ప్రేమకథలతో లవర్‌బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు నితిన్. ఈ ఇమేజ్ను నమ్మి చేసిన సినిమాలన్నీ నితిన్‌కు పెద్ద విజయాల్ని తెచ్చిపెట్టాయి. ఆ పంథాలోనే నితిన్ నటించిన తాజా చిత్రం ‘రంగ్ దే’. ‘తొలిప్రేమ’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి నిర్దేశకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ‘భీష్మ’ సక్సెస్ తర్వాత నితిన్, సితార ఎంటర్టైన్మెంట్స్లో నటించిన చిత్రమిది. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన పాటలతో పాటు ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. వాటిని ఈ సినిమా చేరుకుందా?నితిన్ విజయాన్ని అందుకున్నాడా?లేదా?తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
అర్జున్(నితిన్), అనుపమ(కీర్తిసురేష్) చిన్ననాటి నుంచి కలిసి పెరుగుతారు. అను చదువులో టాపర్ అయితే అర్జున్ మాత్రం స్నేహితుల సహాయంతో ఇంజినీరింగ్‌లో గట్టెక్కుతాడు. అను..అర్జున్ను ప్రేమిస్తుంటుది.కానీ అర్జున్ మాత్రం అను కారణంగానే తండ్రి ముందు తానో పనికిరానివాడిగా ముద్రపడిపోయాననే భావనతో ఆమెను ఎప్పుడూ ద్వేషిస్తుంటాడు. అను నుంచి దూరంగా ఉండొచ్చనే ఆలోచనతో విదేశాల్లో ఎంబీఏ చదవాలని నిర్ణయించుకుంటాడు అర్జున్. అతడి కోసం అదే కాలేజీలో అను చేరుతుంది. ఆమెను దుబాయ్‌కి రాకుండా అడ్డుకోవడానికి అర్జున్ వేసిన ప్లాన్ ఫెయిలవ్వడంతో అనును అతడు పెళ్లిచేసుకోవాల్సివస్తుంది. భార్యాభర్తలుగా దుబాయ్‌లో అడుగుపెట్టిన వారికి అక్కడ ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి?అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా?అను నుంచి విడాకులు తీసుకోవాలని అనుకున్న అర్జున్‌లో ఎలా మార్పు వచ్చిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
ఓ ప్రేమజంట మధ్య నెలకొన్న అపోహలు, అపార్థాలకు కుటుంబ విలువలు, వినోదాన్ని మేళవిస్తూ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించారు. ఒర్పు, ప్రేమతో ద్వేషాన్ని జయించవచ్చని అంశాన్ని నవ్విస్తూనే భావోద్వేగప్రధానంగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.
అను కారణంగా అర్జున్ తండ్రితో తిట్లు తినే సన్నివేశాలతో ప్రథమార్థం సరదాగా సాగిపోతుంది. అను నుంచి తప్పించుకోవడానికి జీమ్యాట్ పరీక్షల్లో పాస్ అవ్వడానికి అర్జున్ పడే కష్టాలను వినోదాత్మకంగా దర్శకుడు అల్లుకున్నారు. అంతర్లీనంగా కూతురి క్షేమం కోసం తల్లిపడే ఆరాటాన్ని చూపించారు. ద్వితీయార్థాన్ని ఎమోషన్స్, కామెడీ రెంటింటిని బ్యాలెన్స్ చేస్తూ నడిపించారు. అర్జున్‌లో మార్పు కోసం అను ప్రయత్నించడం?అతడిలో పరివర్తన వచ్చే సమయానికి అను..భర్తను అపార్థం చేసుకునే సన్నివేశాలు సహజంగా సెంటిమెంట్‌తో తీర్చిదిద్దారు.
నితిన్, కీర్తిసురేష్ ఇద్దరి పాత్రల ప్రధానంగా దర్శకుడు ఈ కథ రాసుకున్నారు. అర్జున్,అను పాత్రల్లో వారూ పోటీపడి నటించారు. ప్రేమించే అమ్మాయి కారణంగా ఇబ్బందులు పడే సగటు కుర్రాడిగా, భార్యలోని ప్రేమను అర్థం చేసుకోలేకపోయినా భర్తగా నితిన్ నవ్విస్తూనే చక్కటి ఎమోషన్స్‌ను పడించాడు. మనసులో అంతులేని ప్రేమను దాచుకొని పైకి మాత్రం ద్వేషాన్ని నటించే యువతిగా కీర్తిసురేష్ తన హావభావాలు, అభినయంతో ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, సుహాస్, బ్రహ్మాజీలపై వచ్చే సన్నివేశాలన్నీ నవ్వులను పంచాయి. రెగ్యులర్ పంథాకు భిన్నంగా ఈ కామెడీని రాసుకున్నారు. నరేష్, రోహిణి, కౌసల్య, వినీత్ తమ పరిధులకు మేర చక్కటి నటనను కనబరిచారు.
యువతరంలో ఉండే కన్ఫ్యూజన్స్ను ఆధారంగా చేసుకొని వెంకీ అట్లూరి ఈ కథను రాసుకున్నారు. సున్నితమైన అంశాన్ని సెంటిమెంట్ కంటే వినోదానికే పెద్దపీట వేస్తూ నేటితరం ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా తెరపై ఆవిష్కరించారు. అతడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోవడం మైనస్‌గా మారింది. ఈ పాయింట్లో తెలుగు తెరపై గతంలో చాలా సినిమాలొచ్చాయి. వాటి ఛాయలతోనే ఈ సినిమా సాగింది. అలాగే అర్జున్ పాత్రలో పరివర్తన వచ్చే సన్నివేశాల్ని బలంగా రాసుకోలేకపోయారు. అర్జున్, అను విడిపోవడానికి, మళ్లీ కలుసుకోవడానికి కారణమయ్యే సన్నివేశాల్లో ఆసక్తి లోపించింది. అయితే దర్శకుడి లోపాలను పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం, దేవిశ్రీప్రసాద్ సంగీతం కప్పిపుచ్చాయి. ‘ఏమిటో ఇది’, ‘బస్టాండే’, ‘నా కనులుఎప్పుడూ’ పాటలన్నీ చక్కటి సాహిత్యపు విలువలతో అర్థవంతంగా ఉన్నాయి. వాటిని పీసీ శ్రీరామ్ అందంగా తెరకెక్కించారు.టైమ్‌పాస్ ఎంటర్టైనర్ ఇది. నవ్వుల పరంగా సినిమాలో లోటు లేదు. అయితే కొత్తదనాన్ని ఆశించే వారిని మాత్రం నిరూత్సాహపరుచుతుంది.
రేటింగ్ : 2.75/5