శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 02:32:12

కరోనా కట్టడికి సహకారం

కరోనా కట్టడికి సహకారం

  • లౌకికవాదాన్ని కాపాడుతున్న సీఎం కేసీఆర్‌
  • సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీ వ్యతిరేక తీర్మానంపై ముస్లిం మతపెద్దల కృతజ్ఞతలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని ముస్లిం మతపెద్దలు తెలిపారు. వైరస్‌ను నియంత్రించేందుకు తాము కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు. గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ముస్లిం మతపెద్దలు, ఒవైసీ సోదరులు అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌లు భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ కట్టడిపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు భయబ్రాంతులకు గురవుతుంటే, సీఎం కేసీఆర్‌ మాత్రం ధైర్యంగా దానిని ఎదుర్కోవడంతోపాటు ప్రజలకు భరోసా కల్పిస్తున్నారని కొనియాడారు. 

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు సామూహిక ప్రార్థనల కోసం మసీదులకు వెళ్లకూడదని పిలుపునిచ్చారు. షాదీఖానాలను కూడా మూసివేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కరోనాపై పోరాడటంలో సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణ, శాంతి భద్రతలకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టంచేశారు. సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా సమగ్రమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారు. లౌకికవాదాన్ని కాపాడుతున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఏఏ వ్యతిరేక తీర్మానం చరిత్రాత్మకమైన నిర్ణయమన్నారు. 

కరోనా ప్రభావంతో రోజువారీ కూలీలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామని, సానుకూలంగా స్పందించిన సీఎం.. రోజువారీ కూలీలకు సహకరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎంసీహెచ్చార్డీ ప్రొఫెసర్‌ ఖాన్‌ అమీరుల్లా, సీనియర్‌ రీసెర్చ్‌ ఎకానమిస్ట్‌ సలీమా రిజ్వి, మాజీ ఎమ్మెల్సీ, జమైతుల్‌ ఉలేమా హింద్‌ తెలంగాణ అధ్యక్షుడు ఆఫీజ్‌ షబ్బీర్‌ పీర్‌ తదితరులు పాల్గొన్నారు.


అవగాహన కల్పిస్తాం: అసదుద్దీన్‌ ట్వీట్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తాము కూడా సహకరిస్తామని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. సామాజిక దూరం పాటించాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తామని గురువారం ఆయన ట్వీట్‌చేశారు.


logo