ఆయుష్మాన్కంటే ఆరోగ్యశ్రీ మెరుగు

- ప్రజల మేలు కోసమే అనుసంధానం
- మెడికల్ సీట్ల అవకతవకలపై చర్యలు
- వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ కంటే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగైనదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ ద్వారా 80 లక్షల కుటుంబాలకు చికిత్స అందుతున్నదని, ఆయుష్మాన్ భారత్ వల్ల 26 లక్షల కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందే అవకాశముందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌లో అందించే చికిత్సలు, వాటికి చెల్లించే ధర చాలా తక్కువని మంత్రి వివరించారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులతో కలిసి, మంత్రి ఈటల గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా ఆరోగ్యశ్రీకి తెలంగాణ ప్రభుత్వం రూ.1000 కోట్ల నుంచి 1200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. విజయవంతంగా అమలవుతున్న ఈ పథకానికి రూ. 200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు సాయం అందించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ఇరు పథకాల్లోని చికత్సలను సమన్వయం చేసుకొని ప్రజలకు మరింత మేలు చేయాలన్న భావనతోనే ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిపారు. కేంద్రం ఇచ్చినా, రాష్ట్రం ఇచ్చినా అది ప్రజల సొమ్మేనని స్పష్టం చేశారు. కరోనా నివారణ వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తామన్న అంశంపై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదని, ఎప్పుడు అనుమతి వచ్చినా వేగంగా అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు.
మెడికల్ సీట్ల ఆరోపణలపై కమిటీ
రాష్ట్ర ప్రజల, విద్యార్థుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, వారికి నష్టం జరిగే పనిని ఎట్టి పరిస్థితుల్లో చేయబోదని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మెడికల్ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్టు వచ్చిన వార్తలపై పరిశీలనకు ఓ కమిటీని ఏర్పాటుచేసినట్టు చెప్పారు. నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పది సంవత్సరాల పాటు ఉమ్మడి ఏపీ నాటి నిబంధనలను అమలు చేయాల్సి ఉంది కాబట్టి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. తెలంగాణ విద్యార్థుల కోసం ఆరాటం ఉందని, బీసీ విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండాలని నాలుగు సార్లు సమావేశం నిర్వహించామని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తి నిలబడేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
కరోనా కారణంగా నుమాయిష్ వాయిదా..
ప్రతి ఏడాది జనవరి ఒకటి నుంచి నిర్వహించే నుమాయిష్ (ఎగ్జిబిషన్)ను ఈ సారి కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జనవరి 31 వరకు దేశంలో కొవిడ్ నిబంధనలు అమలులో ఉంటాయని, ఆ తర్వాత పరిస్థితులు సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎగ్జిబిషన్ సొసైటీ వ్యాపార కోణంలో కాకుండా ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నదని తెలిపారు. ఇప్పుడు వాయిదా వేస్తున్నప్పటికీ మార్చి, ఏప్రిల్‌లో నుమాయిష్ నిర్వహించడాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఇంతకుముందు 1949లో ఒకసారి నుమాయిష్ నిర్వహించలేదని, ఇప్పుడు కరోనా కారణంగా మరోసారి వాయిదాపడటం విచారకరమని అన్నారు. నుమాయిష్ ద్వారా వచ్చే డబ్బుతో ఎగ్జిబిషన్ సొసైటీ 19 విద్యాసంస్థలను నిర్వహిస్తూ, ఎంతోమంది పేద విద్యార్థులకు చదువుకొనే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
- శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌పై విప్ బాల్క సుమన్ సమీక్ష
- "ఉపశమనం కోసం లంచం" కేసులో డీఎస్పీ, ఇన్స్పెక్టర్ అరెస్ట్
- క్రాక్ 2 ఆయనతో కాదట..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
- స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
- భారత్ గిఫ్ట్.. స్వీకరించిన భూటాన్ ప్రధాని
- క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్!
- కమలా హ్యారిస్ సొంతూరులో వేడుకలు