శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 08, 2020 , 02:28:39

చౌటుప్పల్‌లో కోమటిరెడ్డి వీరంగం

చౌటుప్పల్‌లో కోమటిరెడ్డి వీరంగం

  • మున్సిపల్‌ చైర్మన్‌పై దాడి 
  • రసాభాసగా మున్సిపల్‌ కోఆప్షన్‌ ఎన్నిక 

చౌటుప్పల్‌: చౌటుప్పల్‌ మున్సిపల్‌  కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల మధ్య వాయిదాపడింది. కోరానికి సరిపడా కౌన్సిలర్లు లేనప్పటికీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమావేశానికి వచ్చి వీరంగం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు అధ్యక్షతన సమావేశం జరిగాల్సి ఉంది. అందుకు భిన్నంగా ఎమ్మెల్యే సమావేశం నిర్వహించేందుకు పూనుకు న్నారు. తన అధ్యక్షతన నిర్వహించాల్సిన ఎన్నికల ఘట్టాన్ని తాను రాకుండానే ఎలా జరుపుతారని మున్సిపల్‌ చైర్మన్‌.. కమిషనర్‌ను నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేందుకు ఎమ్మెల్యే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. తమ మహిళా కౌన్సిలర్‌(టీఆర్‌ఎస్‌)ను ప్రలోభపెట్టి అనుకూలంగా ఓటు వేయించుకొనేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి.. మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే.. మున్సిపల్‌ చైర్మన్‌ వీపుపై గట్టిగా కొట్టడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.  కోరానికి సరిపడా కౌన్సిలర్లు లేకపోవడంతోనే ఎమ్మెల్యే  లా అండ్‌ ఆర్డర్‌కు భంగం కల్గించేందుకు పూనుకున్నందునే ఎన్నికను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించి మున్సిపల్‌ చైర్మన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఎన్నికను  నిర్వహించాల్సిందేనని రాజగోపాల్‌రెడ్డి పట్టుబట్టి సమావేశ మందిరంలోనే కూర్చున్నారు. నిబంధనల ప్రకారం చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేసినందున  ఎన్నికను నిర్వహించే అధికారం తమకు లేదని మున్సిపల్‌ కమిషనర్‌ రాందుర్గారెడ్డి తెలిపారు. ఎన్నికను వాయిదా వేస్తున్నట్టుగా కమిషనర్‌ ప్రకటించారు. అనుమతి లేనప్పటికీ ఎమ్మెల్యే పీఏ సతీశ్‌రెడ్డి కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం సమావేశంలోకి వచ్చారు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళన చేయడంతో అతడిని సమావేశ హాలు నుంచి పోలీసులు బయటకు పంపించారు.


logo