శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 02:58:10

ఆర్టీఏలో మరో 6 ఆన్‌లైన్‌ సేవలు

ఆర్టీఏలో మరో 6 ఆన్‌లైన్‌ సేవలు

  • ఆన్‌లౌన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌
  • రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మీ డ్రైవిగ్‌ లైసెన్సును రెన్యువల్‌ చేయించుకోవాలంటే ఇకపై మీరు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లనక్కర్లేదు. ఇంటినుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని.. మీ పనులు ముగించుకోవచ్చు. ఇప్పటికే 5 రకాల సేవలను ఆన్‌లైన్‌లో ఉంచిన రవాణాశాఖ.. తాజాగా బుధవారం మరో ఆరు ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటినుంచే ఆన్‌లైన్‌లో సేవలు పొందవచ్చని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ సేవలతో ఆర్టీఏ కార్యాలయాల్లో పనుల కోసం ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదన్నారు. మధ్యవర్తుల ప్రమేయం, గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే ఎంపికచేసిన సేవలను పొందవచ్చని తెలిపారు. అభివృద్ధిచేస్తున్న మరికొన్ని ఆన్‌లైన్‌ సేవలను సాంకేతికంగా పరీక్షించిన తర్వాత క్రమంగా ప్రారంభిస్తామని రవాణాశాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు పేర్కొన్నారు.

తాజాగా అందుబాటులోకి వచ్చిన ఆన్‌లైన్‌ సేవలు

  • డ్రైవింగ్‌ లైసెన్స్‌ పునరుద్ధరణ
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌లో చిరునామా మార్పు
  • ప్రమాదకర లైసెన్స్‌ను ఆమోదించడం
  • గడువు ముగిసిన లెర్నర్‌ లైసెన్స్‌ స్థానంలో కొత్త ఎల్‌ఎల్‌ఆర్‌
  • వాహన తరగతిని చేర్చడానికి అభ్యాస లైసెన్స్‌ 
  • గడువు ముగిసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం లెర్నర్‌ లైసెన్స్‌


logo