గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 19, 2020 , 02:34:58

వాయుగుండం వీరవిహారం

వాయుగుండం వీరవిహారం

  • తూర్పున మొదలై పడమరకు చేరింది
  • ఈ నెల 9న మొదలైన ప్రయాణం
  • చివరగా అరేబియా సముద్రాన్ని తాకింది
  • బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

వరుసగా మూడ్రోజుల పాటు బీభత్సమైన వాన.. దెబ్బకు హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో అంతా అల్లకల్లోలం. హైదరాబాద్‌ వందేండ్ల చరిత్రలో ఎప్పుడూ కురవనంత వాన నగరాన్ని నదిలా మార్చేసింది. నగరానికి 992 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 490 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం దూసుకొచ్చి హైదరాబాద్‌పై నీళ్లు కుమ్మరించింది. అసలు వాయుగుండం ఎలా ప్రారంభమై, ఎలా రూపం మార్చుకొన్నది? అని పరిశీలిస్తే..

హైదరాబాద్‌: ఎడతెరిపి లేని వానలకు రాష్ట్రం వణికింది. దీనికంతటికి వాయుగుండమే ప్రదాన కారణం. అసలు ఇది ఎలా ఏర్పడిందంటే.. అక్టోబర్‌ 9న బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్‌కు చేరువలో తొలిసారి అల్పపీడనం ఏర్పడింది. అది తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారుతూ తన ప్రయాణాన్ని సాగించింది. 13న ఉదయం 8:30 గంటలకు 55.56 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండంగా ఏపీలోని కాకినాడ వద్ద భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. అదేరోజు రాత్రి 11:30 గంటలకు వాయుగుండంగా మారి 37.04 కిలోమీటర్ల వేగంతో హైదరాబాద్‌ మీదికి చేరింది. దాని ప్రభావంతో 13న, 14న తెలంగాణ అంతటా, ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారి దక్షిణ మధ్య మహారాష్ట్ర మీదుగా అరేబియా సముద్రంవైపు వెళ్లిపోయింది.

వందేండ్ల రికార్డు బ్రేక్‌

తీవ్ర వాయుగుండంతో తెలంగాణ, ఏపీ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దెబ్బకు హైదరాబాద్‌లో శతాబ్దం కిందటి రికార్డు బద్దలైంది. అక్టోబర్‌లో ఎప్పుడూ నమోదు కాని వర్షపాతం నమోదైంది. 1903 అక్టోబర్‌ 6న 11.71 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది అక్టోబర్‌ 14న 19.18 సెం.మీ. వర్షం పడింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 150% అధిక వర్షం కురవగా, ఒక్క హైదరాబాదే సాధారణం కంటే 411% అధిక వర్షపాతాన్ని నమోదు చేసింది.

ఎందుకింత తీవ్ర ప్రభావం అంటే..

వాయుగుండం తూర్పు నుంచి పడమర దిశ గా ప్రయాణించింది. ఈ ప్రయాణంలో ఏపీ, తెలంగాణ, నార్త్‌ ఇంటీరియర్‌ కర్ణాటక, మహారాష్ట్రలకు తాకింది. ‘సాధారణంగా మార్చి-మే, అక్టోబర్‌-డిసెంబర్‌ కాలాల్లో ఏటా అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తుఫాన్లు, వాయుగుండాలు ఏర్పడుతుంటాయి.  2013 లో ఫైలిన్‌ తుఫాను, 2014 హుద్‌హుద్‌ తుఫా ను అక్టోబర్‌లోనే ఏర్పడ్డాయి. ఇప్పుడు అక్టోబర్‌లోనే వాయుగుండం ఏర్పడింది’ అని భారత వాతావరణశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మోహపాత్ర తెలిపారు. అక్టోబర్‌లో ఏర్పడే తుఫాన్లు, వాయుగుండాలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, వాయుగుండం ప్రభావంతోనే పైన పేర్కొన్న రాష్ర్టాలన్నీ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాన్ని నమోదుచేశాయి. ఫలితంగా ఇక్కడి నేలల్లో తగినంత తేమ చేరిందని మృత్యుంజయ్‌ వెల్లడించారు.logo