ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 20:17:59

పది పరీక్షలు రాస్తున్నారా! ఇది మీ కోసమే..

పది పరీక్షలు రాస్తున్నారా! ఇది మీ కోసమే..

 హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటుచేశారు. పరీక్షా కేంద్రాల వివరాలను విద్యాశాఖ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను ఒకరోజు ముందుగానే సందర్శించి చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గందరగోళానికి తావు లేకుండా సజావుగా పరీక్షలు రాసుకునే అవకాశముంటుందని సూచిస్తున్నారు.

ఈ నెల 8వ తేదీ నుంచి ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభంకానున్నది తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పలు జాగ్రత్తలు చేపడుతున్నారు. బెంచీ, బెంచీకి మధ్య 4-5 ఫీట్ల దూరంతో ఒక్కో గదిలో 10 -15 మంది విద్యార్థులనే అనుమతించనున్నారు. పాత పరీక్షా కేంద్రాలతోపాటు కొత్తగా 346 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఎవరు, ఏ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉంటుందన్న వివరాలను డీసీఈబీ వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచారు. ఒకే ప్రాంగణంలోని అదనపు కేంద్రాలకు ఏ, బీ  కేంద్రాలుగా విభజించారు. కొత్తగా ఏర్పాటుచేసిన వాటిని పాత కేంద్రాలకు 500 మీటర్ల దూరంలోనే నెలకొల్పారు. విద్యార్థులు పాత హాల్‌టికెట్‌తోనే పరీక్ష రాయవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలోఎవరైనా విద్యార్థులు హాల్‌టికెట్‌ పొగొట్టుకొని ఉంటే ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తోటి విద్యార్థులతో గుమిగూడకుండా ఎవరికి వారు జాగ్రత్త పడాలి. పరీక్షకు హాజరయ్యేవారంతా విధిగా ముక్కును మాస్క్‌తో కప్పిపెట్టి ఉంచుకోవాలి. షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవడం, ఇతరుల పెన్నులు, పెన్సిళ్లను నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలి. పరీక్ష రాసి ఇంటికి వెళ్లగానే ప్యాడ్‌తోపాటు పెన్నులను శానిటైజ్‌ చేసుకోవాలి. నిత్యం పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి.

సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్‌

ఎస్సెస్సీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సందేహాలను నివృత్తిచేసేందుకు విద్యాశాఖ అధికారులు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ సందేహాలను 040 - 29701474 నంబర్‌కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా కేంద్రాలు సహా ఇతర ఎలాంటి సందేహాలనైనా తీర్చుకునేందుకు ఈ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలంటున్నారు.

ముందే పరీక్షా కేంద్రాలను సందర్శించండి : డీఈవో వెంకటనర్సమ్మ

విద్యార్థులు పరీక్షలు ప్రారంభమవడానికి ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రాలను సందర్శించాలి. 277 అదనపు కేంద్రాలను అదే ప్రాంగణంలో, మరో 69 కేంద్రాలను మాత్రం సమీపంలోనే ఏర్పాటు చేశాం. వెబ్‌సైట్‌లో ఉన్న ప్రకారంగా కేటాయించిన పరీక్షా కేంద్రాలను ఒకరోజు ముందుగానే సందర్శించి రావడం ఉత్తమం.


logo