శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 07:10:18

జూనియర్‌ కళాశాలలుగా ఎనిమిది మైనార్టీ గురుకులాలు

జూనియర్‌ కళాశాలలుగా ఎనిమిది మైనార్టీ గురుకులాలు

హైదరాబాద్‌ : కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకులాలు క్రమంగా అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి. ఇది వరకు ఎస్సెస్సీ వరకే విద్యాబోధన జరుగగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ విద్య అందుబాటులోకి రాబోతున్నది. ఇలా హైదరాబాద్‌లో 8 మైనార్టీ గురుకులాలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ టెమ్రీస్‌ అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. వీటిల్లో సిబ్బందిని నియమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 40 పాఠశాలలు, ఒక జూనియర్‌ కళాశాల ఉండగా, తాజాగా అప్‌గ్రేడేషన్‌తో 9 జూనియర్‌ కళాశాలలు, 32 పాఠశాలలు ఉండనున్నాయి.

ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో..

మొత్తం 80 సీట్లు గల ఈ కళాశాలలను రెండు కోర్సులతో ప్రారంభించనున్నారు. ఎంపీసీలో 40 సీట్లు, బైపీసీలో 40 సీట్లు ఉండనున్నాయి. మొత్తం సీట్లల్లో 75 శాతం సీట్లను మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు, మిగిలిన 25శాతం నాన్‌ మైనార్టీ విద్యార్థుల కోసం కేటాయిస్తారు. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఇందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఎస్సెస్సీలో 60 శాతం ఉత్తీర్ణత సాధించి, వార్షికాదాయం రూ.2లక్షల లోపున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు సాధించిన గ్రేడ్ల ఆధారంగా సీట్ల భర్తీ ప్రక్రియను చేపడుతారు.

అప్‌గ్రేడ్‌ అయినవి ఇవే.. 

-టీఎంఆర్‌ జూనియర్‌ కళాశాల, గోల్కొండ -1(బాలికలు)

-టీఎంఆర్‌ జూనియర్‌ కళాశాల, చార్మినార్‌ -1(బాలికలు)

-టీఎంఆర్‌ జూనియర్‌ కళాశాల ఆసిఫ్‌నగర్‌ -1(బాలుర)

-టీఎంఆర్‌ జూనియర్‌ కళాశాల, సైదాబాద్‌ -1(బాలుర)

-టీఎంఆర్‌ జూనియర్‌ కళాశాల, కంటోన్మెంట్‌(బాలుర)

-టీఎంఆర్‌ జూనియర్‌ కళాశాల ముషీరాబాద్‌ -1(బాలికలు)

-టీఎంఆర్‌ జూనియర్‌ కళాశాల బహదూర్‌పుర(బాలుర -1)

-టీఎంఆర్‌ జూనియర్‌ కళాశాల బహదూర్‌పుర(బాలికలు -1)


logo