ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 01:13:24

అంకాపూర్‌ సాగు పద్ధతులు భేష్‌

అంకాపూర్‌ సాగు పద్ధతులు భేష్‌

  • కొనియాడిన సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రి వాసులు
  • సీఎం కేసీఆర్‌ సూచన మేరకు అంకాపూర్‌ సందర్శన

ఆర్మూర్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలోని అంకాపూర్‌లో రైతుల సాగు పద్ధతులు అద్భుతమని, అభివృద్ధిలో ఈ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలిచిందని సీఎం దత్తత గ్రామమైన యాద్రాది భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి వాసులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆధ్వర్యంలో బుధవారం వాసాలమర్రి గ్రామస్థులు 270 మంది పది బస్సుల్లో క్షేత్ర పర్యటన కోసం అంకాపూర్‌ వచ్చారు. సాగు పద్ధతులు, మార్కెటింగ్‌ విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు.

నీటి పొదుపునకు ఏర్పాటు చేసిన కుండీలు, డ్రిప్‌ విధానంలో సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా పంటలు ఎలా పండించాలో అంకాపూర్‌ రైతులు వారికి వివరించారు. గ్రామాభివృద్ధికి అన్ని కులాలతో కలిసి సర్వసమాజ్‌ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. అంకాపూర్‌ గ్రామం కాదని పట్టణమని, ఇక్కడి అభివృద్ధిని మాటల్లో చెప్పలేమని.. సీఎం కేసీఆర్‌ తెలిపిన విధంగానే అంకాపూర్‌లో సాగు పద్ధతులు, అభివృద్ధి తీరు బాగుందని వాసాలమర్రి వాసులు కొనియాడారు. అంకాపూర్‌ను సందర్శించిన వారిలో డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, వ్యవసాయ అధికారులు, వాసాలమర్రి సర్పంచ్‌ ఆంజనేయులు, రైతులు, గ్రామస్థులు ఉన్నారు.