శనివారం 04 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 01:56:53

జీవించు.. ప్రేమించు

జీవించు.. ప్రేమించు

  • అందరికీ ఆప్యాయతను పంచేలా తెలంగాణ పట్టణాలు
  • రాష్ట్రంలో పట్టణాల రూపురేఖలను  మారుస్తాం
  • హైదరాబాద్‌ అత్యంత నివాసయోగ్యమైన నగరం
  • పూర్తికావస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు
  • రెండోదశ మెట్రో డీపీఆర్‌ సిద్ధం
  • పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌
  • మున్సిపల్‌, పట్టణాభివృద్ధి వార్షిక నివేదిక విడుదల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అందరూ హాయిగా జీవించేలా.. అందరినీ ప్రేమించేలా తెలంగాణ పట్టణాల రూపురేఖలను మారుస్తామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. నూతన పురపాలక చట్టం ద్వారా ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను చేపట్టిందని పేర్కొన్నారు. పట్టణాల పురోగతి సాధించడానికి ప్రభుత్వంతోపాటు పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. బుధవారం ప్రగతిభవన్‌లో పట్టణాభివృద్ధి, పురపాలక పరిపాలనశాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. పట్టణాన్నింటినీ ప్రజలు జీవించేందుకు అనుకూలంగా లివబుల్‌ , లవబుల్‌ సిటీలుగా మార్చాలన్న బృహత్తరమైన , దీర్ఘకాలిక లక్ష్యంతో తెలంగాణ పురపాలక శాఖ పనిచేస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పట్టణాల్లో ప్రజలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలపైప ప్రస్తుతం తమ దృష్టి ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, విప్‌ బాల్క సుమన్‌, మున్సిపల్‌ , పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌, జలమండలి ఎండీ దానకిశోర్‌, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి , సీడీఎంఏ సత్యనారాయణ పాల్గొన్నారు. 

టీఎస్‌ బీ పాస్‌ 

2019 మున్సిపల్‌చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో భవనాలు, లేఔట్‌ అనుమతి కోసం ‘టీఎస్‌-బీపాస్‌' పేరుతో సరికొత్త విధానాన్ని ప్రకటించారు. 75 చదరపు గజా ల స్థలంలో నిర్మాణానికి దరఖాస్తుదారు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి.  దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణ పత్రం ఆధారంగా 500 చదరపు మీటర్ల విస్తీర్ణం, 10 మీటర్ల ఎత్తు ఉండే భవనాలకు తక్షణ అనుమతి ఇస్తారు.  

డబుల్‌బెడ్‌రూం ఇండ్లు

జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.8,598 కోట్ల అంచనావ్యయంతో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలో లక్షగృహాలు నిర్మిస్తున్నారు. పట్టణాల్లో నివసించే నిరాశ్రయుల కోసం 12 షెల్టర్‌హోంలను నిర్మించారు. వీధి వ్యాపారులచట్టం-2014 ప్రకారం వీధివ్యాపారుల పథకాన్ని నోటిపై చేశారు.  నగర ప్రజల తాగునీటి అవసరాల ను తీర్చేందుకు 602 ఎంజీడీల సామర్థ్యం హైదరాబాద్‌ జలమండలికి ఉన్నది. ప్రతి పౌరుడికి సగటున రో జుకు 150 లీటర్ల నీటిని అందించడానికి జలమండలి ఏర్పా ట్లు చేస్తున్నది. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టును రూ.25వేల కోట్ల అంచ నాతో రూపొందించారు.

పురపాలకశాఖ వార్షిక నివేదికలోని ముఖ్యాంశాలు

సర్వేల్లో ఫస్ట్‌

హైదరాబాద్‌ నగరం వరుసగా గత ఐదేండ్లుగా ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో ప్రథమస్థానంలో నిలుస్తూ వస్తున్నది. సర్వేచేసిన ఏడు భారతీయ నగరాల్లోకెల్లా సర్వోన్నత ర్యాంకింగ్‌తో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ప్రకటించారు. 2019లో జేఎల్‌ఏ నిర్వహించిన అధ్యయనంలో రియల్‌ఏస్టేట్‌ అభివృద్ధిలో ఆసియాలో రెండో అత్యంతవేగంగా అభివృద్ధి చెందే నగరంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందింది. 

పచ్చని మొక్కలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ పరిధిలో 2019-20 ఏడాదికి కోటి మొక్కలను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 72 లక్షల మొక్కలు నాటారు. హెచ్‌ఎండీఏ పరిధిలో పట్టణ అరణ్య విభాగం కోటి మొక్కల లక్ష్యంలో 90.02 లక్షల మొక్కలు నాటారు. ప్రజలకు ఆహ్లాదంతోపాటు ఆరోగ్యాన్ని అందించేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఐదెకరాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ప్రధానపార్కులను అభివృద్ధి చేశారు. దుర్గంచెరువుపై 233.85 మీటర్ల పొడువతో ప్రపంచంలోనే పొడవైన ఎక్‌స్ట్రాడోస్‌డ్‌ కేబుల్‌ బ్రిడ్జిని నిర్మిస్తున్నది. త్వరలో దీనిని ప్రారంభించనున్నారు. 

పేదవారి కడుపునింపిన ‘అన్నపూర్ణ’ 

పేదలకు రూ.5కే అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభించారు. 150 కేంద్రాల ద్వారా రోజూ 40 వేల మందికి ఆహారం అందిస్తున్నారు. లాక్‌డౌన్‌లో అదనపుకేంద్రాల ద్వారా రోజుకు 1.5 లక్షల మందికి ఉచిత భోజనం పెట్టారు. 

బస్తీ దవాఖానలు

జీహెచ్‌ఎంసీ పరిధిలో పేదల కోసం బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేసింది. హైదరాబాద్‌లో 2018లో ఏప్రిల్‌లో వీటిని ప్రారంభించారు. ప్రస్తుతం 167 బస్తీ దవాఖానలు పనిచేస్తున్నాయి. వీటిని 350కి పెంచాలని నిర్ణయించారు. 

మెట్రో రెండోదశ డీపీఆర్‌ సిద్ధం

మెట్రో ఫేజ్‌-2లో రెండు కారిడార్లు, ఒక చిన్న కారిడార్‌ ఉన్నాయి. మొదటి దాంట్లో బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు, మియాపూర్‌ నుంచి మైత్రినగర్‌ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు ఇప్పుడున్న కారిడార్‌ 5 కిలోమీటర్లు కలుపడం, రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు 31 కిలోమీటర్లు కలిపేలా డీపీఆర్‌లో ప్రతిపాదించారు. కేపీహెచ్‌బీ నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ వరకు బస్‌ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌సిస్టం ను ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన కూడా ఉన్నది. 

పట్టణ ప్రగతి

ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వ వరకు  చేపట్టిన పట్టణ ప్రగతిలో రూ.148 కోట్లతో ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించారు. వీటితోపాటు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి జీహెచ్‌ఎంసీ మినహా మిగతా మున్సిపాలిటీల్లో 4.47 లక్షల ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటుచేశారు. 67 కొత్త మున్సిపాలిటీల్లో 1.53 లక్షల వీధిదీపాలు ఏర్పాటయ్యాయి. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 15,518 సీసీఎంఎస్‌లను ఏర్పాటుచేశారు.  సీడీఎంఏ భువన్‌ సహాయంతో పట్టణాలు, నగరాల్లోని ఆస్తుల జియోట్యాగింగ్‌ మొదలైంది. 72 మున్సిపాలిటీల్లో 12.5 లక్షల భవనాలను మ్యాపింగ్‌ చేశారు.  దీంతోపాటు కొత్త మున్సిపాలిటీల మాస్టర్‌ప్లాన్‌లపైనా దృష్టిపెట్టారు. రాష్ట్రంలోని 140 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజారోగ్యం, మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ (పీహెచ్‌ఎంఈ) విభాగం నీటిసరఫరా, మురుగునీటి పారుదల, వర్షపునీరు, మురుగు నీటినిర్వహణ ప్రణాళికలు రూపొందిస్తున్నది. 


logo