సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 02:19:56

ఈసారైనా ఓటేద్దాం!

ఈసారైనా ఓటేద్దాం!

  • మాటల్లో హీరోలు.. ఓటింగ్‌లో జీరోలు
  • ఓటు వేయటానికి బద్దకిస్తున్న హైదరాబాదీలు
  • ఎన్నికలేవైనా అతి తక్కువ ఓటింగ్‌ నగరంలోనే 
  • అక్షరాస్యతలో మిన్న.. చైతన్యంలో సున్నా..
  • ఓటింగ్‌ కోసం సెలవిచ్చినా ఇండ్లలోనే కాలక్షేపం
  • ఈసారైనా మారాలి.. ఓటింగ్‌ శాతం పెరగాలి
  • ప్రజాస్వామ్యం బతకాలంటే ఓటు వేసి తీరాలి

రోడ్డుపై చిన్న గుంతపడితే చిర్రెత్తి పోతారు.. ఫోనందుకొని ప్రభుత్వం ఏం చేస్తున్నదంటూ సోషల్‌ మీడియాలో  పోస్టుల మీద పోస్టులు పెడుతారు. వర్షాలు పడి చారెడు నీళ్లు కాలనీలో నిలిస్తే అగ్గిమీద గుగ్గిలమై పోతారు. పదిమంది ఒకచోట చేరి వాగ్ధాటినంతా రంగరించి ప్రభుత్వాన్ని ఎడాపెడా వాయించేస్తారు. అధికారులు ఇలా పనిచేయాలి.. ప్రభుత్వం అలా పనిచేయాలి.. అంటూ నిత్యం నీతులు చెప్తారు. కానీ.. ఎన్నికల్లో ఓటు వేయమంటే మాత్రంగడప దాటి బయటకు రారు. ఏ పనీపాటా లేకున్నా సోది కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తారు.. కానీ మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకొనేందుకు మాత్రం ముందుకు రారు. హైదరాబాద్‌లో ఏ ఎన్నికలు జరిగినా ఇదే పరిస్థితి. 

రాష్ట్రం మొత్తంలో అతి తక్కువ పోలింగ్‌ నమోదయ్యేది భాగ్యనగరంలోనే.. ఈసారైనా ఈ అపవాదును మారుద్దాం. హైదరాబాద్‌లో ఎక్కువగా చదువుకున్న బద్దకస్తులున్నారన్న అపప్రథను తొలగిద్దాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ కోసమే ప్రభుత్వం డిసెంబర్‌ 1న సెలవు ప్రకటించింది. అందువల్ల సుపరిపాలన కోసం.. మంచి నాయకుడి కోసం ముందడుగు వేద్దాం. సొంత పనులు ఓ గంట పక్కన పెట్టి ప్రజాస్వామ్య పండుగలో పాలుపంచుకుందాం..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎన్నికల ఓటింగ్‌ విషయంలో హైదరాబాద్‌ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బలా తయారయ్యింది. ఇతర ప్రాంతాల ప్రజలకు  తామేదో పెద్దన్నలా వ్యవహరించే రాజధాని ప్రజలు.. ప్రజాస్వామ్య చైతన్యంలో మాత్రం జీరోలమనే చాటుకుంటున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ, లోకల్‌బాడీ.. ఇలా ఏ ఎన్నికలు జరిగినా ఇదే పరిస్థితి. తమపై పడ్డ మరకను చెరిపేసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. టెక్నాలజీని ఉపయోగించడంలో, సోషల్‌ మీడియాలో చూపించే చైతన్యం ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి నీరుగారిపోతున్నది. మారుమూల గ్రామాలు, పల్లెల్లోని అక్షరం ముక్కరానివారిలో ఉన్నంత చైతన్యం కూడా చాలామంది హైదరాబాదీల్లో కనిపించటంలేదు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో చాలాచోట్ల ప్రస్తావించారు. హైదరాబాదీలు ఓటు వేయటంలో బద్ధకస్తులన్న చెడ్డపేరును చెరిపేసుకోవాలంటే డిసెంబర్‌ 1న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. 

50% దాటని ఓటింగ్‌

గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్‌ ఎప్పుడూ 50 శాతానికి మించి నమోదు కాలేదు. 2009 ఎన్నికల్లో 42.95 శాతం మాత్రమే నమోదయ్యింది. 2016లో కూడా 45.27 శాతమే ఓటు వేశారు. కేవలం 2.32 శాతం మాత్రమే ఓటింగ్‌ పెరిగింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల చరిత్రలో ఓటింగ్‌ 50 శాతం కూడా చేరుకోలేదు.

అక్షరాస్యతలో మిన్న.. చైతన్యంలో సున్నా..

రాష్ట్ర రాజధాని.. మేధావులు, నిపుణులతో నిండి ఉండే నగరం. అక్షరాస్యతలోనూ అగ్రస్థానం. అధికారిక గణాంకాల ప్రకారం హైదరాబాద్‌ జిల్లాలో అక్షరాస్యత 83.25 శాతం. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. కానీ ఓటింగు విషయానికి వచ్చేసరికి అత్యంత వెనుకబడిన జిల్లాలకంటే వెనుకబడే ఉంటున్నది. అత్యంత వెనుకబడిన గిరిజనులు ఉన్న జిల్లాలైన కొత్తగూడెం (66.40 శాతం), ములుగు (63.57 శాతం), ఆసిఫాబాద్‌ (56.72 శాతం) అక్షరాస్యత ఉండగా.. ఓటింగ్‌లో మాత్రం హైదరాబాద్‌కంటే ముందుంటున్నాయి. 83.25 శాతం అక్షరాస్యత ఉన్న హైదరాబాద్‌ జిల్లాలోని మలక్‌పేట నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతి తక్కువగా 42.37 శాతం ఓటర్లే ఓటు వేశారు. యాకుత్‌పురాలో 42.63 శాతం ఓటింగ్‌ రికార్డయ్యింది. ఇక సంపన్నులు, వ్యాపారస్తులు, మేధావులు, ఉన్నత విద్యావంతులు ఉండే జూబ్లీహిల్స్‌లో 45.60 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదవ్వడం విశేషం.

అంత నిర్లక్ష్యం ఎందుకు?

నిజానికి ఓటింగ్‌ విషయంలో రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాల్సింది జంటనగరాల వాసులే. రాజధాని వాసులే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చైతన్య కార్యక్రమాలకు నాంది పలుకుతుంటారు. ప్రభుత్వం, ఎన్నికల అధికారులు అన్ని వసతులు కల్పిస్తున్నా.. పోలింగు రోజు సెలవును ఇంట్లో గడుపుతున్నారేతప్ప ప్రజాస్వామ్యంలో భాగస్వాములవుదామనే ఆలోచన చేయటం లేదు.