శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 00:49:46

‘ధరణి’ పనితీరు భేష్‌

‘ధరణి’ పనితీరు భేష్‌

  • కర్నూలు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ కితాబు

అయిజ: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ పనితీరు బాగుందని ఏపీ రిజిస్ట్రేషన్‌ అధికారుల బృందం ప్రశంసించింది. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ తాసిల్‌ కార్యాలయాన్ని ఏపీ అధికారులు సందర్శించారు. కర్నూలు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ కిరణ్‌కుమార్‌ నేతృత్వంలో నలుగురు రిజిస్ట్రార్లు ధరణి పోర్టల్‌ పనితీరు, రిజిస్ట్రేషన్లు చేసే విధానం, ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌, డిజిటల్‌ పట్టాదార్‌ పాస్‌పుస్తకం పంపిణీ, రికార్డుల నిర్వహణవంటి వాటిని తాసిల్దార్‌, జాయింట్‌ రిజిస్ట్రార్‌ యాదగిరిని అడిగి తెలుసుకున్నారు. కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేస్తున్నట్టు చెప్పడంతో ఏపీ అధికారులు ఆశ్చర్యపోయారు. అనంతరం  కర్నూల్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ధరణి పోర్టల్‌తో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ బృందంలో కర్నూలు, అనంతపురం జిల్లాల రిజిస్ట్రార్లు నాగభూషణం, సీహెచ్‌ హరివర్మ, సబ్‌ రిజిస్ట్రార్లు బాలసుబ్రమణ్యం, ఇసాక్‌ బ్లెసింగ్‌స్టన్‌ తదితరులు ఉన్నారు. 


logo