గురువారం 16 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 02:00:58

వైద్యులపై తప్పుడు ప్రచారం తగదు

వైద్యులపై తప్పుడు ప్రచారం తగదు

  • ప్రాణాలు పణంగా పెట్టి సేవలుచేస్తే నిందలా?
  • యశోద దవాఖాన వైస్‌ ప్రెసిడెంట్‌ లలితారెడ్డి

ఖైరతాబాద్‌: కరోనా కాలంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యసిబ్బందిపై తప్పుడు ఆరోపణలు తగవని యశోద దవాఖాన వైస్‌ప్రెసిడెంట్‌ డాక్టర్‌ లలితారెడ్డి పేర్కొన్నారు. తీవ్ర శ్వాసకోశవ్యాధితో యశోదలో చేరిన బాధితుడికి చికిత్సచేసి ఇంటికి పంపితే, అతడికి కరోనా చికిత్స ఇచ్చి అధికబిల్లు వేశారంటూ సోషల్‌మీడియాలో వారి బంధువు దుష్ప్రచారం చేశాడు. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జనరల్‌ ఫిజీషియన్‌ శశికిరణ్‌, రోగి చిన్నాన్న ఆషీమ్‌అలీఖాన్‌తో కలిసి లలితారెడ్డి వాస్తవాలను వివరించారు. గత శుక్రవారం యాకుత్‌పురాకు చెందిన మీర్‌వాహిద్‌అలీఖాన్‌(35)ను ప్రాణాపాయస్థితిలో దవాఖానకు తీసుకొచ్చారని,శ్వాస ఆడకపోవటంతో ఐసొలేషన్‌ ఐసీయూలో చికిత్స ఇచ్చామని చెప్పారు. పరీక్షల్లో ఛాతికి 90 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకినట్టు రిపోర్టులు రాగా, అత్యుత్తమ చికిత్స అందించి రెండురోజుల్లో మామూలుస్థితికి తీసుకొచ్చామని తెలిపారు. కరోనా పరీక్ష నిర్వహించగా, నెగెటివ్‌ వచ్చిందని చెప్పారు. అలీఖాన్‌కు కరోనా చికిత్స చేసి అధిక బిల్లులు వేశామంటూ యాకుత్‌పురాకే చెందిన ముక్తాదిర్‌ తప్పుడు బిల్లులను సృష్టించి సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేశాడని చెప్పారు. అతనిపై పంజాగుట్ట, సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశామని పేర్కొన్నారు. ‘శ్వాస తీసుకోలేని స్థితిలో వాహెద్‌ను యశోద దవాఖానకు తీసుకొస్తే మెరుగైన చికిత్స ఇచ్చి బాగుచేశారు. యకుత్‌పురా మీ సేవ కేంద్రం నిర్వాహకుడు ముక్తాదీర్‌ నాకు ఫోన్‌చేసి యశోద బిల్లు వాట్సాప్‌ చేయమన్నాడు. కరోనా లేకున్నా వాహెద్‌కు వ్యాధి ఉన్నట్టు బిల్లు తయారుచేసి సోషల్‌మీడియాలో ప్రచారంచేశాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తికి ప్రాణంపోశారు. వారిపై ఆరోపణలు తగవు. ముక్తాదీర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి’అని మీర్‌ఆషీమ్‌ అలీఖాన్‌ కోరారు.logo