శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 19:14:49

దళితులపై దాడి అమానుషం : ఎర్రోళ్ల శ్రీనివాస్‌

దళితులపై దాడి అమానుషం : ఎర్రోళ్ల శ్రీనివాస్‌

కరీంనగర్‌ : దళితులపై దాడి అమానుషమని, చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం మండలంలోని రామోజీపేటలో బాధిత దళిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా కలిసి ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రామోజీపేటలో దళితులపై నాలుగు రోజుల క్రితం జరిగిన దాడి అమానుషమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకుండా కలెక్టర్‌, ఎస్పీ పర్యవేక్షించాలన్నారు. బాధితులకు పూర్తి అండగా ఎస్సీ కమిషన్‌ ఉంటుందన్నారు.

తొమ్మిది మంది బాధిత కుటుంబాలకు రూ : 25 వేల చొప్పున తక్షణ సహాయం కింద చెక్కును అందజేస్తున్నామని చెప్పారు. అందుబాటులో ఉన్న పలువురికి చెక్కులు అందజేశారు.  కార్యక్రమంలో రాష్ట్ర ఆహార భధ్రత కమిషన్‌ సభ్యుడు ఓరుగంటి ఆనంద్‌, జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, జిల్లా ఎస్పీ రాహూల్‌ హెడ్గే, డీఎస్పీ చంద్రశేఖర్‌, ఆర్డీవో శ్రీనివాస్‌ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ సభ్యులు రాంపాల్‌ నాయక్‌, విద్యాసాగర్‌, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, తాసీల్దార్‌ రాజిరెడ్డి తోపాటు నాయకులు పాల్గొన్నారు.