గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 12:21:05

జ‌ల‌వివాదాల‌పై అపెక్స్ కౌన్సిల్ భేటీ

జ‌ల‌వివాదాల‌పై అపెక్స్ కౌన్సిల్ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర జల్‌‌శ‌క్తి ఆధ్వ‌ర్యంలో అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం ప్రారంభమైంది. ఈ స‌మావేశంలో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ప‌ర‌స్ప‌ర ఫిర్యాదులు, అభ్యంత‌రాల దృష్ట్యా ఈ స‌మావేశానికి ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. హైద‌రాబాద్ నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి సీఎం జ‌గ‌న్ పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల చైర్మన్లు జలసౌధలోని తమ తమ చాంబర్ల నుంచి హాజరవుతారు. 

నీటి కేటాయింపుల్లో రాజీ ప్ర‌స‌క్తే లేద‌ని తెలంగాణ తేల్చిచెబుతోంది. రాష్ర్టానికి ద‌క్కాల్సిన వాటాపై గ‌ట్టిగానే వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఏపీ వాద‌న‌ల‌కు ధీటుగా స‌మాధానం చెప్పాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. కేంద్రం కూడా ఈ భేటిలో కొన్ని నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంది. అపెక్స్ కౌన్సిల్ నాలుగు అంశాల‌ను అజెండా‌గా నిర్ణ‌యించింది. అజెండాలోని అంశాల‌పై కేంద్ర జ‌ల్‌శ‌క్తి అధికారుల‌తో కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ చ‌ర్చించారు. ఇరు రాష్ర్టాలు లేవ‌నెత్తే అంశాలు, కేసీఆర్ లేఖ‌లోని అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ‌ను త‌మ‌కే అప్ప‌గించాల‌ని తెలంగాణ కోర‌నుంది. కృష్ణా జ‌లాల‌పై గ‌ట్టిగా విచార‌ణ జ‌ర‌పాల‌ని సీఎం కోర‌నున్నారు. అంత‌రాష్ర్ట జ‌ల‌వివాదం చ‌ట్టం -1956లోని సెక్ష‌న్ 3 ప్ర‌కారం విచార‌ణ‌కు డిమాండ్ చేస్తున్నారు. 

తెలంగాణ తరఫున బలమైన వాదనలు

అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ తరఫున సీఎం కేసీఆర్‌ బలమైన వాదనలు వినిపించనున్నారు. కొన్నిరోజులుగా జల వనరులశాఖ అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించిన కేసీఆర్‌.. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. ప్రధానంగా నదీజలాల వివాద ట్రిబ్యునల్‌-1956లోని సెక్షన్‌-3 ప్రకారం ఏడాదిలోనే తేల్చాల్సిన తెలంగాణ నీటివాటాను ఆరేండ్లు దాటినా ఇంకా నానబెట్టడంపై సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని నిలదీయనున్నారు. కృష్ణాజలాల్లో వాటాతోపాటు, గోదావరిలో మిగులు వాటాను కూడా తేల్చాలని డిమాండ్‌ చేయనున్నారు. పోలవరం వాటాకు సంబంధించి తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల కృష్ణాజలాల అంశాన్ని, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ భారీఎత్తున నీటిని అవతలి బేసిన్‌కు తరలించడం, గతంలో అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం తదితర అంశాలను సీఎం సమావేశంలో ప్రస్తావించనున్నారు. 

ఇక.. ఏకపక్షంగా, ఎలాంటి అనుమతుల్లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు పనులను చేపట్టేందుకు ఏపీ సిద్ధమైనందున ఆ ప్రాజెక్టును నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కేసీఆర్‌ కేంద్రా న్ని డిమాండ్‌ చేయనున్నారు. ఏపీ గిల్లికజ్జాలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ గోదావరి ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయడాన్ని నిలదీయనున్నట్టు తెలిసింది. తెలంగాణ ఏ ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా చేపట్టడం లేదని.. ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదంపొందిన ప్రాజెక్టులను తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా రీడిజైన్‌ చేసి నిర్మిస్తున్నట్టు తగిన ఆధారాలతోసహా కేంద్రం ముందుంచనున్నారు. ఇప్పటికే సుదీర్ఘ లేఖలో కేంద్రం, ఏపీ వైఖరిపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్‌.. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం వేదికగా మరోసారి గళం విప్పనున్నారు. 


logo