గురువారం 28 మే 2020
Telangana - May 18, 2020 , 01:20:58

49 కిలోమీటర్ల సొరంగం

49 కిలోమీటర్ల సొరంగం

 • ఆసియాలోనే అతి పొడవైనది
 • 143 మీటర్ల లోతు మహాబావి
 • దేవాదులలో అపూర్వ నిర్మాణాలు
 • మూడోదశలో సుదీర్ఘ హైడ్రాలిక్‌ టన్నెల్‌
 • రామప్ప నుంచి దేవన్నపేట వరకు నిర్మాణం
 • కరోనా కాలంలోనూ ఆగని నిర్మాణ పనులు
 • 9 జిల్లాల్లో 6.21 లక్షల ఎకరాలు సస్యశ్యామలం 
 • సొరంగం ప్రత్యేకతలు
 • విస్తీర్ణం: 6 మీటర్లు  
 • పొడవు:49.06 కిలోమీటర్ల్లు 
 • ప్రారంభంలో లోతు:114 మీటర్ల్లు  
 • చివరన లోతు 165 మీ.

ఏదైనా అద్భుతం తెలంగాణలోనే సాధ్యం. ప్రకృతి విరుద్ధంగా నీరు పల్లాన్ని వదిలి.. పైపైకి పారడం తెలంగాణలోనే వీక్షణం. అతి తక్కువ వ్యవధిలో అసాధారణ నిర్మాణాలు.. కాళేశ్వరం వంటి.. బహుళదశల ఎత్తిపోతల పథకాలు తెలంగాణలోనే చూశాం. మరో అద్భుత మానవ నిర్మాణానికి ప్రతీక దేవాదుల. ఆసియాలోనే 49 కిలోమీటర్ల అతి పొడవైన సొరంగం.. 143 మీటర్ల  అత్యంత లోతైన సర్జ్‌పూల్‌.. దేవాదుల ఎత్తిపోతలలో కండ్లు చెదిరిపోయేలా కనిపిస్తున్న జలదృశ్యం. 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ అద్భుతాలు సృష్టిస్తున్నది. అనేక రికార్డులను కూడా సొంతం చేసుకుంటున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకా న్ని ప్రభుత్వం రికార్డు సమయంలో నిర్మించింది.  దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోనే అతి పొడవైన హైడ్రాలిక్‌ టన్నెల్‌ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగిస్తున్నది. ములుగు జిల్లా రామప్ప నుంచి వరంగల్‌ అర్బన్‌ జిల్లా దేవన్నపేట (ధర్మసాగర్‌) వరకు సాగే ఈ సొరంగం పొడవు 49 కిలోమీటర్లు. ఇప్పటికే 44.7 కిలోమీటర్ల సొరంగం పూర్తయింది. దేవన్నపేట వద్ద నిర్మిస్తున్న సర్జ్‌పూల్‌, పంప్‌హౌజ్‌ సైతం ఆసియాలోనే అతిలోతైనవి కావ డం మరో రికార్డు. 143 మీటర్ల లోతులో వీటిని నిర్మిస్తున్నారు. ఆసియాలోని సొరంగమార్గాల్లో బస్‌వేలు, రైల్వేలున్నా నీటిని తరలించేందుకు దేవాదులకు మించిన పొడవైన సొరంగమార్గం మరెక్కడా లేదని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. దేవాదుల మూడోదశ పనుల్లో ప్రధానమైన సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. 

ములుగు, వరంగల్‌రూర ల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల గుండా (రామప్ప, బండారుపల్లి, ఇంచెం చెరువుపల్లి, అబ్బాపూర్‌, గోరికొత్తపల్లి, వసంతాపూర్‌, మాందారిపేట, మైలా రం, ల్యాదెళ్ల, సిద్దాపూర్‌, పెగడపల్లి, భీమారం, దేవన్నపేట) ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ వరకు ఈ సొరం గం వెళ్తుంది. రామప్ప నుంచి దేవన్నపేట వరకు 49.06 కిలోమీటర్లు. ఇందులో సాఫ్ట్‌రాక్‌ టన్నెల్‌ 7.6 కిలోమీటర్లు కాగా, హార్డ్‌రాక్‌ 41.24 కిలోమీటర్లు. ఇందులో సాఫ్ట్‌రాక్‌ 4.7 కిలోమీటర్లు, హార్డ్‌రాక్‌ టన్నెల్‌ దాదాపు 40 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. రామప్ప వద్ద భూ ఉపరితలం నుంచి త క్కువ లోతులో ప్రారంభమై హసన్‌పర్తి మండలం భీమారం వద్ద 114 మీటర్ల లోతు నుంచి సొరంగం తవ్వుతున్నారు. అది ధర్మసాగర్‌ వరకు 165 మీటర్లకు చేరుతుంది. శాయంపేట మండలం చలివాగు కింది (22.8 మీటర్ల లోతులో) నుంచి ఈ సొరంగం తవ్వుతున్నారు. ఈ మార్గంలో ఎనిమిది షాఫ్ట్‌లు (పెద్ద బావిలాగా) నిర్మించారు. ఒక్కో షాఫ్ట్‌ 10 మీటర్ల వ్యాసార్థంలో ఉంటుంది. 10 ఆడిట్‌ పాయింట్లు ఏర్పాటుచేశారు. ఆడిట్‌ పాయింట్‌ నుంచి నేరుగా సొరంగంలోకి భారీ వాహనాలు వెళ్లేందుకు అనువుగా (ర్యాంప్‌) ఉంటుంది.


లోతైన సర్జ్‌పూల్‌, పంప్‌హౌజ్‌..

దేవాదుల మూడోదశ పనుల్లో నిర్మించే సర్జ్‌పూల్‌, పంప్‌హౌజ్‌లది ప్రత్యేక రికార్డే. ఆసియాలోనే ఇంతలోతైన సర్జ్‌పూల్‌, పంప్‌హౌజ్‌లు మరెక్కడా లేవు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అన్నపూర్ణ రిజర్వాయర్‌ వద్ద ఉన్న సర్జ్‌పూల్‌ (మహా బావి) 92 మీటర్ల లోతు ఉండగా, దేవాదులలో భాగంగా దేవన్నపేటలో నిర్మిస్తున్న పంప్‌హౌజ్‌ దాదాపు 26 మీటర్ల విస్తీర్ణంతో 143 మీటర్ల లోతు, సర్జ్‌పూల్‌ను 137 మీటర్ల లోతుతో నిర్మిస్తున్నారు. ఈ పంప్‌హౌజ్‌ను ఇంకా 58.4 మీటర్లు, సర్జ్‌పూల్‌ను మరో 54 మీటర్లు లోతు తవ్వాల్సి ఉన్నది. పంప్‌హౌజ్‌లో 32 మెగావాట్ల మూడు భారీ మోటర్లు బిగించేందుకు వీలుగా ఏర్పాట్లుచేస్తున్నారు. లాక్‌డౌన్‌లోనూ పనులు ఆగలేదు. వివిధ రాష్ర్టాలకు చెందిన 1,800 మంది పనుల్లో నిమగ్నమయ్యారు.

అనేక ప్రత్యేకతలు సొరంగం సొంతం

ఈ సొరంగ మార్గానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఆరుమీటర్ల విస్తీర్ణంతో (డయా) సాగే సొరంగమార్గం అతిపొడవైనది. రామప్ప వద్ద సముద్రమట్టానికి (సొరంగం జీరో పాయింట్‌ వద్ద) 187.60 మీటర్ల నుంచి దేవన్నపేట వద్ద నిర్మిస్తున్న సర్జ్‌పూల్‌, పంప్‌హౌజ్‌కు వచ్చి చేరేవరకు అది 161 మీటర్లుగా ఉంటుంది. అంటే రామప్ప జీరో పాయింట్‌ నుంచి (గ్రావిటీ ద్వారా) దేవన్నపేటకు 26 మీటర్ల పల్లం ఉండేలా డిజైన్‌చేశారు. దేవన్నపేట సర్జ్‌పూల్‌కు చేరిన నీటిని పైప్‌లైన్‌ ద్వారా 6.86 కిలోమీటర్ల దూరంలో ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి తరలిస్తారు. నెలకు వంద మీటర్ల చొప్పున సొరంగాన్ని తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా ప్రతికూల పరిస్థితులతో కొంత ఆలస్యమవుతున్నది.

ఏడాదిలోగా దేవాదుల పూర్తి

గోదావరిపై నిర్మిస్తు న్న ప్రాజెక్టుల్లో అతిపొడవైన, కష్టసాధ్యమైన సొరంగమే కాదు.. ఆసియాలోనే అతి పొడవైన టన్నెల్‌. 49 కిలోమీటర్ల పొడవైన ఈ హైడ్రాలిక్‌ టన్నెల్‌ నిర్మాణం 2010లో ప్రారంభించినా పనులు 2015 నుంచే మొదలయ్యాయి. సీఎ కేసీఆర్‌ రీ ఇంజినీరింగ్‌ ద్వా రా ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తు న్నారు. టన్నెల్‌ వర్క్స్‌ నెలకు 100 మీటర్లు చేయాలని భావించినా ములుగు దాటిన తర్వాత బండారుపల్లి మధ్య చాలా ఇబ్బందు లు వచ్చాయి. అక్కడక్కడ బాటిల్‌నెక్స్‌ ఉన్నా యి. వచ్చే వానకాలంనాటికి అన్ని పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

- కొలగల బంగారయ్య, దేవాదుల సీఈlogo