సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 15:15:10

వరద బాధితులకు సాయం ఆపేయాలి.. ఎస్‌ఈసీ

వరద బాధితులకు సాయం ఆపేయాలి.. ఎస్‌ఈసీ

హైదరాబాద్‌ : నగరంలోని వరద బాధితులకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని తక్షణమే నిలిపివేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఎస్‌ఈసీ సెక్రటరీ ఎం. అశోక్ కుమార్‌‌ ఉత్తర్వులను జారీచేశారు. గత వందేళ్లలో ఎన్నడూలేని విధంగా భారీ వరదలు నగరాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. బాధితులను ఆదుకునేందుకు తక్షణ ఉపశమన చర్యల్లో భాగంగా ప్రభుత్వం రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఇంకా మిగిలిపోయిన బాధితులను ఆదుకునేందుకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తూ నగదు సాయాన్ని అందజేస్తుంది. కాగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న వరద సాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీ నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్థికసాయం పంపిణీ కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వరద సాయం యదావిధిగా కొనసాగించుకోవచ్చని ఎస్‌ఈసీ పేర్కొంది.