e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home తెలంగాణ ఐదు మార్గాల్లో మ్యూకోర్మైకోసిస్‌ దాడి

ఐదు మార్గాల్లో మ్యూకోర్మైకోసిస్‌ దాడి

ఐదు మార్గాల్లో మ్యూకోర్మైకోసిస్‌ దాడి
  • బ్లాక్‌ ఫంగస్‌ కుటుంబంలో ఎనిమిది రకాల జాతులు
  • రోగనిరోధకశక్తి తగ్గడంతోనే కరోనా రోగులపై పంజా
  • బాధితుల్లో 50% పోస్ట్‌ కొవిడ్‌ మధుమేహ రోగులు
  • ఆక్సిజన్‌ తీసుకోని కరోనా రోగులకూ బ్లాక్‌ ఫంగస్‌
  • రాష్ట్ర వైద్యారోగ్య ఉన్నతాధికారుల సమీక్షలోనూ చర్చ

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 25 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కరోనా రోగులను హడలెత్తిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ (మ్యూకోర్మైకోసిస్‌) కేవలం ముక్కు- మెదడులోనే కాదు.. శరీరంలోని మరో నాలుగు భాగాలపై దాడిచేసే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు స్పష్టంచేస్తున్నారు. అసలు బ్లాక్‌ ఫంగస్‌కు ప్రధాన కారణమేమిటనేదానిపై ఒకవైపు అధ్యయనాలు చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో వైద్యవర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ అనేది శరీర కణాల్లో ఏదో ఒక రకమైన మార్పునకు కారణమవుతుందని, తద్వారానే ఈ వైరస్‌ బాధితులు పెద్దఎత్తున బ్లాక్‌ ఫంగస్‌ బారినపడుతున్నారని కోఠి ఈఎన్టీ వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై శాస్త్రీయంగా అధ్యయనం జరగాల్సిన అవసరమున్నదని నిపుణులు చెప్తున్నారు.

బ్లాక్‌ ఫంగస్‌ అనేది ప్రధానంగా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి.. ఆపై కండ్లు తదుపరి మెదడుకు చేరడం ద్వారా మనిషి ప్రాణాలను హరిస్తుంది. దీనిని రైనో-ఆర్బిటో-సెరెబ్రో మ్యూకోర్మైకోసిస్‌ అంటారు. ఈ తరహా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు అనేవి వందలో 70 శాతం వరకు ఉంటాయి. ప్రస్తుతం కొన్నిరోజులుగా కరోనా రోగులను వెంటాడుతున్న మ్యూకోర్మైకోసిస్‌ కూడా ఇదే. కానీ మిగిలిన 30 శాతం కేసుల్లో మరో నాలుగు మార్గాల్లోనూ శరీరంలోకి ప్రవేశిస్తాయి.

ముక్కు ద్వారా కండ్ల మార్గంలోనే కాకుండా నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం ద్వారా అక్కడ ఫంగస్‌ ఫాం అవుతుంది. దీనిని పల్మనరీ మ్యూకోర్మైకోసిస్‌ అంటారు. దీంతోపాటు కొన్ని కేసుల్లో పేగు మీద కూడా బ్లాక్‌ ఫంగస్‌ చేరుతుంది. దీనిని గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ మ్యూకోర్మైకోసిస్‌ అంటారు. చర్మ సంబంధిత మ్యూకోర్మైకోసిస్‌ కూడా గతంలో దాడి చేసిన దాఖలాలు ఉన్నాయని కోఠి ఈఎన్టీ వైద్యుడు రవిశంకర్‌ తెలిపారు. దీనిని క్యుటేనస్‌ మ్యూకోర్మైకోసిస్‌ అంటారు.

ఇక అత్యంత ప్రమాదకరమైనది డిసిమినేటెడ్‌ మ్యూకోర్మైకోసిస్‌. ఇది రక్తంలో చేరి శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపిస్తుంది. ఈ అన్నిరకాల మ్యూకోర్మైకోసిస్‌లకు ఒకే రకమైన చికిత్సా విధానం ఉంటుందని డాక్టర్‌ రవిశంకర్‌ చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌కు వాడే యాంఫోటెరిసిన్‌-బీ, పొసకొనజోల్‌, తదితర మందులే వాడతామని వివరించారు. ఈ ప్రమాదకరమైన మ్యూకోరేన్‌ కుటుంబంలో ప్రధానంగా 8 రకాల జాతులున్నాయని కోఠి ఈఎన్టీ వైద్యుడు రమేశ్‌ తెలిపారు. రైజోఫస్‌, రైజోముకయకర్‌, కన్నింగామెల్లా, అపోఫైఫోమైసిస్‌, సక్సెనియా, అబ్సీడియా, ముక్యకర్‌, సిన్సిఫల్‌ అస్ట్రం వంటి జాతులున్నాయని వివరించారు.

బ్లాక్‌ ఫంగస్‌పై కొనసాగుతున్న విశ్లేషణలు

బ్లాక్‌ ఫంగస్‌ అత్యధికంగా కొవిడ్‌ రోగులపై దాడిచేయడం వెనుక ప్రధాన కారణాలపై వైద్యవర్గాల్లో ఇంకా విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కోఠి ఈఎన్టీ వైద్యులతో జరిగిన రాష్ట్ర వైదారోగ్యశాఖ ఉన్నతాధికారుల సమీక్షలోనూ ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. వివిధ రాష్ర్టాల నుంచి ఆక్సిజన్‌ దిగుమతి చేసుకున్న క్రమంలో బ్లాక్‌ ఫంగస్‌కు దారితీసి ఉండవచ్చనే వాదనలు వినిపించగా.. కోఠి ఈఎన్టీలోని బాధితుల్లో కొంతమంది అసలు ఆక్సిజన్‌స్థాయి పడిపోనివారు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. అంటే వీరు కొవిడ్‌ బారిన పడినప్పటికీ ఆక్సిజన్‌ అవసరం లేకుండానే కోలుకున్నారు. ఇలాంటి వారు కూడా ఉన్నందున ఆక్సిజన్‌ సరఫరా కారణమనే వాదన సరైనది కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కరోనా రోగులు వాడే మాస్కుల్లో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ ఫంగస్‌ ఫాం అయ్యే అవకాశాలున్నాయని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ రమేశ్‌ తెలిపారు. ఈ వాదనలు ఎలా ఉన్నా మన చుట్టూ అనేకరకాల ఫంగస్‌లు ఉంటాయని, కానీ కొవిడ్‌ రోగులను మాత్రమే అవి కాటేయడం వెనుక ప్రధాన కారణం రోగనిరోధకశక్తి గణనీయంగా తగ్గిపోవడమేనని ఆర్‌ రమేశ్‌ అన్నారు.

ఈ నేపథ్యంలో కరోనా.. శరీర కణాల్లో ఒక రకమైన మార్పునకు కారణమవుతుందని, తద్వారానే రోగనిరోధకశక్తి గణనీయంగా పడిపోతుందని చెప్పారు. ఫంగస్‌ మాత్రమే కాదు వివిధ రకాల రోగాలు దాడి చేసేందుకు ఇది కారణమవుతుందని తెలిపారు. ప్రధానంగా కొవిడ్‌.. శరీర కణాల్లో కలిగిస్తున్న మార్పులు ఏమిటనే దానిపై ఇంకా లోతైన అధ్యయనం జరగాల్సిన అవసరమున్నదని ఆర్‌ రమేశ్‌ అభిప్రాయపడ్డారు.

కోఠి ఈఎన్టీలోని బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల్లో 40 ఏండ్లు పైబడినవారు అత్యధికంగా ఉన్నారని చెప్పిన ఆయ న, దాదాపు 50 శాతం మంది పోస్టు కొవిడ్‌ మధుమేహ వ్యాధిగ్రస్థులు ఉన్నట్టు తెలిసిందని వివరించారు. అంటే 50 శాతం మందికి కరోనా సోకక ముందే మధుమేహం ఉన్నదని తెలుసునని, కానీ మిగిలిన 50 శాతం మందికి తమకు మధుమేహం ఉన్నదనే విషయం కూడా తెలియదని చెప్పారు. ఇందులో కొంతమంది పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల గుర్తించకపోవడం ఒక కారణం అయితే, మరికొందరికి కొవిడ్‌ చికిత్సలో స్టెరాయిడ్స్‌ వాడటంతో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరిగినవారు ఉన్నారని విశ్లేషించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐదు మార్గాల్లో మ్యూకోర్మైకోసిస్‌ దాడి

ట్రెండింగ్‌

Advertisement