మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 15:07:03

జ‌న‌వ‌రి 18న‌ సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

జ‌న‌వ‌రి 18న‌ సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

హైద‌రాబాద్ : యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ వ‌చ్చే ఏడాది ప్రాంర‌భంలో సికింద్రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. సికింద్రాబాద్ ఏవోసీ సెంట‌ర్‌లో జ‌న‌వ‌రి 18 నుంచి ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ వ‌ర‌కు ఆర్మీ నియామక ర్యాలీని నిర్వ‌హించ‌నున్నారు. సోల్జర్ టెక్ (ఏఈ), సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మెన్, అత్యుత్తమ క్రీడాకారులు (ఓపెన్ కేటగిరీ)లో ఎంపిక నిమిత్తం నియామ‌క ర్యాలీని చేప‌డుతున్నారు. అత్యుత్తమ క్రీడాకారులు (ఓపెన్ కేటగిరీ) కింద ఉన్నవారు 2021 జనవరి 15న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ లోని ఏవోసీ సెంటర్ లోని థాపర్ స్టేడియంలో స్పోర్ట్స్ ట్రయల్ కోసం రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించారు. 

బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబ్బడి రంగాలలో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు తమ జాతీయ లేదా అంతర్జాతీయ పోటీల సీనియర్ లేదా జూనియర్ విభాగాల్లో పాల్గొన్న‌ సర్టిఫికెట్‌లతో హాజ‌రుకావాల‌న్నారు. స్క్రీనింగ్ స‌మ‌యానికి సర్టిఫికేట్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ స‌మ‌యం ఉండకూడదన్నారు. వ‌య‌స్సు, చ‌దువు ఇత‌ర వివ‌రాల కోసం అభ్య‌ర్థులు ఏవోసీ సెంట‌ర్‌ ప్రధాన కార్యాలయం, ఈస్ట్ మారేడుప‌ల్లి, త్రిముల్ఘేరి, సికింద్రాబాద్ (టీఎస్) 500015 నందు సంప్ర‌దించ‌వ‌చ్చ‌న్నారు. అదేవిధంగా ఇ-మెయిల్: [email protected] లో గాని లేదా www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌న్నారు.