ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 02:42:54

4 జిల్లాలకు 600 టీఎంసీలు కావాలి

4 జిల్లాలకు 600 టీఎంసీలు కావాలి

  • గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులు మాకు నష్టం
  • శ్రీశైలం మరమ్మతులకు 900 కోట్లు కావాలి
  • ఏపీ సీఎం జగన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కనీసంగా 600 టీఎంసీల నీటిని అందించాల్సి ఉన్నదని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారంనాటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం అనంతరం ఏపీ ప్రభుత్వం తరఫున పత్రికా ప్రకటన విడుదలైంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం చెన్నైకి తాగునీటిని అందించేందుకు 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు పది టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని జగన్‌ పేర్కొన్నారు. చెన్నై తాగునీరు, ఏపీలోని ఆరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు తీరిన తర్వాతనే శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలన్నారు. ఎగువ రాష్ర్టాలు, ఏపీ వినియోగించుకోగా ఇంకా ఏటా 1400 టీఎంసీల గోదావరిజలాలు సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు. తెలంగాణ గోదావరి జలాల వినియోగాన్ని పెంచుకోవడం వల్ల ఏపీకి ఇబ్బంది అని చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్‌, డ్యాంకు మరమ్మతులు నిర్వహించాల్సి ఉన్నదని, దీనికి రూ.900 కోట్లు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.logo