శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 11:22:54

అన్ని జాగ్రత్తలతోనే అసెంబ్లీ సమావేశాలు : మండలి చైర్మన్ గుత్తా

అన్ని జాగ్రత్తలతోనే అసెంబ్లీ సమావేశాలు : మండలి చైర్మన్ గుత్తా

నల్లగొండ : వచ్చే నెల 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు అన్ని జాగ్రత్తలు తీసుకుని, కొవిడ్ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తామని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు. సమావేశాల నిర్వహణపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

నల్లగొండలోని తన నివాసంలో మీడియా సమావేశంలో గుత్తా మాట్లాడారు. సమావేశాల నిర్వహణపై కొందరు వ్యక్తం చేస్తున్న సందేహాలపై వివరణ ఇచ్చారు. సమావేశ మందిరం ఎంట్రెన్స్ లోనే ఆటో మేటిక్ ధర్మల్ స్క్రీనింగ్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మాస్కులు లేకుండా వచ్చే వారిని మిషన్లు ఆటోమేటిక్ గా గుర్తిస్తాయని తెలిపారు. నిర్దిష్టమైన సీటింగ్ కెపాసిటీ ఉన్న లోకసభ సమావేశాలకు కూడా నిర్వహించ బోతున్నారని గుర్తు చేశారు. 

ఉమ్మడి రాష్ట్రంలో మన అసెంబ్లీ 294 మంది సభ్యుల కోసం రూపొందించిన మందిరం కాబట్టి ఇప్పుడు ఉన్న 120 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలకు ఇబ్బంది ఉండబోదని పేర్కొన్నారు. శ్రీశైలం పవర్ హౌస్ ఘటన దురదృష్టకరమన్నారు. ఘటన జరిగిన వెంటనే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జెన్కో సీఎండీ  ప్రభాకర్ రావు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. చనిపోయిన వారందరికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని, వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు.


logo