శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 02:35:56

రెవెన్యూ ఉద్యోగులకు భరోసా

రెవెన్యూ ఉద్యోగులకు భరోసా

  • ఎవరినీ ఉద్యోగం నుంచి తొలిగించం
  • వివిధ శాఖల్లో వారిని సర్దుబాటుచేస్తాం
  • రెవెన్యూ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ భరోసా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రెవెన్యూశాఖలో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగి ఉద్యోగానికి వచ్చిన భయమేమీ లేదని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. బుధవారం అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ అందరి ఉద్యోగాలకు భద్రత ఉంటుందన్నారు. ‘రెవెన్యూలో ఎంతోమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్లకు చెప్పకుండా గొంతుపిసికే ఆలోచన మాకులేదు. నేనే పిలిచి మాట్లాడాను. ప్రభుత్వ ఉద్దేశం వివరించాను. ప్రభుత్వం ఏ చట్టం చేసినా సహకరిస్తామని వారు సహృదయంతో అన్నారు. తమ గౌరవం, ఉద్యోగ భద్రత పోకుండా చూడాలని కోరారు. నేను పూర్తిస్థాయిలో రెవెన్యూశాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు హామీఇస్తున్నా. దీని ఫలితంగా కేవలం ప్రజలకు మంచి జరుగుతుంది, అవినీతి బాధలు తప్పుతయి తప్ప, ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు. ఉండకపోగా తరతరాలుగా బానిసలుగా పనిచేస్తున్న మచ్కూరి వ్యవస్థ లేదా వీఆర్‌ఏలకు న్యాయంచేశాం. వారి జీతాలను ఇప్పటికే రూ.10 వేలుచేశాం. వారు 20,292 మంది ఉన్నారు. మా గతి ఏమిటని వారు బెంబేలెత్తుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఇబ్బంది పెట్టి ఎడారిలో వదిలేయం. రెవెన్యూ శాఖలో ఎందరు అవసరమో అంతమందిని ఉంచి.. మిగిలినవారిని వివిధ ప్రభుత్వ విభాగాల్లో సర్దుబాటుచేస్తాం. వీఆర్‌ఏలలో పదివేల జీతం ఉన్నోళ్లకు స్కేల్‌ ఎంప్లాయీస్‌గా ఇస్తాం. కుటుంబాలు, జీవితాలు బాగుపడతయి. 

వీఆర్వో వ్యవస్థ రద్దు ఇదే మొదటిసారి కాదు.

వీఆర్వో వ్యవస్థ రద్దుచేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చేశారు. అనివార్యమైచేస్తున్నాం. అప్పుడు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చారు. అది రకరకాలుగా చెడుకు, అవినీతికి దారితీసింది. మేం తెచ్చే ప్రత్యామ్నాయం వందశాతం టెక్నాలజీ ఆధారంగా ఉంటుంది. మనుషులుండరు. మొత్తం వెబ్‌సైట్‌లోనే ఉంటుంది. వీఆర్‌ఏలో ఎక్కువమంది దళితులు, బీసీలు, గిరిజనులే ఉన్నారు. వారికి స్కేల్‌ ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వానికి అదనంగా రూ.260 కోట్ల భారం పడుతున్నది. వారికి న్యాయం జరుగాలని, తరతరాలుగా సేవచేశారు కాబట్టి ఇస్తున్నాం. వివిధ శాఖల్లో సర్దుబాటు అవుతారు. ఇక వీఆర్వోలు 5,485 మంది ఉన్నారు. వీరికి ఉద్యోగ భద్రత ఉంటుంది. ఆప్షన్లు ఇచ్చి వీరినీ వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తం. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులుండవు. మూడు, నాలుగు నెలల్లో కసరత్తు పూర్తిచేస్తం. వాళ్లకు ఆప్షన్‌ ఇచ్చి విద్యార్హత ప్రకారం వాళ్లు కోరుకున్నశాఖలో స్కేల్‌ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తం’ అని సీఎం అన్నారు.

భూములపై ఆల్‌ ఇండియా జోక్స్‌

‘భూములపై ఆల్‌ ఇండియాలో జోక్‌లు ఉన్నాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను కూడా రిజిస్ట్రేషన్‌ చెయ్యొచ్చు. ఒకరు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌ను రిజిస్టర్‌ చేసిండు. రిజిస్ట్రేషన్‌ చట్టమనేది కేంద్రచట్టం. చట్టం మంచిదే కాని లొసుగులు ఆసరాగా ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ధరణిలో రిజిస్ట్రేషన్‌ చేయకూడని భూములను చేయాలని చూస్తే తిప్పికొడుతుంది. వెంటనే ఆటోలాక్‌ అయిపోతుంది’ అని సీఎం పేర్కొన్నారు.

విచక్షణాధికారాలకు చెక్‌ 

‘తాసిల్దార్‌, ఆర్డీవోలు అలాగే ఉంటారు. కానీ ఎవరికీ విచక్షణాధికారాలు ఉండవు. చట్టం నిర్దేశం ప్రకారం పనిచేయాలి. అంతే. ఏ స్థాయి అధికారికి కూడా విచక్షణాధికారాలు ఉండవు. ఏ స్థాయి వ్యక్తి అయినా, చదువురాని వ్యక్తి అయినా కార్యాలయాల చుట్టూ తిరిగే ఖర్మ బంద్‌ అవుతుంది. బ్యాంకులో లోన్‌ తీసుకోవాలంటే పహాణీ వంటి లింక్‌పత్రాలు అడుగుతుంటారు. కొన్ని బ్యాంకులు క్రాప్‌లోన్‌ కోసం పట్టా పుస్తకాలు పెట్టుకుంటయి. క్రాప్‌లోన్‌కు పాస్‌పుస్తకాలు తమ వద్ద పెట్టుకోకూడదు. ఇంకా కొన్ని బ్యాంకులు దుర్మార్గంగా లింక్‌ డాక్యుమెంట్‌ అంటూ సతాయిస్తుంటాయి. ఇప్పుడు ఆ సమస్యలుండవు. భూమి మీద ఉన్న అప్పులు చూడాలంటే ఎన్‌కంబరెన్స్‌ వివరాలు ధరణి పోర్టల్‌లో ఉంటాయి. వేరే దగ్గరికి పోవాల్సిన అవసరముండదు’ అని సీఎం స్పష్టంచేశారు.


logo