శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Aug 18, 2020 , 03:01:02

1350 కోట్లతో ఏస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ కేంద్రం

1350 కోట్లతో ఏస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ కేంద్రం

  • తెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడి 
  • ప్రత్యక్షంగా 800 మందికి ఉపాధి అవకాశం
  • పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలం
  • మంత్రి కేటీఆర్‌తో సంస్థ చైర్మన్‌ సింఘానియా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణకు పెట్టుబడులు, పరిశ్రమల వెల్లువ కొనసాగుతున్నది. రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టడానికి ఓ ప్రముఖ సంస్థ ముందుకొచ్చింది. ఏస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ లిమిటెడ్‌ తెలంగాణలో ప్యాకేజింగ్‌ ఫిల్మ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. రూ.1350కోట్ల పెట్టుబడితో ఆ సంస్థ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నదని తెలిపారు. ఏస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ సంస్థ చైర్మన్‌ అరవింద్‌ సింఘనియాతో మంత్రి కేటీఆర్‌ సోమవారం వెబినార్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ర్టానికి ఏస్టర్‌ కంపెనీ రాక పట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. చందన్‌వెల్లి పారిశ్రామికవాడలో ఏస్టర్‌ కంపెనీ అడ్వాన్స్‌డ్‌ పాలిస్టర్‌ ఫిల్మ్‌ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో ప్రారంభించనున్నది. తొలి దశలో కంపెనీ నిర్మాణం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నది. 2022 మూడో త్రైమాసికం నాటికి తొలిదశ పనులు పూర్తికానున్నాయి. ఆ కంపెనీ ద్వారా స్థానికంగా 800 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ప్యాకేజింగ్‌ పరిశ్రమకు చెందిన పాలిమర్స్‌ ఉత్పత్తులను ఇక్కడ తయారుచేస్తారు. 30 నుంచి 40 శాతం వరకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ కంపెనీ నిర్మాణంతో ప్యాకేజింగ్‌ పరిశ్రమలో తెలంగాణకు ప్రత్యేకస్థానం వస్తుందని ఆ సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్‌ అరవింద్‌ సింఘానియా మాట్లాడుతూ తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన విధానాలు ఉన్నాయని అన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర అభివృద్ధిపై చూపుతున్న చొరవతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ వెబినార్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు.

తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన విధానాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్‌, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ముందుచూపు, రాష్ట్ర అభివృద్ధిపై వారు చూపుతున్న చొరవతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాం.

-అరవింద్‌ సింఘానియా