శనివారం 06 జూన్ 2020
Telangana - May 09, 2020 , 03:03:29

వ్యాక్సిన్‌కు కనీసం 15 నెలలు

వ్యాక్సిన్‌కు కనీసం 15 నెలలు

  • ప్రస్తుతం మేము వైరస్‌ కన్‌స్ట్రక్ట్‌ దశలో ఉన్నాం
  • 120కిపైగా దేశాల్లో వ్యాక్సిన్‌ ప్రయోగాలు
  • ‘నమస్తే తెలంగాణ’తో ఐఐఎల్‌ ఎండీ అనంద్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాక్సిన్‌ను కనుగొనడానికి కనీసం 15 నెలల సమయం పడుతుందని ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కే అనంద్‌కుమార్‌ స్పష్టంచేశారు. హడావుడిగా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేసి ఫలితాలు రాకుంటే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయే ప్రమాదమున్నదని అన్నారు. మానవులకు కరోనా నుంచి జీవిత కాలం విముక్తి కల్పించాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఐఐఎల్‌.. కరోనా వ్యాక్సిన్‌పై చేస్తున్న ప్రయత్నాలను ఆ సంస్థ ఎండీ ఆనంద్‌కుమార్‌ ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన మాటల్లోనే..

ఆస్ట్రేలియా గ్రిఫిత్‌ వర్సిటీ భాగస్వామ్యంతో..

వ్యాక్సిన్‌ను కనుగొనడానికి మా సంస్థ ఆస్ట్రేలియాకు చెందిన ప్రతిష్ఠాత్మక గ్రిఫిత్‌ యూనివర్సిటీని భాగస్వామిగా ఎంపిక చేసుకున్నది. వ్యాక్సిన్‌లో అనేక రకాలు ఉంటాయి. మేము కనుగొనేది లైవ్‌ వైరస్‌ వ్యాక్సిన్‌. వైల్డ్‌ వైరస్‌ ద్వారా వచ్చేవాటిని తట్టుకొనేలా వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్నాం. ప్రజలకు జీవితకాలం మంచి రోగనిరోధకశక్తిని ఇవ్వాలనేది మా ఉద్దేశం. వ్యాక్సిన్‌ తయారీలో మేము వైరస్‌ను కన్‌స్ట్రక్ట్‌ చేసే దశలో ఉన్నాం. వ్యాక్సిన్‌ కనుగొనే దశల్లో మొదట చిన్న జంతవులు, ఆ తర్వాత పెద్ద జంతవులు, అనంతరం మనుషులపై ప్రయోగించాల్సి ఉంటుంది. చిన్న జంతువులపై ప్రయోగించే ల్యాబ్‌ అమెరికాలో అది కూడా ఒక్కటి మాత్రమే ఉన్నది. దీంతో అక్కడ ఎక్కువ సమయం పట్టే అవకాశాలున్నాయి. 

కనీసం 15- 18 నెలలు పడుతుంది

మా కంపెనీ వ్యాక్సిన్‌ తయారీకి 15 నుంచి 18 నెలల సమయం పడుతుంది. 15 నెలల్లోనే తయారీకి ప్రయత్నిస్తున్నాం. వాణిజ్య ఉత్పత్తికి 18 నెలలు సమయం పడుతుంది. హడావుడిగా ప్రయోగాలు చేసి తయారుచేశాక అది పనిచేయకపోతే ప్రజల్లో వ్యాక్సిన్‌పై విశ్వసనీయత పోతుంది. క్లినికల్‌ ట్రయల్స్‌కు కూడా ఎవరూ ముందుకు రారు. వ్యాక్సిన్‌ క్లినికల్‌ ప్రయోగాలు సిక్‌ అయినవారిపైనే చేస్తారు. కానీ వ్యాక్సిన్‌ తయారయ్యాక ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా వేయాల్సి ఉంటుంది. అప్పుడు వారి ఆరోగ్యానికి ఇబ్బంది రావొద్దు. అందుకే మేము హడావుడి పడటంలేదు. వ్యాక్సిన్‌ తయారీకి 120కిపైగా దేశాల్లో దాదాపు 130 కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. భారత్‌లో 6 కంపెనీలు వ్యాక్సిన్‌ను కనుగొనడానికి తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో మా కంపెనీ కూడా ఉన్నది. వ్యాక్సిన్‌ కనుగొనడంతోపాటు తక్కువ ధరలో లభ్యమయ్యేలా చూడాల్సి ఉంటుంది. కరోనా వ్యాక్సిన్‌పై విజయవంతమవుతామని విశ్వాసం ఉన్నది.


logo