శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 03:10:25

అవాస్తవాల నివేదన

అవాస్తవాల నివేదన

 • రికార్డులను పరిశీలించకుండానే సంయుక్త కమిటీ నివేదిక
 • రాయలసీమ లిఫ్టుకు పర్యావరణ అనుమతులు అనివార్యం
 • శ్రీశైలం 797 అడుగుల స్థాయిలో కొత్తలిఫ్టు స్కీం అక్రమం
 • ఎన్జీటీలో రాష్ట్రప్రభుత్వం తాజా అఫిడవిట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీ అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ పోరాటాన్ని ముమ్మరం చేసింది. సుప్రీంకోర్టు తలుపుతట్టడం,  అపెక్స్‌ కౌన్సిల్‌ ఎండగట్టేందుకు సిద్ధమవుతూనే, జాతీయ హరిత ట్రిబ్యునల్‌లోనూ తాజాగా అఫిడవిట్‌ వేసింది. సీమ ఎత్తిపోతలపై తుదితీర్పునకు సిద్ధమైన జాతీయహరిత ట్రిబ్యునల్‌ను పునర్విచారణకు ఒప్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశానుసారం బుధవారం అఫిడవిట్‌ దాఖలుచేసింది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ 2006 నోటిఫికేషన్‌ ప్రకారం.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి అనే సాంకేతిక విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో నిపుణుల సంయుక్త కమిటీ పూర్తిగా విఫలమైందని స్పష్టంచేసింది. ఆ కమిటీ నివేదిక అవాస్తవాలతో, పక్షపాత ధోరణితో.. తప్పుల తడకగా ఉన్నదని ఆధారాలతో సహా వివరించింది. 28న ఎన్జీటీ విచారణ నేపథ్యంలో జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. 

తెలంగాణ దాఖలుచేసిన అఫిడవిట్‌ సారాంశం..

 • ఒక ప్రాజెక్టును విస్తరించినా, ఆధునీకరించినా తాజాగా పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. కానీ, రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో కమిటీ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. తెలుగుగంగకు 1988లో, ఎస్సార్బీసీకి 1995లో, గాలేరు నగరికి 2006లో షరతులతో కూడిన పర్యావరణ అనుమతులు ఇచ్చారు. ఈ మూడు ప్రాజెక్టులకు నీటినందించేందుకు ఈ పథకాన్ని చేపడుతున్నట్టు ఏపీ ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో తాజాగా పర్యావరణ అనుమతులు తప్పనిసరి. ఈ అంశాన్ని కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. సమగ్ర సమాచారాన్ని సేకరించడంలోనే పూర్తిగా విఫలమైంది. 
 • ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీచేసిన 203, 388 జీవోల ప్రకారం.. గోరకల్లు నుంచి గండికోట జలాశయాల వరకు ఉన్న కాలువ సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నది. ఇది రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం పరిధిలోకి వస్తుంది. పైగా ఇది బఫర్‌జోన్‌ కూడా కాదు. కోర్‌ (సెంట్రల్‌) జోన్‌లో ఉందనేది ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనే ఉన్నది. 
 • వెలిగోడు 16.5 టీఎంసీల నీటినిల్వ వల్ల కూడా రాజీవ్‌గాంధీ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం ముంపునకు గురవుతుంది. పైగా ఇది పులుల సంరక్షణ ప్రాంతం. 
 • సోమశిల, కండలేరు జలాశయాల సామర్థ్య పెంపుతో తెలుగుగంగ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. ఈ రెండు జలాశయాలు కూడా పెనుశిల నర్సింహస్వామి వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం పరిధిలోకి వస్తాయి. కమిటీ తన నివేదికలో ఏ ఒక్కదాన్నీ పొందుపర్చలేదు. 

అఫిడవిట్‌లోని ముఖ్యాంశాలు

 • పోతిరెడ్డిపాడు సిల్‌లెవల్‌ +261.20 మీటర్లుగా పేర్కొన్నారు. కానీ వాస్తవంగా అది +256.20 మీటర్లు.
 • రాయలసీమ ప్రాజెక్టుకు 111 టీఎంసీల నీటి కేటాయింపు ఉందన్నది అవాస్తవం. బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డులో రాయలసీమ పేరిట ప్రాజెక్టు లేదు. 
 • ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్‌-89 కింద బచావత్‌, బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌లో ఇతరబేసిన్‌కు కృష్ణాజలాల కేటాయింపు అంశం న్యాయస్థానం పరిధిలో (సబ్‌జూడీస్‌) ఉన్నది. 
 • రోజుకు మూడు టీఎంసీల (34722 క్యూసెక్కులు) ఎత్తిపోతకు కేటాయింపు ఉన్నదని పేర్కొనడం తప్పు. 1977 ఒప్పందం ప్రకారం 1500 క్యూసెక్కుల జలాల తరలింపునకే అంగీకారం ఉన్నది. శ్రీశైలంలో 854 అడుగుల నుంచి 750 క్యూసెక్కుల జలాల తరలింపునకే ఎస్సార్బీసీకి అనుమతి ఉన్నది. కానీ 203 జీవోలో శ్రీశైలంలో 799 అడుగుల నుంచి 34,722 క్యూసెక్కుల ఎత్తిపోతకు పాలనా అనుమతి ఇచ్చింది. శ్రీశైలంలో 854 అడుగుల స్థాయిలో రాయలసీమలిఫ్టు ద్వారా 84 టీఎంసీలను ఎత్తిపోసేందుకు కేటాయింపులు ఉన్నాయని కమిటీ నివేదికలో పేర్కొనడం అవాస్తవం. ఈ స్థాయిలో ఎస్సార్బీసీకి కేవలం 8వేల క్యూసెక్కుల డిశ్చార్జికి అనుమతి ఉండగా... 797 అడుగుల స్థాయిలో 34,722 క్యూసెక్కులు ఎత్తిపోతకు కొత్త ప్రాజెక్టు చేపడుతున్నది. ఈ ప్రాజెక్టు కొత్తది కానందున పర్యావరణ అనుమతులు అవసరంలేదని కమిటీ పేర్కొనడం విడ్డూరం. 
 • రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కృష్ణా బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉందని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. అంటే ఇది కొత్త ప్రాజెక్టని అర్థమవుతున్నది. 
 • బచావత్‌ ట్రిబ్యునల్‌ శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి నీటి కేటాయింపులు చేపట్టలేదు. తెలుగుగంగ, గాలేరు నగరి ప్రాజెక్టుల్ని మిగులుజలాల ఆధారంగా, శ్రీశైలంలో 885 అడుగుల కంటే ఎక్కువ నీటిమట్టం స్థాయిలో వరద వచ్చినపుడే వినియోగించుకునేందుకు చేపట్టారు. కేసీ కెనాల్‌ అనేది కృష్ణానదితో సంబంధం లేనిది. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ముందు కూడా ఏపీ ఈ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కోరలేదు. 
 • చెన్నై తాగునీటి కోసం ఏపీ శ్రీశైలం నుంచి ఏడాదికి 15 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. ఎస్సార్బీసీకి 19 టీఎంసీల కేటాయింపు ఉన్నందున ఏటా 34 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకోవద్దు. 2018-19లో 115.4, 2019-20లో 179.30 టీఎంసీలను పోతిరెడ్డిపాడు ద్వారా తరలించింది. 
 • ఏపీ జీవోలోనే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, కాలువ, విస్తరణ పనులను పేర్కొన్నా, రాయలసీమ ఎత్తిపోతల విస్తరణ కాదని కమిటీ పేర్కొన్నది. పర్యావరణ అనుమతులు అవసరంలేదని చెప్పింది.
 • గాలేరు నగరి డీపీఆర్‌లోనే గోరకల్లు-అవుకు జలాశయాల మధ్య కాలువ ప్రవాహ సామర్థ్యం12,735 క్యూసెక్కులే,  ఏపీ ప్రభుత్వం జీవోలో 30 వేల క్యూసెక్కులకు పెంచాలని ఉన్నది. అంటే డీపీఆర్‌కు భిన్నం గా చేపడుతున్నందున ఇది కొత్త నిర్మాణమే. 
 • తెలుగుగంగ ప్రాజెక్టులో వెలిగోడు, శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయర్లను చేపట్టినట్లుగా ఏపీ బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అసలు తెలుగుగంగ ప్రాజెక్టు డీపీఆర్‌లో ఈ రెండు రిజర్వాయర్లు లేవు. తెలుగుగంగకు తీసుకున్న పర్యావరణ అనుమతులు ఈ రిజర్వాయర్లకు వర్తించవు. 
 • శ్రీశైలంలో 802 అడుగుల స్థాయిలో తెలంగాణ ప్రాజెక్టుల ఎత్తిపోతల సామర్థ్యం 28,014 క్యూసెక్కులుగా కమిటీ పేర్కొనడం అవాస్తవం. కల్వకుర్తి లిఫ్టుతో 3,200 క్యూసెక్కుల ఎత్తిపోత సా మర్థ్యమే ఉన్నది. పాలమూరు-రంగారెడ్డి నిర్మాణంలోనే ఉన్నది. 
 • శ్రీశైలం 795 అడుగుల వద్ద ఏపీకి చెందిన ముచ్చుమర్రి-హంద్రినీవా ఎత్తిపోత సామర్థ్యాన్ని 989 క్యూసెక్కులుగా ఏపీ పేర్కొంటున్నది. ముచ్చుమర్రి 1,839 క్యూసెక్కులు. హంద్రినీవాది 3,850 క్యూసెక్కుల సామర్థ్యం. శ్రీశైలంలో నీటిమట్టం స్థాయిని 834 అడుగులుగా తప్పుదోవ పట్టిస్తున్నది. 
 • గాలేరు నగరి కింద నిర్మించిన బాలాజీ, మల్లిమడుగు, వేణుగోపాల్‌సాగర్‌, ఉద్దిమడుగును డీపీఆర్‌లో పేర్కొనలేదంటే పర్యావరణ అనుమతులు లేనట్లే.


logo