గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 01:13:38

బీజేపీ కార్యాలయాలపై దాడి

బీజేపీ కార్యాలయాలపై దాడి

కూకట్‌పల్లి బీజేపీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ ధ్వంసం 

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు 

హైదరాబాద్‌/ సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్‌ దాఖలు గడువు ముగిసినప్పటికీ  కాషాయం పార్టీలో కుమ్ములాటలు ఆగడం లేదు. కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి దిష్టిబొమ్మలనే తగలబెడుతున్నారు. టికెట్లు అమ్ముకున్నారంటూ శుక్రవారం నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంతోపాటు కూకట్‌పల్లి, అల్వాల్‌, నాగోల్‌, ముషీరాబాద్‌, ఉప్పల్‌, బాలానగర్‌, ఫతేనగర్‌, మల్లాపూర్‌ డివిజన్‌లలో  కార్యకర్తలు నిరసనలకు దిగారు. పార్టీ అగ్రనేతలు రూ.30 లక్షల చొప్పున టికెట్లు అమ్ముకున్నారంటూ ఆరోపిస్తు బాలానగర్‌, ఫతేనగర్‌ డివిజన్లకు చెందిన వందల మంది కార్యకర్తలు కూకట్‌పల్లిలోని బీజేపీ కార్యాలయంపై దాడి చేసి ఆఫీసు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కిషన్‌రెడ్డి, హరీశ్‌రెడ్డికి వ్యతిరేకంగా డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. టికెట్‌ అమ్ముకున్నారంటూ పార్టీ సీనియర్‌ కార్యకర్త కన్నెగౌడ్‌ సరూర్‌నగర్‌లోని కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

బీజేపీకి అభ్యర్థులు కరువు

ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికెగిరిందట! గ్రేటర్‌లో కమలనాథుల గెలుపు మాట దేవుడెరుగు... కొన్ని డివిజన్లలో ఆ పార్టీకి అభ్యర్థులు దొరకని దుస్థితి నెలకొన్నది. ఊపర్‌ షేర్వానీ.. అందర్‌ పరేషానీ.. అన్న చందంగా  బీజేపీ పరిస్థితి! పైకి మాత్రం గ్రేటర్‌ పీఠంపై కాషాయం జెండా ఎగురవేస్తామంటూ రాజకీయ వేడిలో హాస్యాన్ని పండిస్తున్నారు. గెలుపోటములు పక్కనబెడితే.. కనీసం అన్ని డివిజన్లలో పార్టీ అభ్యర్థులను ప్రకటించలేక బీజేపీ నాయకులు చతికిలపడిపోయారు. దీంతో గత కొన్నిరోజులుగా మీసాలు మెలేస్తున్న కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ అభ్యర్థులు దొరక్క ఆగమాగం అవుతున్నారు.

బరినుంచి తప్పుకొంటున్నాం: పవన్‌

జీహెచ్‌ఎంసీ బరినుంచి జనసేన తప్పుకుంటున్నదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నానని, నామినేషన్లు వేసిన జనసేన అభ్యర్థులు ఉపసంహరించుకోవాలని సూచించారు.కాగా, రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి మద్దతుకు కాళ్లబేరానికి పోవడాన్ని తెలంగాణ బీజేపీలో ఓ వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తున్నది.