శనివారం 04 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:26:05

విద్యుత్‌ బిల్లుకు ఏపీ వ్యతిరేకం

విద్యుత్‌ బిల్లుకు ఏపీ వ్యతిరేకం

  • ఈ సవరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం 
  • ఇది పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం
  • కేంద్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లేఖ

అమరావతి: కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం -2020 బిల్లును  ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని, వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని, పారిశ్రామిక వృద్ధిని అడ్డుకుంటుందని తెలిపింది. ప్రతిపాదిత విద్యుత్‌ సవరణ బిల్లుపై ఏపీ సర్కార్‌ తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ కేంద్రానికి లేఖ రాసింది. ఈ బిల్లు ఉమ్మడి జాబితాలోని విద్యుత్‌ రంగాన్ని కేంద్రీకృతం చేసేదిగా ఉన్నదని తెలిపింది. విద్యుత్‌ ఉత్పత్తిదారులకు అవసరమైనదానికన్నా ఎక్కువ రక్షణ కల్పిస్తున్నదని, దీనివల్ల విద్యుత్‌ కొనుగోలు రేట్లు పెరిగిపోతాయని పేర్కొన్నది. ఈ బిల్లులో వినియోగదారుల ప్రయోజనాలకు భద్రతలేదని, దీంతో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రస్తుతం రాష్ర్టాల పరిధిలో ఉన్న సంప్రదింపుల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వానికి బదిలీచేసే బిల్లులోని సెక్షన్‌ 3ఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ సర్కార్‌ స్పష్టంచేసింది. ఈ సవరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ను, సభ్యులను ఎంపికచేసే అధికారం కే్రంద కమిటీకి అప్పగించాలన్న ప్రతిపాదన అధికారాల వికేంద్రీకరణ సూత్రానికి విరుద్ధమని పేర్కొన్నది. ఇది రాష్ర్టాల స్వయంప్రతిపత్తిని హరిస్తుందని స్పష్టంచేసింది. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ అధికారాలను ఢిల్లీలోని కేంద్ర సంస్థకు బదిలీ చేయడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించింది. వినియోగదారుల ఖాతాకు సబ్సిడీని బదిలీ చేయాలన్న ప్రతిపాదన సామాజిక అశాంతిని సృష్టించగలదని ఏపీ సర్కార్‌ హెచ్చరించింది. కేంద్రీకృత అధికారాలను నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎన్‌ఎల్‌డీసీ) లేదా కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టే సెక్షన్‌ 25 (6)ను తొలగించాలని డిమాండ్‌ చేసింది. రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్లను స్వతంత్రంగా పనిచేసేందుకు అనుమతించాలని కోరింది. కాంట్రాక్టులను కట్టబెట్టే బాధ్యతను ఎన్‌ఎల్‌డీసీలకు అప్పగించడం ఆశ్రిత పక్షపాతానికి దారితీయగలదని తెలిపింది.


logo