శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 03:07:12

ఘనంగా కేటీఆర్‌ జన్మదినం

ఘనంగా కేటీఆర్‌ జన్మదినం

  • రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, హరితహారాలు
  • గిఫ్ట్‌ఏస్మైల్‌ ద్వారా వేలమందికి ఆపన్నహస్తం.. ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, అభిమానులు, స్నేహితులు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. రక్తదానం శిబిరాలు నిర్వహించారు. హరితహారం కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గిఫ్ట్‌ఏస్మైల్‌ కార్యక్రమం ద్వారా వేలమందికి అపన్నహస్తం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. 2,216 మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రక్తదానం చేశారు. దీనిని ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌'లో నమోదు చేయనున్నట్టు దాని ప్రతినిధి వసుధా అశోక్‌ తెలిపారు. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, అధికారులు ప్రగతిభవన్‌లో ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

ట్విట్టర్‌లో ట్రెండ్‌

కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పేదవారికి అదుకొని సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పోస్ట్‌చేసి గిఫ్ట్‌ఏస్మైల్‌ హ్యాష్‌ ట్యాగ్‌ పెట్టారు. హ్యాపీబర్త్‌డేకేటీఆర్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ జాతీయస్థాయిలో టాప్‌లో నిలిచింది. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా బహ్రేన్‌ టీఆర్‌ఎస్‌ ఎ న్నారైశాఖ ఆధ్వర్యంలో లేబర్‌ క్యాంపులో మొక్కలను నాటారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

కళాకారుల కోసం టీ కల్చర్‌ యాప్‌ 

తెలంగాణ కళల ఖజానా అని సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా భాషా సాంస్కృతికశాఖ రూపొందించిన ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను శుక్రవారం రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అనేకమంది జానపద, గిరిజన, శాస్త్రీయ, లలిత కళాకారులున్నారని.. వారి వివరాల డాటాబేస్‌, మొబైల్‌ యాప్‌ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

హిమాచల్‌ గవర్నర్‌ దత్తాత్రేయ శుభాకాంక్షలు 

మంత్రి కేటీఆర్‌కు హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఆలోచనలతో, సరికొత్త టెక్నాలజీ ద్వారా సమాజాభివృద్ధి సాధ్యమనే ఆలోచనలతో కరోనా విపత్కర సమయంలో చురుకుగా పనిచేస్తున్న కేటీఆర్‌ అభినందనీయుడని కొనియాడారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని దత్తాత్రేయ ఆకాంక్షించారు. 

హ్యాపీబర్త్‌డే బ్రదర్‌: ఏపీ సీఎం జగన్‌

మంత్రి కేటీఆర్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మీకు ఆరోగ్యాన్ని, సంతోషాలను ప్రసాదించాలి’ అంటూ ట్వీట్‌చేశారు. ‘ధన్యవాదాలు అన్నా’ అంటూ కేటీఆర్‌ రీ ట్వీట్‌చేశారు. ఏపీ మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, కొడాలి నాని, ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్‌, ఎమ్మెల్యేలు రోజా, విడుదల రజని, గంటా శ్రీనివాస్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.

అన్నయ్యా! నువ్వు రాక్‌స్టార్‌ మంత్రి కేటీఆర్‌కు కవిత బర్త్‌డే విషెస్‌

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు ఆయన సోదరి నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు కలిసి దిగిన చిన్ననాటి ఫొటోను షేర్‌ చేస్తూ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. తనలాంటి చెల్లెలిని కలిగి ఉన్నందుకు అదృష్టవంతుడివి అని అంటూనే, రాక్‌స్టార్‌ సోదరుడు ఉన్నందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘ఏదో సామెత ఉన్నట్టు.. మన పొరుగువాళ్లను, తోబుట్టువులను ఎంచుకోలేం. నాలాంటి చెల్లెలు ఉన్నందుకు నువ్వు ఎంత అదృష్టవంతుడివి.. అయితే, ఈ రోజు నీ పుట్టినరోజు. నీలాంటి రాక్‌స్టార్‌ అన్నయ్య ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నయ్యా!’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. స్పందించిన మంత్రి కేటీఆర్‌.. ‘అణుకువతో ఉండే నా బుజ్జి చెల్లికి కృతజ్ఞతలు’ అని రిైప్లె ఇచ్చారు.
logo