శనివారం 30 మే 2020
Telangana - May 04, 2020 , 01:32:22

నిర్ణీత దూరం.. డిజిటల్‌ అభ్యాసం

నిర్ణీత దూరం.. డిజిటల్‌ అభ్యాసం

  • వర్చువల్‌ క్లాసెస్‌, వీడియో కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు
  • జూలై 1 నుంచి డిగ్రీ, పీజీ చివరి ఏడాది పరీక్షలు
  • ఆగస్టు నుంచి ప్రవేశాలు, సెప్టెంబర్‌లో క్లాసులు
  • విద్యా క్యాలెండర్‌పై యూజీసీ మార్గదర్శకాలు 

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ అనంతరం యూనివర్సిటీలు, కాలేజీలను తెరిచేందుకు యూజీసీ సన్నద్ధమవుతున్నది. కరోనా నేపథ్యంలో నిర్ణీత దూరం, డిజిటల్‌ అభ్యాసం, అధ్యాపకుల శిక్షణకు ప్రాధాన్యమివ్వనున్నది. ఈ మేరకు విద్యా కార్యక్రమాల విధివిధానాలు, కొత్త మార్గదర్శకాలను 2020 విద్యాక్యాలెండర్‌లో పేర్కొంది. ఆగస్టు నుంచి విద్యార్థుల ప్రవేశాలు, సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎలాంటి సంక్షోభ పరిస్థితుల్లోనైనా విద్యాభ్యాసం కొనసాగేలా అన్ని యూనివర్సిటీలు సిద్ధం కావాలని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ వర్చువల్‌ తరగతి, వీడియో కాన్ఫరెన్స్‌ విధానాలను అభివృద్ధి చేసుకోవాలని, ఆన్‌లైన్‌ పాఠ్యాంశాలను అధికార వెబ్‌సైట్లలో పొందుపరుచాలని సూచించింది. 25 శాతం సిలబస్‌ ఆన్‌లైన్‌లో, మిగతా సిలబస్‌ ముఖాముఖి తరగతుల ద్వారా జరిగేలా అధ్యాపకులను సన్నద్ధం చేయాలని పేర్కొంది. ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి అధ్యాపకుల శిక్షణ కూడా డిజిటల్‌ విధానంలోనే జరుగుతుందని తెలిపింది. 

పరీక్షలకు సన్నద్ధత..

డిగ్రీ, పీజీ చివరి ఏడాది, చివరి సెమిస్టర్‌ పరీక్షలను జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించి నెలాఖరులో ఫలితాలు వెల్లడించే యోచనలో యూజీసీ ఉన్నది. రెండో, మూడో ఏడాది విద్యార్థులకు జూలై 16 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించి ఆగస్టు 14 నాటికి ఫలితాలు ప్రకటించాలని భావిస్తున్నది. ఈ ఒక్కసారికి మాత్రం పరీక్షల సమయాన్ని మూడు నుంచి రెండు గంటలకు తగ్గించనున్నది. తొలి, రెండో ఏడాది విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించకుండానే తర్వాతి ఏడాదికి ప్రమోట్‌ చేయడంపై యోచిస్తున్నది. 

ఆరోగ్యమే ప్రధానం..

విద్యార్థులు, అధ్యాపకుల ఆరోగ్యంపైనా యూజీసీ దృష్టిసారించింది. లాక్‌డౌన్‌ కాలంలో వారు ఉన్న, ప్రయాణించిన ప్రాంతాల వివరాలు నమోదు చేయాలని వర్సిటీలకు సూచించింది. పరీక్షలు, విద్యాభ్యాసానికి సంబంధించిన ఇబ్బందులను విద్యార్థులు అదిగమించేందుకు కొవిడ్‌-19 సెల్‌, ప్రత్యేక సహాయ నంబర్‌ను ప్రతి వర్సిటీ నెలకొల్పాలని స్పష్టం చేసింది.    

9, 10 తరగతులకు వేర్వేరుగా 

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా 9, 10 తరగతులకు వేర్వేరు విద్యా క్యాలెండర్లను ఎన్‌సీఈఆర్టీ రూపొందించింది. పాఠ్యాంశాల కార్యకలాపాల మార్గదర్శకాలను ఎస్‌ఎంఎస్‌ లేదా వాయిస్‌ కాల్స్‌ ద్వారా విద్యార్థులకు పంపనున్నది. 


logo