మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 02:31:00

జనం గుండెను తట్టి..భరోసా నింపి

జనం గుండెను తట్టి..భరోసా నింపి

  • గల్లీగల్లీలో తిరుగుతూ ఆత్మీయ స్పర్శ
  • రెండో రోజూ విస్తృతంగా పర్యటించిన మంత్రి కేటీఆర్‌ 
  • బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ 

ఆపద వేళ ఆత్మబంధువయ్యారు.. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్‌. గురువారం హైదరాబాద్‌ నగరంలోని ముంపు ప్రాంతాల్లో  పర్యటించారు. బాధితులను ఓదార్చారు. తక్షణ సహాయ చర్యల్లో తలమునకలయ్యారు. 

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం హైదరాబాద్‌లో వందల సంఖ్యలో కాలనీలను నీటముంచింది. రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు జనజీవితాలను అతలాకుతలం చేశాయి. ప్రకృతి కన్నెర్ర చేసినప్పటికీ.. బాధితులకు మేమున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం సాంత్వన కలిగించింది. ముఖ్యంగా పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు రెండురోజులుగా నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉద్ధృతంగా పర్యటిస్తూ బాధిత ప్రజలకు భరోసానిస్తున్నారు. గల్లీ గల్లీలో తిరుగుతూ ఆత్మీయ స్పర్శను అందించారు. మహానగరంలోని పలు కాలనీల్లో  కలియదిరిగారు. ముంపునకు గురైన కాలనీల్లో అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులు విన్నవించిన సమస్యలను ఓపికగా విన్న మంత్రి వీలైన చోట అక్కడికక్కడే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. బురదనీటిలో నడుస్తూ.. ప్రజల బాగోగులు తెలుసుకున్నారు. ఇంకా వరదనీటిలోనే ఉన్న వారిని తక్షణమే ఆశ్రయ శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. బాధితులందరినీ ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడకూడదని భరోసానిచ్చారు. వరద కారణంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షణం తీరికలేకుండా తిరుగుతూ గులాబీ సైన్యానికి స్ఫూర్తినిచ్చారు.

అక్కడికక్కడే ఆదేశాలు

మంత్రి కేటీఆర్‌ గురువారం ఉదయం ముషీరాబాద్‌ నియోజకర్గంలోని నల్లకుంటలోని శ్రీరాంనగర్‌ బస్తీలో నీటమునిగిన ఇండ్లను స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఆ తరువాత అంబర్‌పేటలోని ప్రేమ్‌నగర్‌, పటేల్‌నగర్‌, కాలనీలను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి పరిశీలించారు. ఆ తరువాత టోలీచౌకీలోని నదీం కాలనీలో నీళ్లు నిండిన ప్రాంతాన్ని పరిశీలించారు. నల్లకుంట, అంబర్‌పేట కాలనీల్లో నీళ్లునిండిన కాలనీల్లో వరద నివారణ కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రజలు మంత్రి కేటీఆర్‌ను కోరారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన శాశ్వత ప్రాతిపదికగా చర్యలు తీసుకునేందుకు అవసరమైన నిర్మాణాలు, కాలనీల్లో వేయాల్సిన పైప్‌లైన్లు, డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని జోనల్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నల్లకుంటలోని నాలాలను పరిశీలించిన మంత్రి అక్కడ రిటైనింగ్‌ వాల్‌పై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సలహాలు ఇచ్చారు. వరదనీరు తొలగిపోని కాలనీల్లో పర్యటించిన మంత్రి.. వారిని జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసిన షెల్టర్‌ హోమ్‌లో ఉండాలని సూచించారు. ఆయా కేంద్రాల్లో వారి కి అవసరమైన అన్నిరకాల ఆహారం, దుప్పట్లు, మందులు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. 

పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం

వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రజలు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. వరద తగ్గిన తర్వాత మురుగునీరు వల్ల రోగాలు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. ప్రత్యేక శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టాలని ఆదేశించారు. టౌలీచౌక్‌లోని నదీం కాలనీని పరిశీలించిన మంత్రి అక్కడ ఇప్పటికీ వరద నీరు ఎక్కువగా ఉండడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ నుంచి అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇప్పటికీ ఇండ్లలో చిక్కుకుపోయిన వారందరికీ తగిన ఆహారం, కల్పించాలని సూచించారు. అంతకుముందు ఉదయం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి నగరంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు.

సీఎస్‌తో సమీక్ష

హైదరాబాద్‌ మహానగరంతోపాటు రాష్ట్రంలోని పలు పట్టణాల్లో వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమీక్షించారు. ప్రభుత్వ సహాయ చర్యల్లో ఏ లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న నేపథ్యంలో సహాయక కార్యక్రమాలకు ఎక్కడా విఘాతం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వరద నీరు వెళ్లగానే పారిశుద్ధ్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. వరద ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో వర్షాల వల్ల ఎదురైన పరిస్థితులపైనా సమీక్షించేందుకు వీలుగా సీడీఎంఏ పురపాలకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌తో కలిసి ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 

ప్రాంతం: నల్లకుంట 

సమస్య: నీట మునగడం 

మంత్రి కేటీఆర్‌: నాలా రిటైనింగ్‌ వాల్‌ ఏర్పాటుకు ఆదేశం. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. తక్షణ సహాయంగా షెల్టర్‌ హోంకు ముంపు బాధితుల తరలింపు. ప్రాథమిక సౌకర్యాల కల్పన 

ప్రాంతం: నల్లకుంట, అంబర్‌పేట 

సమస్య: వరద నివారణ కోసం శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానికుల వినతి

మంత్రి కేటీఆర్‌: శాశ్వత పరిష్కారానికి అ వసరమైన నిర్మాణాలు, కాలనీలో వర ద రాకుండా పైపులైన్‌, డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశం 


ప్రాంతం: టౌలీచౌకీలోని నదీం కాలనీ

సమస్య: వరదలో చిక్కుకున్న ప్రజలు 

కేటీఆర్‌: ఎన్డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ నుంచి అందుతున్న సహాయక చర్యలు ముమ్మరం చేయాలి. ఇండ్లలో చిక్కుకున్న వారికి తగిన ఆహారం, షెల్టర్‌ వం టి సౌకర్యాలు కల్పించాలని ఆదేశం.


logo