శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 01:46:45

జల పిశాచి!

జల పిశాచి!

 • తెలంగాణను వీడని పోతిరెడ్డి‘పాడు’ గ్రహణం
 • చిన్నకాలువగా మొదలై నదిలా మారిన నిర్మాణం
 • మద్రాసుకు తాగునీటి పేరిట దశాబ్దాలుగా దగా
 • 11,150 క్యూసెక్కుల ప్రవాహానికే అనుమతి
 • దానిని 60,150 క్యూసెక్కులకు పెంచిన వైఎస్‌
 • 2009లో లక్ష క్యూసెక్కులకుపైగా పారిన రికార్డు
 • రాయలసీమ లిఫ్టుతో మరింత విస్తరించే యత్నం
 • పోతిరెడ్డిపాడు ముసుగులో ఏపీ సర్కారు జలదోపిడీ

పోతిరెడ్డిపాడు.. మద్రాస్‌కు తాగునీటి పేరిట కృష్ణాబేసిన్‌కు పట్టిన జలపిశాచి. పెన్నాబేసిన్‌కు కృష్ణాజలాలను తరలించేందుకు సమైక్యరాష్ట్రంలో రచించిన కుట్రకు రూపం. ఉమ్మడిపాలనలో తెలంగాణ అసమర్థ రాజకీయనేతలకు సజీవ సాక్ష్యం. తెలంగాణను ఆరుదశాబ్దాలపాటు రాచపుండులా పీడించి ప్రత్యేక రాష్ట్రంలోనూ వారసత్వ గ్రహచారంగా పరిణమించిన పాడుపీడ. మూడుదశాబ్దాల క్రితం పెన్నాబేసిన్‌కు కృష్ణాజలాలను తరలించేందుకు కిటికీలు బిగిస్తే.. ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తలుపులు తెరిచారు. తాజాగా జగన్మోహన్‌రెడ్డి ఏకంగా కోట గుమ్మంలా మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారు. మద్రాస్‌ మాటున జలదోపిడీపై తెలంగాణ సర్కార్‌ ఎన్ని ఫిర్యాదులు చేసినా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌, కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయి. చిన్నకాలువలా ఏడాదికి 34 టీఎంసీలు మాత్రమే పారాల్సిన పోతిరెడ్డిపాడులో ఏటావందల టీఎంసీలతో చిన్నపాటి నదిలా ప్రవహిస్తున్న ఏపీ జల కుట్రలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మద్రాసు నగర తాగునీటి ప్రతిపాదనను ఆసరాగా చేసుకుని ఉమ్మడి ఏపీ పాలకులు పెన్నా బేసిన్‌కు కృష్ణాజలాల తరలింపు కుట్రకు బీజంవేశారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ దీనిని వ్యతిరేకించడంతో వ్యూహాత్మకంగా రాష్ర్టాల మధ్య ఒప్పందంతో తెలుగుగంగ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 1976లో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు తలా 5 టీఎంసీల చొప్పున మొత్తం 15 టీఎంసీలు అందించేలా ఒప్పందం జరిగింది. అయితే, కృష్ణానదిపై ఎక్కడ్నుంచి నీటిని తీసుకోవాలనేది ఒప్పందంలో పేర్కొనకపోవడంతో.. 1977లో జరిగిన మరో ఒప్పందంలో శ్రీశైలం నుంచి తీసుకోవాలనే అంశాన్ని చేర్చారు. లైనింగ్‌ కాలువ ద్వారా 1500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో 15 టీఎంసీలను జూలై-అక్టోబర్‌ మధ్యలో మాత్రమే తరలించాలని పొందుపరిచారు. అయితే, అప్పటి పాలకులు ఆఫ్‌టేక్‌ పాయింట్‌ను పెన్నానదికి 4కిలోమీటర్ల దూరంలోనే ఏర్పాటుచేసి వ్యూహాత్మకంగా జలదోపిడీకి మార్గం సుగమం చేశారు. 

ఆపై శ్రీశైలం కుడిగట్టు కాల్వ (ఎస్సార్బీసీ)తో కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 11,150 క్యూసెక్కులకు పెంచారు. 2004లో ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్సార్‌.. తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోకుండా సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులు చేశారు. పాతగేట్ల స్థానంలో కొత్త గేట్లను నిర్మిస్తున్నామని.. ఇక పాతవి ఉపయోగించబోమంటూ 2006 లో నాటికాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించినా.. నేటికీ అవికూడా వాడకంలో ఉన్నాయి. పాతగేట్ల డిజైన్‌ ప్రకారం గరిష్ఠ డిశ్చార్జి 11,150 క్యూసెక్కులు. దీనికితోడు హైడ్రోఎలక్ట్రికల్‌ పవర్‌స్టేషన్‌ ద్వారా మరో 5,500 క్యూసెక్కులను విడుదల చేసేందుకు అవకాశముంది. ఇలా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం అధికారికంగానే 60,150 క్యూసెక్కులకు చేరింది.

సాంకేతికంగా 1.75 లక్షల క్యూసెక్కుల మళ్లింపు

వాస్తవంగా వైఎస్‌ హయాంలో నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ గరిష్ఠ డిశ్చార్జి డిజైన్‌ ప్రకారం 44,733 క్యూసెక్కులు (1267 క్యూమెక్స్‌). కానీ, దాని సాంకేతిక వివరాలు, ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తే 1.75 లక్షల క్యూసెక్కులు. అంటే రోజులో కనీసం 15 టీఎంసీలను తరలించుకుపోవచ్చన్న మాట. వింటే విస్మయం కలిగించినా.. ఏపీ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (ఏపీఈఆర్‌ఎల్‌) మోడల్‌ స్టడీ నివేదికతోపాటు సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ రికార్డుల ప్రకారం వాస్తవమని తేలింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ వాస్తవాలను సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపరిచింది.

అదెలాగంటే..

 • పోతిరెడ్డిపాడు డిజైన్‌ లెవల్‌ 880 అడుగులు (268.23 మీటర్లు). బెడ్‌ లెవల్‌ 840.02 అడుగులు (256.04 మీటర్లు). శ్రీశైలం రిజర్వాయర్‌ 841 అడుగుల వద్ద క్రస్ట్‌గేట్ల (స్పిల్‌ లెవల్‌)ను ఏర్పాటుచేశారు. అంటే శ్రీశైలం రిజర్వాయర్‌లో 841 అడుగుల మేర ఉన్నప్పటి నుంచి పోతిరెడ్డిపాడుకు నీటివిడుదల సాధ్యమవుతుంది. 
 • హెడ్‌రెగ్యులేటర్‌లో 32.8 అడుగుల వెడల్పు, 28 అడుగుల ఎత్తు చొప్పున పదిగేట్లు అమర్చారు. ఇందులో ఒకటి స్టాండ్‌బైగా పరిగణిస్తున్నారు. పాత 4గేట్లతో కలిపితే మొత్తం 14 గేట్లు అవుతాయి.
 • శ్రీశైలం జలాశయంలో 880 అడుగుల నీటిమట్టం ఉన్నపుడు 9 గేట్లను ఎనిమిది మీటర్లు ఎత్తినట్లయితే డిశ్చార్జి 44,600 క్యూసెక్కులు. అదే 14 గేట్లను ఎత్తితే 69,400 క్యూసెక్కులు. దీనికి హైడ్రోఎలక్ట్రికల్‌ పవర్‌స్టేషన్‌ ద్వారా మరో 5,500 క్యూసెక్కులను కలిపితే మొత్తం డిశ్చార్జి 74,700 క్యూసెక్కులు. 
 • 882 అడుగుల నీటిమట్టం ఉన్నపుడు 9 గేట్లను పూర్తిస్థాయిలో తెరిస్తే 84,126 క్యూసెక్కుల డిశ్చార్జి.. 14 గేట్లను తెరిస్తే 1,30,800 క్యూసెక్కులకు చేరుకుంటుంది. హైడ్రోఎలక్ట్రికల్‌ పవర్‌ స్టేషన్‌ ద్వారా 5,500 క్యూసెక్కులు కలిపితే మొత్తం 1,36,300 క్యూసెక్కులు. 
 • శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉన్నప్పుడు 9 గేట్ల ద్వారా 1,10,200..14 గేట్ల ద్వారా 1,71,400 క్యూసెక్కుల డిశ్చార్జి ఉంటుంది. హైడ్రోఎలక్ట్రికల్‌ పవర్‌స్టేషన్‌ ద్వారా 5,500 కలిపితే మొత్తం 1,76,900 క్యూసెక్కులు అవుతుంది. అంటే.. పోతిరెడ్డిపాడు నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జికి సాంకేతికంగా వెసులుబాటు ఉన్నదని ఏపీఈఆర్‌ఎల్‌ నివేదికలోనే ఉన్నది.  

లైనింగ్‌తో రెట్టింపు ప్రవాహ సామర్థ్యం

రాయలసీమ ఎత్తిపోతల పథకం దరిమిలా పోతిరెడ్డిపాడును విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. అయితే ఎలాగూ హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం ఎక్కువగానే ఉన్నందున దానిని అలాగే ఉంచి.. కేవలం ప్రవాహ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు యత్నిస్తున్నది. ఇందుకోసం ఉన్న కాలువను విస్తరించడం లేదా మరో కాలువను తవ్వడమేమీ చేయడం లేదు. కేవలం కాలువకు లైనింగ్‌ మాత్రమే చేయనున్నారు. సాధారణంగా కాలువ నిర్మాణంలో దాని గోడలు గరుకులుగా ఉంటే నీటి ప్రవాహానికి అడ్డుఉండి వేగం తక్కువగా ఉంటుంది. కానీ, గోడలను సిమెంట్‌ లైనింగ్‌ చేస్తే నునుపుగా మారి ప్రవాహం వేగం సాధారణం కంటే రెట్టింపవుతుంది. అందుకే ఏపీ ప్రభుత్వం ప్రధాన కాలువ గరిష్ఠ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు లైనింగ్‌ పనులకు అనుమతులిచ్చింది. కాలువను లైనింగ్‌ చేస్తే ప్రవాహ సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నుంచి 88,800 క్యూసెక్కులకు పెరుగనున్నది.

ముందుగానే భారీ రిజర్వాయర్లు

శ్రీశైలం జలాశయం నుంచి జలదోపిడీకి బీజం పడగానే సమైక్య పాలకులు దానిని మరింత సుస్థిరం చేశారు. ఇందులోభాగంగానే పెన్నా బేసిన్‌లో ఏకంగా 350 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు. వాస్తవంగా ఏపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారమే పెన్నా బేసిన్‌లో నీటి లభ్యత 75 శాతం డిపెండబులిటీపై 98.7 టీఎంసీలు మాత్రమే. కానీ, ఇంత తక్కువ నీటి లభ్యతఉన్న బేసిన్‌లో దాదాపు 350 టీఎంసీల నిల్వసామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించుకోవడమంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణాజలాల్ని ఇక్కడికి తరలించుకోవాలనే కుట్ర దాగి ఉందనేది సుస్పష్టం. మా హక్కుకు లోబడి కృష్ణాజలాలను వాడుకుంటామని చెప్తున్న ఏపీ ప్రభుత్వం.. ఈ జలపిశాచిని మరింత విస్తరించడమంటే శ్రీశైలం జలాశయాన్ని చెరపట్టి తెలంగాణను ఎడారిగా మార్చడమే! ఒకవైపు రెండురాష్ర్టాల మధ్య జలాల పునఃపంపిణీపై బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ విచారణ కొనసాగుతుండగా.. ఏపీ సర్కారు తలపెట్టిన ఈ దుస్సాహసాన్ని అడ్డుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాలుగా పోరాటం చేస్తున్నది. పెద్దన్నలా వ్యవహరించాల్సిన కేంద్రప్రభుత్వం ఆరు దశాబ్దాలుగా అన్యాయానికి గురైన తెలంగాణకు న్యాయం చేస్తుందా? పోతిరెడ్డిపాడులాంటి జలపిశాచిని అడ్డుకోకుండా తెలంగాణను ఎడారిగా మారుస్తుందా? అపెక్స్‌ భేటీలో ఏమి జరుగనున్నదో వేచిచూడాలి.

2004లో ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్సార్‌.. తెలంగాణ ప్రాంత అభ్యంతరాలు పట్టించుకోకుండా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. పాతగేట్ల స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నామని.. ఇక పాతవి ఉపయోగించబోమని 2006లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించినా.. నేటికీ అవికూడా వాడకంలో ఉన్నాయి. పాతగేట్ల గరిష్ఠ డిశ్చార్జి 11,150 క్యూసెక్కులు. దీనికితోడు హైడ్రోఎలక్ట్రికల్‌ పవర్‌స్టేషన్‌ ద్వారా మరో 5,500 క్యూసెక్కుల విడుదలకు అవకాశముంది. ఇలా పోతిరెడ్డిపాడు సామర్థ్యం అధికారికంగానే 60,150 క్యూసెక్కులకు చేరింది.

వాస్తవంగా వైఎస్‌ హయాంలో నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ గరిష్ఠ డిశ్చార్జి  డిజైన్‌ ప్రకారం 44,733 క్యూసెక్కులు (1267 క్యూమెక్స్‌). కానీ, దాని సాంకేతిక వివరాలు, ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తే 1.75 లక్షల క్యూసెక్కులు. అంటే రోజులో కనీసం 15 టీఎంసీలను తరలించుకుపోవచ్చన్న మాట. వింటే విస్మయం కలిగినా.. ఏపీ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ మోడల్‌ స్టడీ నివేదికతోపాటు సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ రికార్డుల ప్రకారం వాస్తవమని తేలింది. 

2009 వరదతో రుజువు

ఉమ్మడి ఏపీలో 2009లో వచ్చిన భారీ వరదలతో పోతిరెడ్డిపాడు అసలు సామర్థ్యం బయ టపడింది. అక్టోబర్‌ 4,5 తేదీల్లో పోతిరెడ్డిపాడు ద్వారా 1.10 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి ఉన్నదని నాటి ప్రభుత్వం అధికారికంగా స్పష్టంచేసింది. 3వ తేదీ సాయంత్రం ఆరునుంచి ఎనిమిది గంటల వరకు లక్ష క్యూసెక్కుల డిశ్చార్జి కొనసాగించిన అధికారులు.. రాత్రి తొమ్మిది గంటల నుంచి రెండున్నరరోజుల పాటు 1.10 లక్షల క్యూసెక్కులను వదిలారు.

డిజైన్‌ డిశ్చార్జి తక్కువయినా..

హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి బనకచర్ల కాంప్లెక్స్‌ వరకు ఉన్న 16.4 కిలోమీటర్ల ప్రధాన కాలువ వెనక కూడా ఇదే సాంకేతిక మర్మం దాగి ఉన్నది. వాస్తవంగా పోతిరెడ్డికాలువ డిజైన్‌ను గరిష్ఠంగా 44 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతోనే నిర్మించారు. పోతిరెడ్డిపాడు సిల్‌ లెవల్‌ (గేట్ల కింది స్థాయి) సముద్రమట్టం నుంచి 841 అడుగులు అయినందున.. నీళ్లు పారాలంటే కాలువ అంతకంటే లోతులో ఉండాలి. అందుకే కాలువ అడుగుభాగం స్థాయి (బెడ్‌ లెవల్‌)ను 840 అడుగులుగా నిర్ధారించారు. కాలువలో గరిష్ఠంగా 44 వేల క్యూసెక్కులు పారాల్సి ఉన్నందున కాలువ ఎఫ్‌ఎస్‌ఎల్‌ (ఫుల్‌ సప్లయి లెవల్‌)ను 879 అడుగులుగా నిర్ణయించారు. అయితే ఈ కాలువ నిర్మాణ ప్రాంతం (కృష్ణా-పెన్నారిడ్జ్‌ - రెండు బేసిన్ల సరిహద్దులు ఆనుకుని ఉన్న ప్రాంతం) పోతిరెడ్డిపాడు కాలువ ఎఫ్‌ఎస్‌ఎల్‌ కంటే అనేక అడుగుల ఎత్తులో ఉన్నది. కొన్నిచోట్ల గరిష్ఠంగా 892 అడుగుల ఎత్తులోనూ ఉన్నది. దీంతో కాలువ నిర్మాణం మొత్తం డీప్‌కట్‌లోనే సాగింది. అంటే పూర్తిస్థాయిలో 44 వేల క్యూసెక్కులు నీళ్లు పారినా ఇంకా కాలువలో ఫ్రీ బోర్డు చాలా ఉంటుంది. అందుకే పోతిరెడ్డిపాడు ప్రధాన కాలువ నిర్మాణం పూర్తిగా డీప్‌కట్‌లోనే సాగినందున.. దాని డిజైన్‌ గరిష్ఠ ప్రవాహ సామర్థ్యం 44 వేల క్యూసెక్కులు అయినా 2009 వరదల సమయంలో 1.10 లక్షల క్యూసెక్కుల నీళ్లు కూడా పారాయి.