శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 02:39:37

ఈ చట్టం విప్లవాత్మకం

ఈ చట్టం విప్లవాత్మకం

  • రెవెన్యూ చరిత్రలో రెవెల్యూషనరీ స్టెప్‌
  • భూమిపై సామాన్యుడికి భరోసా కల్పన
  • సీఎం కేసీఆర్‌ చొరవ అభినందనీయం
  • కొత్త రెవెన్యూ చట్టంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏఎస్‌ శామ్యూల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం దేశ భూ సంస్కరణల చట్టాల్లోనే విప్లవాత్మకమైనదని, సామాన్యుడికి తన భూమిపై భరోసా కల్పిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏఎస్‌ అధికారి ఎం శామ్యూల్‌ పేర్కొన్నారు. 35 ఏండ్లకుపైగా వివిధ ప్రభుత్వ హోదాల్లో పనిచేశానని, చాలా సందర్భాల్లో సమగ్ర రెవెన్యూ చట్టం ఒకటి వస్తే బాగుంటుందని భావించానని, అది ఇన్నాళ్లకు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చారని అన్నారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టంపై ఆయన ఏమన్నారంటే..

వందశాతం పారదర్శకత

తెలంగాణ సీఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రవేశపెట్టిన భూపరిపాలన సంస్కరణల బిల్లును పరిశీలించాను. ఇదో గొప్ప, చారిత్రాత్మక నిర్ణయం. దేశంలో ఈ తరహా చట్టాలు ఎప్పుడో రావాల్సింది. ఇందుకు కేసీఆర్‌ చొరవ తీసుకోవడం అభినందనీయం. కొత్త చట్టంలో వందశాతం పారదర్శకత ఉంటుం ది. సందేహంలేదు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో పట్వారీ, కరణం వ్యవస్థను రద్దుచేశారు. అప్పటికే నేను వరంగల్‌, ఖమ్మం తదితర జిల్లాల్లో రెవెన్యూ అధికారిగా పనిచేశాను. ఎన్టీఆర్‌ది విప్లవాత్మకమైన నిర్ణయమన్నారు. అప్పుడు పట్వారీలు, కరణాలు తమ వద్ద ఉన్న భూదస్త్రాలను తాసిల్దార్లకు అప్పగించలేదు. పోలీసులను ఉపయోగించి దస్త్రాలను తీసుకురావాల్సి వచ్చిం ది.  భూ యజమానుల వివరాల్లో గోప్యత ఇక్కడ కూడా కొనసాగింది. కరణాలు, పట్వారీలుపోయి ఎమ్మార్వోలు, తాసిల్దార్ల చుట్టూ ఓనర్‌షిప్‌ గురించి తెలుసుకోవడానికి భూ యజమానులు తిరిగే వ్యవస్థ వచ్చింది. ఇది కూడా లోపభూయిష్టంగానే మారింది. కానీ, కొత్తగా తెలంగాణ తెచ్చిన చట్టం ఇలా లేదు. పూర్తిగా ప్రజలకు, భూయజమానులకు అనుకూలంగా ఉన్నది. డిజిటలైజ్‌ రికార్డులను ఏ క్షణమైనా, ఎక్కడి నుంచైనా సాధికారికంగా తెలుసుకునే వీలుంటుంది. భూ రికార్డుల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగే పనే ఉండదు.

భూ యజమానుల్లో కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది

భూ యజమానులకు మానసికంగా కాన్ఫిడెన్స్‌ పెరిగేలా ఈ చట్టం ఉన్నది. భూ యజమానికి తెలియకుండానే రికార్డుల్లో మార్పులు జరిగిపోతుంటాయి. ఇది ఎవరి ప్రమేయంతో, ఎలా జరిగిందో, దాన్ని సవరించుకోవడం ఎలాగో తెలియక చాలామంది ఇబ్బందిపడిన ఘటనలు ఉన్నాయి. కొత్త చట్టం ఒక్క క్లిక్‌ దూరంలోనే ఉంటుంది. అనుమానం ఉన్నపుడు ధరణి సైట్‌లోకి వెళ్లి చూసుకోవచ్చు.  

మ్యుటేషన్‌ మన కండ్ల ముందే.. ఇక కావాల్సిందేమిటి?

కొత్త చట్టంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ అధికారం ఒకే అధికారి వద్ద ఉంటుంది. కొనుగోలుదారు భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వెంటనే వారి ముందే మ్యుటేషన్‌ జరుగు తుంది. నా కండ్ల ముందే నా భూమి నాకు మ్యుటేషన్‌ జరిగిందన్న ధీమా కొనుగోలుదారుల్లో ఉంటుంది. ఇంకా కావాల్సింది ఏముంటుంది..? అందుకే ఈ చట్టం గొప్పది.

ప్రజల సంక్షేమానికే పెద్ద పీట

ప్రభుత్వాలు, ప్రభుత్వశాఖల అంతిమ లక్ష్యం ప్రజలకు సేవచేయడం. వారి సంక్షేమానికి వీలైనంత మెరుగ్గా వ్యవహరించడం. పీపుల్‌ సెంట్రిక్‌గా పాలన ఉండాలి. కొత్త చట్టం అనేక అనవసర సమస్యల నుంచి ప్రజలను బయటపడేస్తుందనడంలో సందేహంలేదు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి చేసే సంస్కరణలు పదికాలాలపాటు నిలిచిపోతాయి.

ఉద్యోగులపై అనవసర బాధ్యతలు తగ్గుతాయి.

కొత్త చట్టం ఉద్యోగులకు కూడా ఉపయోగకరం. వారిపై ఇప్పటివరకు ఉన్న అనవసర పనిభారం తగ్గుతుంది. ఇక వీఆర్వో, వీఏవోలకు కూడా మంచే జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న విప్లవాత్మకమైన చట్టం ప్రజలకు మేలుచేస్తుందన్న నమ్మకం నాకు ఉన్నది. 

లిటిగేషన్లు తగ్గుతాయి

మనదేశంలో భూముల అంశాల్లో చాలారకాల లిటిగేషన్లు ఉంటాయి. వ్యక్తికి-వ్యక్తికి మధ్య ఉండే తగవును తీర్చే క్రమం లో ప్రభుత్వశాఖనే ప్రధాన ముద్దాయిగా మారుతున్నది. ఒక వ్యక్తి భూతగాదా అతడి జీవితమంతా తీరకుండా పోతున్నది. కొన్ని సందర్భాల్లో 20-30 ఏండ్లకు కూడా సమస్య తీరదు. బాధితుడు ఒక్కడే ఉంటాడు. కానీ అధికారులు ఓ 20 మం దైనా మారుతారు. చివరికి బాధితులు ఆర్థికంగా చితికిపోతారు. బాధితులు ఆస్తులు అమ్ముకున్న ఘటనలను చూశాను. 


logo