గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 23:55:33

మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌

మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌

  • రాష్ట్రంలో 27కు చేరిన కేసులు
  • వైద్యారోగ్యశాఖ బులెటిన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన పలువురికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అవుతున్నది. ఆదివారం ఒక్కరోజే ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. వారిని ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. లండన్‌ నుంచి వచ్చిన ఏపీలోని గుంటూరుకు చెందిన యువకుడు (24), హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన యువకుడు (23), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడు (23), స్వీడన్‌ నుంచి వచ్చిన ఏపీలోని రాజోలుకు చెందిన యువకుడు (26), రంగారెడ్డి జిల్లా మణికొండకు చెందిన వ్యక్తి (34), దుబాయ్‌ నుంచి వచ్చిన మహిళ (50)కు పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరంతా ఈ నెల 14 నుంచి 18 తేదీల మధ్య నగరానికి వచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నమోదైన 27 మందిలో ఒకరు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, మిగిలిన 26 మందిని ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యశాఖ బులెటిన్‌ ద్వారా వెల్లడించింది.

పలువురు అనుమానితుల గుర్తింపు

ఇతర దేశాలు, రాష్ర్టాల నుంచి వచ్చినవారిని గుర్తించి పోలీసులు, రెవెన్యూ, వైద్యారోగ్యశాఖ అధికారులు గృహనిర్బంధం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి ఇటీవల ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన 10 మంది మత ప్రచారకులను గృహనిర్బంధంలోనే ఉండాలని సూచించారు. ఇల్లెందు మండలం లచ్చగూడెం పంచాయతీ కొమ్ముగూడేనికి చెందిన 14 మంది కూలీలు పనుల కోసం ఏపీకి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చారు. అధికారులు వారికి పరీక్షలు చేయించగా, కరోనా లక్షణాలు లేవని తేలింది. అనంతరం ఓ ప్రభుత్వ భవనంలో ఉంచి 14 రోజులు అక్కడే ఉండాలని సూచించారు. 

దుబాయ్‌ నుంచి ఆసిఫాబాద్‌కు వచ్చిన ఇద్దరు యువకులకు హోంక్వారంటైన్‌లో ఉండాలని పోలీసులు తెలిపారు. తమిళనాడు, గోవా నుంచి వనపర్తి జిల్లా ఆత్మకూరుకు తిరిగి వచ్చిన 8 మందికి అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలంలోని ఓ గ్రామంలో లండన్‌ నుంచి వచ్చిన వ్యక్తిని స్వీయ నిర్బంధంలో ఉంచారు. శనివారం రాత్రి ఆస్ట్రేలియానుంచి వచ్చిన ఏపీలోని ఏలూరుకు చెందిన ఓ వ్యక్తి ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో స్వగ్రామానికి బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను ఆదివారం భువనగిరి రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ నుంచి వికారాబాద్‌ జిల్లా దోమ మండలం దిర్సంపల్లికి వచ్చిన వ్యక్తిని గాంధీ దవాఖానకు తరలించారు. 


logo