ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 01:45:06

జోరుగా వానకాలం సాగు

జోరుగా వానకాలం సాగు

  •  రాష్ట్రంలో ముమ్మరంగా పనులు 
  • గతేడాదితో పోల్చితే జూన్‌లో భారీగా పెరిగిన విస్తీర్ణం
  • ప్రభుత్వం సూచించిన విధంగానే నియంత్రిత సాగు 
  • రాష్ట్రంలో సాగుతీరుపై వ్యవసాయ శాఖ నివేదిక 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వానకాలం సాగు జోరందుకున్నది. గతేడాది జూన్‌నెలతో పోల్చితే ఈ ఏడాది భారీగా పెరుగుదల నమోదైంది. ప్రభుత్వం సూచించిన విధంగానే రైతులు నియంత్రిత సాగును చేపడుతున్నారు. వానకాలం సాగుపై వ్యవసాయశాఖ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో రావడం, ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనుల్లో వేగం పెరిగింది. సీజన్‌కు ముందే ప్రభుత్వం వానకాలం పంటకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సిద్ధంగా ఉంచడం మరింత గా కలిసి వచ్చింది. రైతుకు గిట్టుబాటు అయ్యేలా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలనే సాగుచేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఈ ఏడాది నుంచి నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఏ పంటను ఎంత విస్తీర్ణంలో వేయాలనే లెక్కలను సిద్ధంచేసి.. నియంత్రిత సాగుపై రైతుల్లో ముందుగానే అవగాహన కల్పించారు. అన్ని అనుకూల అంశాలతో రాష్ట్రంలో సాగు జోరుగా ముందుకుసాగుతున్నది.

గతేడాది జూన్‌ 15వ తేదీ నాటికి 1,173 ఎకరాల్లో వరిని సాగుచేయగా.. ఈ ఏడాది 19,267 ఎకరాల్లో పూర్తయింది. ఏకంగా 18,094 ఎకరాల్లో అధికంగా సాగవడం గమనార్హం. గతేడాది 47,910 ఎకరాల్లో పత్తివేయగా.. ఈ సారి 8,78,706 ఎకరాల్లో వేశారు. కంది సాగులోనూ అదే తరహా జోరు కొనసాగుతున్నది. గతేడాది 5,193 ఎకరాల్లోనే కందులు వేయ గా.. ఈ ఏడాది ఏ కంగా 1,01,482 ఎకరాల్లో పంటవేశారు. వ్యవసాయశాఖ నివేదికను పరిశీలిస్తే రైతులు ని యంత్రితసాగు విధానంలో పంటలు వేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. నియంత్రిత సాగులో భాగంగా వరిసాగు విస్తీర్ణాన్ని గతేడాది మాదిరిగానే ఉంచిన ప్రభుత్వం.. కంది, పత్తి సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచింది. ఇందులోభాగంగా పత్తిని 60.16 లక్షల ఎకరాల్లో, కందిని 12.31లక్షల ఎకరాల్లో, వరిని 41.76 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించింది. ఇందుకనుగుణంగానే ప్రస్తుతం పత్తి, కంది సాగులో భారీగా పెరుగుదల నమోదువుతున్నది. ఈసారి మక్కలు వద్దని చెప్పినా వినకుండా రైతులు కొద్దిమంది దాని సాగుకు మొగ్గు చూపుతున్నారు.logo