించడానికి అనువుగా ఉండదని పేర్కొన్నారు.

విస్తృత ప్రచారం తర్వాతే వేలం

వేలానికి సంబంధించి ఆసక్తిగల సంస్థలు, వ్యక్తులను తగు విధంగా చైతన్య పర్చేందుకు హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీలు ప్రసార సాధనాలలో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించినట్టు ప్రభుత్వ ప్రకటనలో తెలిపారు. బిడ్‌ నోటిఫికేషన్‌తోపాటు దీనికి సంబంధించిన ఇతర వివరాలను జాతీయ ప్రసార మాధ్యమాల్లో ప్రతి రెండు రోజులకు ఒకసారి చొప్పున నెలరోజులపాటు ఇచ్చామన్నారు. ఇందుకోసం M//s cbre అనే ప్రచార సంస్థ (www.cbre.co.in) సేవలను వినియోగించుకున్నామని తెలిపారు. సదరు సంస్థ ఈ-మెయిల్‌, ప్రత్యక్ష సమాచారం ద్వారా ఆసక్తిగల వ్యక్తులు, సంస్థలను ఈ వేలంలో పాల్గొనేలా ప్రోత్సహించినట్టు చెప్పారు. అంతేకాకుండా హెచ్‌ఎండీఏ ఈ వేలం విషయాన్ని ప్రపంచంలోని వివిధ దేశాల్లోగల ముఖ్యమైన భారత రాయబార సంస్థలకు ప్రత్యక్షంగా పంపినట్టు, భారత విదేశాంగ వ్యవహారాలశాఖ కూడా ఈ-ఆక్షన్‌కు సంబంధించిన ప్రకటనను, కరపత్రం, ఇతర సమాచారాన్ని విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు పంపినట్టు తెలిపారు. ఈ సమాచారం ఇప్పటికీ అందుబాటులో ఉన్నదన్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంస్థ ఆధ్వర్యంలో వేలం

ఈ ఆన్‌లైన్‌ వేలాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఈ-ఆక్షన్‌ సంస్థ ఎంఎస్‌టీసీ ఆధ్వర్యంలో నిర్వహించామని గుర్తుచేశారు. ఈ వేలంలో పాల్గొనే వారందరూ www.mstcecommerce.com/auctionhome/govts/index.jsp వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకొని నిర్ణీత ఫీజు చెల్లించినవారికి ఎంఎస్‌టీసీ లాగిన్‌ డీటెయిల్స్‌తోపాటు పాస్‌వర్డ్‌ ఇచ్చినట్టు చెప్పారు. వేలంలో పాల్గొంటున్న వారి వివరాలు, పాస్‌వర్డ్‌లు ఇతరులకే కాదు.. వేలం నిర్వహించిన హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీలకు కూడా తెలిసే అవకాశంలేదని స్పష్టంచేశారు. వేలం పూర్తయ్యాక ఎంఎస్‌టీసీ వెల్లడించే వరకు ఏ బిడ్డరు, ఏ ప్లాట్‌ను కొనుగోలు చేశారనేది బాహ్య ప్రపంచానికి తెలియనంత పకడ్బందీగా ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. ఈ వివరాలన్నీ బిడ్‌ డాక్యుమెంట్‌లో సమగ్రంగా పొందుపర్చామన్నారు. ఈ విషయాలను ప్రీ బిడ్‌ మీటింగ్‌లో ఎంఎస్‌టీసీ అధికారులు సమావేశానికి హాజరైనవారికి వివరించినట్టు తెలిపారు. బిడ్లను ఎవరైనా ప్రభావితం చేస్తారనే అపోహలకు ఆస్కారంలేదని స్పష్టంచేశారు.

ఎక్కువమంది పాల్గొనేలా ఆప్‌సెట్‌ ప్రైస్‌ నిర్థారణ

జూలై 15, 16 తేదీల్లో నిర్వహించిన వేలం సందర్భంగా కోకాపేటలోని 49.45 ఎకరాల విస్తీర్ణంగల స్థలాన్ని ఎనిమిది ప్లాట్లుగా, ఖానామెట్‌లోని 15.01 ఎకరాల విస్తీర్ణంగల స్థలాన్ని ఐదు ప్లాట్లుగా వేలం వేశామని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు. కనీస నిర్ణీత ధర (ఆప్‌సెట్‌ ప్రైస్‌) ఎకరాకు రూ.25 కోట్లుగా నిర్థారించి పాట దారులు దీనిపై రూ. 20 లక్షలు, దానికన్నా ఎక్కువగా పెంచుకొనే వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. సాధ్యమైనంత ఎక్కువమంది పాటలో పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఎకరా ధర రూ.25 కోట్లుగా నిర్ణయించామని, ప్రతి వ్యక్తి వేలం పాటను ఆన్‌లైన్‌లో ఎనిమిది నిమిషాలపాటు అందరికీ కనిపించే విధంగా చర్యలు తీసుకొన్నామని పేర్కొన్నారు. ఈ ఎనిమిది నిమిషాల కాలంలో ఎవరైనా అదనపు పాట పాడినైట్లెతే ఆ పెంచిన విలువతో మరో ఎనిమిది నిమిషాలు ఆన్‌లైన్‌లో వేలం పాడే అవకాశం కల్పించినట్టు తెలిపారు. చిట్ట చివరి ఎనిమిది నిమిషాల తర్వాత ఎవరూ ఆసక్తి చూపనప్పుడు మాత్రమే బిడ్‌ను ఖరారుచేసినట్టు వివరించారు.

ప్రీ బిడ్‌లో వివరాలు, సరళతర నిబంధనలు

జూన్‌ 25న నిర్వహించిన ప్రీ బిడ్‌ సమావేశం సందర్భంగా హాజరైన డెవలపర్లకు, వివిధ సంస్థలకు వేలానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వివరించినట్టు ప్రకటనలో తెలిపారు. ఔత్సాహికులు వ్యక్తంచేసిన సందేహాలను అధికారులు నివృత్తి చేశారన్నారు. ప్రీ బిడ్‌లో దాదాపు 80 మంది ఔత్సాహికులు పాల్గొన్నారని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనేందుకు అర్హతలు, నిబంధనలను సరళతరంగా రూపొందించి ఎక్కువమంది పాల్గొనే అవకాశం కల్పించామని వెల్లడించారు. వ్యక్తులు, కంపెనీలు, ఫర్మ్స్‌, హిందూ అన్‌డివైడెడ్‌ ఫ్యామిలీ (హెచ్‌యుఎఫ్‌), లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ (ఎల్‌ఎల్‌పీ), సొసైటీలు, ట్రస్ట్‌లు, జాయింట్‌ వెంచర్లు, పార్ట్‌నర్‌షిప్‌లు, ఎస్‌పీవీలు, కన్సార్టియంలు (నాన్‌ బైండింగ్‌) ఈ వేలంలో పాల్గొనే వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. వీలైనంత ఎక్కువమందికి ఈ ఆక్షన్‌ సమాచారం చేరవేయడమే కాకుండా అత్యధికసంఖ్యలో బిడ్డర్లు వేలంలో పాల్గొనేలా తగిన చర్యలు తీసుకొన్నామని పేర్కొన్నారు.

నిరాధార ఆరోపణలు చేస్తే పరువునష్టం చర్యలు

కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలంపాటపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని, ఊహాతీతమైనవని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఇటువంటి పారదర్శకమైన పద్ధతిని తప్పుబట్టడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని స్పష్టంచేసింది. ఇకముందు ఇలాంటి కల్పిత ఆరోపణలపై న్యాయ పరమైన పరువు నష్టం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టంచేసింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భూ వేలం పారదర్శకం
భూ వేలం పారదర్శకం
భూ వేలం పారదర్శకం

ట్రెండింగ్‌

Advertisement