ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:43:40

నూతన రెవెన్యూ బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

నూతన రెవెన్యూ బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

  • ఆరుగంటలపాటు సుదీర్ఘంగా సాగిన చర్చ
  • సభ్యుల ప్రశ్నలకు ఓపికగా సీఎం జవాబులు
  • ప్రతిపక్షాలకు ఎంత సమయం కావాలన్నా ఇవ్వాలని స్పీకర్‌ను కోరిన ముఖ్యమంత్రి
  • ఎలాంటి సవరణలు లేకుండా బిల్లు పాస్‌
  • సవరణలు ఉపసంహరించుకున్న అక్బరుద్దీన్‌

ఒక చట్టం ప్రజల కడగండ్లను దూరం చేసేదైతే.. దశాబ్దాలుగా అవినీతి ఊబిలో కూరుకుపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేసేదైతే.. శతాబ్దకాలంగా ఎవరూ చేయని సాహసానికి పునాదిగా మారితే.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేదైతే.. వ్యతిరేకించడానికి కనీసం ఒక్క కారణం కూడా దొరుకకపోతే.. అద్భుతం అని పిలుస్తుంటాం. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. చట్టాన్ని చూసి ప్రజలు హర్షించారు. అధికార యంత్రాంగం సంతోషించింది. ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్షాల నేతలు ముక్తకంఠంతో స్వాగతించారు. శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మొత్తంగా సర్వామోదం పొందింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్ట బిల్లును శుక్రవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దాదాపు ఆరు గంటలకుపైగా సుదీర్ఘంగా, అర్థవంతంగా సాగిన చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్‌ పాస్‌పుస్తకాల బిల్లు (2020), తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల పదవుల రద్దు బిల్లు, తెలంగాణ పురపాలక చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులను ఈ నెల తొమ్మిదో తేదీన సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటిపై శుక్రవారం చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు నూతన రెవెన్యూ చట్టం బిల్లులోని ప్రతి అంశంపైనా మాట్లాడారు. ఎంఐఎం, కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ సభ్యులు పలు సూచనలుచేశారు. సభ్యుల సూచనలు, లేవనెత్తిన ప్రశ్నలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఓపిగ్గా సమాధానాలిచ్చారు. 

ఏ ఒక్కరికీ నష్టం జరుగదు

నూతన రెవెన్యూ చట్టం వల్ల ఏ ఒక్క భూ యజమానికి నష్టం జరుగదని సీఎం కేసీఆర్‌ సభకు హామీ ఇచ్చారు. సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, గువ్వల బాలరాజు చేసిన విజ్ఞప్తి మేరకు అసైన్డ్‌ భూముల సమస్యలపై.. దళిత, గిరిజన ఎమ్మెల్యేలంతా సమావేశమై ఏ నిర్ణయం తీసుకొంటే దానిని అమలుచేస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ భూములకు గ్రీన్‌ పాస్‌బుక్‌ ఇచ్చామని, వ్యవసాయేతర భూములకు, ఇండ్ల ప్లాట్లకు, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లకు కూడా మెరూన్‌ కలర్‌ పాస్‌బుక్‌లు ఇస్తామన్నారు. దీనివల్ల వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తులకు కూడా యాజమాన్య ధ్రువీకరణ పత్రం ఉంటుందని చెప్పారు. త్వరలోనే భూములను డిజిటల్‌ సర్వే చేస్తామని సీఎం సభలో ప్రకటించారు. వక్ఫ్‌ భూముల రిజిస్ట్రేషన్లను రద్దుచేస్తున్నామని చెప్పారు. అలాగే సభ్యులు సాదాబైనామా, జీవో 58, 59 కింద ఇండ్లు క్రమబద్ధీకరించాలని చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం.. చివరిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని.. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అని స్పష్టంచేశారు. వారసత్వ పంచాయతీలకు చరమగీతం పాడేలా పాస్‌బుక్‌లలో కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేస్తామని చెప్పారు. బిల్లులపై చర్చ ముగిసిన అనంతరం సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని కాంగ్రెస్‌ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క చేసిన డిమాండ్‌ను సీఎం తోసిపుచ్చారు. ఎలాగైనా బిల్లును ఆపాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 

భట్టికి ఎంతైనా సమయమివ్వండి

బిల్లులపై చర్చ ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ ఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తనకు మాట్లాడేందుకు ఎక్కువ సమయం కావాలని స్పీకర్‌ను కోరారు. ఎంత సమయం కావాలని స్పీకర్‌ ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యంచేసుకొని భట్టి ఎంతసేపు మాట్లాడితే అంతసమయమివ్వండని స్పీకర్‌ను కోరారు. 

మంత్రులు, ఎమ్మెల్యేల ధన్యవాదాలు

నాలుగు బిల్లుల ఆమోదం అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభను సోమవారానికి వాయిదావేశారు. అనంతరం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌, గంగుల కమలాకర్‌, వీ శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తోపాటు ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్‌, కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా చాలా మంచి బిల్లులను తీసుకొచ్చారని ధన్యవాదాలు తెలిపారు. 

అంచనాలకు మించి..

సీఎం కేసీఆర్‌ ఒక చట్టానికి లేదా ఒక పాలసీకి రూపకల్పన చేస్తున్నారంటేనే కచ్చితంగా రాష్ర్టానికి మేలు చేసేదై ఉంటుందనే భావన ప్రజల్లో బలంగా పాతుకుంది. అందుకే ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని చట్టాలను, టీఎస్‌ఐపాస్‌ వంటి పాలసీలను ఏకపక్షంగా స్వాగతించారు. వాటితో తమకు, రాష్ర్టానికి జరిగిన లాభాన్ని కండ్లారా చూశారు. ఇప్పుడు రెవెన్యూ చట్టంపైనా భారీ అంచనాలు పెట్టుకొన్నారు. సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రవేశపెట్టిన బిల్లు వారి అంచనాలకు మించి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఇంత సులభంగా చేసుకోవచ్చా? అదీ ఒక్కరోజులోనే! అని సామాన్యులు ఆశ్చర్యపోయారు. ‘ఇన్నేండ్లు రెవెన్యూ చట్టాలంటే సంక్లిష్టంగా ఉండేవి. కానీ ఇంత సరళంగా, సూటిగా, విస్తృత ప్రయోజనకారిగా కూడా ఉంటుందా?’ అని నిపుణులు సైతం విస్మయం చెందారు. 

కేసీఆర్‌ మస్తు జేస్తుండు

నేను శాన ఏండ్ల సంది ఎవుసంజేత్తన్న. నాకు మూడెకరాల భూమి ఉంది. కేసీఆర్‌ సారు మాలాంటోళ్లకు ఏం బాధ లేకుండా మస్తు చేత్తున్నడు. రూపాయి ఖర్సు లేకుండా కొత్త పాసుబుక్కులు ఇండ్లకు అచ్చెటట్టు జేసిండు. ఇప్పుడు ఇంకా బందవస్తు చేత్తున్నడు. వీఆర్వోలను తీసేసిండు. కొత్త చట్టం తెస్తుండు. ఇంతకుముందు కులం, ఆదాయం సర్టిఫికెట్లు కావాలంటె తాసిల్‌ ఆఫీసుల సుట్టూ రోజూ తిరిగేది. ఓసారి పోతె ఓ సారు ఉండకపోయేది. మళ్లోరోజు పోతె ఇంకోసారు ఉండకపోయేది. తిరగంగ తిరగంగ పనయ్యేది. దీంతోటి ఎవుసం పని ఎనుకడేది. శాన గోసపడ్డం.. ఇప్పుడు ఎక్కడికి తిరగకుంట పంచాయతీలనే ఇచ్చెటట్టు చేస్తమని అంటున్నరు. 

-  సత్తు రాములు,  రైతు, చేగుర్తి, కరీంనగర్‌  జిల్లా


logo