శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:11:59

శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం

శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుమల, నమస్తే తెలంగాణ: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు శాస్ర్తోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు తీసుకొచ్చారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ నిర్వహించారు. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని ఆలయంలోని రంగనాయక మండపంలో ప్రతిష్ఠించారు. 9 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

యథావిధిగా శ్రీవారి దర్శనలు: టీటీడీ   

భక్తులకు శ్రీవారి దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కొవిడ్‌ బారిన పడిన అర్చకులు అందరూ కోలుకున్నారని తెలిపారు. ఎస్వీబీసీని యాడ్‌ ప్రీగా మార్చిలని నిర్ణయించినట్టు గురువారం ఆలయం ఎదుట  మీడియాకు వెల్లడించారు. ప్రతి ఏడాది తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను మూడురోజులపాటు ఏకాంతంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో చినజీయర్‌స్వామి, టీటీడీ  ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo